వేడెక్కిన 'ఉండి' వైసీపీ రాజకీయం.. ఏం జరుగుతోంది?

 

అధికారం చేతిలో ఉంటే తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయటం తేలిక. ఒకవేళ ఎవరైనా అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయినా, వారి పార్టీ అధికారంలో ఉందనుకోండి ఆయా నేతలు తమ తమ నియోజక వర్గాల్లో అనధికార ఎమ్మెల్యేలుగా కూడా చలామణి కావచ్చు. బదిలీలు, పోస్టింగ్లు అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకోవటాలు ఇలా ఒక్కటని కాదు ఇంకా ఎన్నెన్నో చేయొచ్చు. అయితే ఇలాంటి వారికి అన్నివేళల్లో కాలం కలిసి వస్తోందని లేదు ఒక్కోసారి స్వపక్షం లోనే చెక్ పెట్టే వారుండొచ్చు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇదే జరుగుతోంది. పశ్చిమలో ఉండి నియోజకవర్గానికి ఆంధ్ర ప్రదేశ్ లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం ఎప్పట్నుంచో జరుగుతోంది. రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి ఉండి నియోజకవర్గం కంచుకోట. గతంలో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచినప్పుడు, మొన్నటి ఎన్నికల్లో ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీచినపుడు కూడా ఇక్కడి ఓటర్లు టిడిపికే పట్టం కట్టారంటే ఆ పార్టీ పట్ల స్థానికులకు ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ విషయం అలా ఉంచితే 2019 ఎన్నికల్లో ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసిన పీవీఎల్ నరసింహరాజు ఓడిపోయారు కానీ, రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన అనధికార ఎమ్మెల్యేగా చలామణి కావడం మొదలు పెట్టారు. అధికారులు అసలు ఎమ్మెల్యే కంటే కొసరు ఎమ్మెల్యేకి ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. అధికార కార్యక్రమాల్లోనూ పీవీఎల్ హవా చలాయిస్తున్నారు అంటే ఆ సార్ కు అధికార యంత్రాంగం ఏ స్థాయిలో గౌరవిస్తుందో గ్రహించవచ్చు. అటువంటి పీవీఎల్ నరసింహరాజుకి ఇప్పుడు సొంత పార్టీలోనే ఎదురు గాలి మొదలైంది. కొందరు నేతలకు ఆయన వైఖరి రుచించడం లేదు, దీంతో సదరు అనధికార ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వేరు కుంపటి పెట్టారు.
దీనికి ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజును పెద్దతలకాయగా పెట్టుకున్నారు. గత ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి విముఖత చూపిన సర్రాజు తమ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రస్తుతం యాక్టివ్ రోల్ పోషించడం మొదలు పెట్టారు. ఇదే చివరకు పీవీఎల్ నరసింహరాజు, సర్రాజు మధ్య ఆధిపత్య పోరుగా పరిణమించింది. ఉండిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మొదటి నుంచి అనేక మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. మొదట్లో ఈ నియోజక వర్గం ఇన్ చార్జిగా మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు వ్యవహరించేవారు. గత ఎన్నికలకు ముందు ఆయన పోటీ చేయడానికి ఇష్టపడలేదు. ఈ పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తనైన పీవీఎల్ నరసింహరాజును తెరపైకి తెచ్చారు.

ఆయనకే ఉండి ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆ తర్వాతి ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ను కూడా ఇచ్చారు. కానీ నాటి ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు, అంతటితో ఆయన హుందాగా ఊరుకుంటే బావుండేదేమో కానీ, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన రూటు మార్చి నియోజక వర్గాల్లో జరిగే అధికార, అనధికార కార్యక్రమాలన్నింటి లోనూ తలదూర్చడం మొదలుపెట్టారు. అన్నింటా తనదే పైచేయిగా ఉండేలా చక్రం తిప్పుతున్నారు, ఆ  మధ్య కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. నాకు పార్టీలోకి రావడం ఇష్టం లేదు వైయస్ జగన్ పిలిచి మరీ టికెట్ ఇవ్వడంతో పోటీ చేశాను, పార్టీ అభ్యర్ధులకు ఎన్నికల్లో పది కోట్లు, ఎనిమిది కోట్ల చొప్పున ఖర్చుల కోసం ఇచ్చారు నేను మాత్రం ఆ సొమ్ము తీసుకోలేదు అంటూ పీవీఎల్ నరసింహరాజు చెప్పుకొచ్చారు.

ఆయన అలా మాట్లాడినా కూడా పార్టీ పెద్దలు లైట్ తీసుకున్నారు, దీంతో ఆయన తనకు ఇక తిరుగులేదనుకున్నారేమో మరింత స్పీడు పెంచినట్టు భోగట్టా. ఈ దశలో పీవీఎల్ వ్యవహార శైలి కొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రుచించలేదు. క్రమేపీ వారిలో అసంతృప్తి రాజుకోవడం మొదలైంది, అది కాస్త వర్గపోరుకు దారి తీసింది. మరో వర్గం నేత మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు తెరపైకి తెచ్చారు అసంతృప్తివాదులు. కొన్ని రోజుల క్రితం వారంత పీవీఎల్ తీరుపై బహిరంగం గానే ఆక్రోశం వెళ్లగక్కారు. ఉండి నియోజక వర్గ ఇన్ చార్జిగా ఆయన్ని తప్పించి పాతపాటి సర్రాజుకు ఆ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ తెరపైకి తెచ్చారు. అంతేగాకుండా పీవీఎల్ వైఖరి గురించి అమరావతి వెళ్లి పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్ళాలనే నిర్ణయానికి వచ్చారట. ఉండి వ్యవహారం ఒక్కసారిగా రోడ్డెక్కడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అలర్టైంది.

పీవీఎల్ ని, సర్రాజుని కూర్చోబెట్టి విషయాన్ని సెటిల్ చేయాలని పార్టీలో మరో ముఖ్యనేత కొత్తపల్లి సుబ్బరాయుడికి బాధ్యతలు అప్పగించింది. ఆ ఇద్దరినీ అమరావతికి పిలిచిన సుబ్బరాయుడు విషయాన్ని ఇప్పటికైతే సెటిల్ చెయ్యగలిగారు. నియోజకర్గ ఇన్ చార్జిగా పీవీఎల్ కొనసాగుతారు, అదే సమయంలో మిగతా వ్యవహారాలు మీరు చూసుకోండి అంటూ పాతపాటి సర్రాజుకు సూచించారు. ఈ ఒడంబడికకు ఇద్దరు నేతలు అంగీకరించడంతో తాత్కాలికంగా ఉండి వివాదం సద్దుమణిగినట్టయింది. అంతేకాదు అప్పట్నుంచీ ఇద్దరు నేతలు అన్ని కార్యక్రమాలకు కలిసే హాజరవుతున్నారనుకోండి అది వేరే విషయం. అయితే ఇరు వర్గాల్లోనూ అసంతృప్తి మాత్రం చల్లారలేదని అది ఎప్పుడో ఒకప్పుడు బట్టబయలవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు, చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.