ఎవరికి ఏ స్థానాలు ఇవ్వాలో తెలియక అయోమయంలో పడ్డ గులాబీ వర్గ నేతలు....

 

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితిలో నెలకొన్న పరిస్థితి మందెక్కువయితే మజ్జిగ పల్చన అన్న సామెతను తలపిస్తోంది. వాస్తవానికి టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దూకుడు ప్రదర్శించింది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. తొలుత గ్రామ, ఆ తర్వాత మండల, పట్టణ కమిటీలను ఎన్నుకొంది. ఇక మిగిలింది మున్సిపాలిటి, మున్సిపల్ కార్పొరేషన్ ల కమిటీలే అయితే మండల కమిటీల ఎన్నికలు పూర్తయి నెల గడిచినా మునిసిపల్ కమిటీలను మాత్రం ప్రకటించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయా నియోజక వర్గాల పార్టీ ఇన్ చార్జిలు సాహసించటం లేదు.

ఒక్కో పదవికి పదిమందికీ తక్కువ కాకుండా ఆశావహులు పోటీగా ఉండడం మెజారిటీ కార్యకర్తలు తమకు కీలక పదవులు కావాలని ఒత్తిడి తెస్తుండడంతో ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మెజారిటీ మున్సిపాల్టీల్లో కనీసం వార్డు కమిటీలను కూడా అధికారికంగా ప్రకటించలేదు పరిస్థితి ఏర్పడినట్లు గులాబీ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. నిజానికి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి చాలాయేళ్ళపాటు సంస్థాగత ఎన్నికల లేవు.

ఉద్యమం తొలి దశలో ఉన్నప్పుడు పార్టీ పదవులు తీసుకొనేందుకు చాలా చోట్ల కార్యకర్తలే దొరకలేదు. కాలక్రమేణ ఉద్యమం ఊపందుకోవడం టీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదగడంతో పార్టీ పదవులకు పోటీ ఏర్పడుతూ వస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పోటీ మరింత తీవ్రంగా మారింది. దీంతో మొదటి నుంచి పార్టీలో ఉన్నవారితో పాటు మధ్య మధ్యలో ఇతర పార్టీల నుంచి చేరిన వారితో కారు పార్టీలో ఓవర్ లోడ్ అయిందట దీంతో ఎవరెవరికి ఏ ఏ సమీకరణాలతో పదవులివ్వాలో తేల్చుకోలేని పరిస్థితి నెలకొందనే చర్చ టీఆర్ఎస్ లో జోరుగా సాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఖానాపూర్, మంచిర్యాల, లక్సెట్టిపేట, చెన్నూరు, బెల్లంపల్లి, మందమర్రి, క్యాతన్ పల్లి, నస్పూర్, కాగజ్ నగర్ మున్సిపాలిటీలున్నాయి.

వీటిలో కొన్నింట టీఆర్ఎస్ వార్డు కమిటీలను పూర్తి చేశారు. మెజారిటీ మునిసిపాలిటీల్లో వార్డు సమన్వయ కమిటీలు, పట్టణ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. ఆశావహులు అందరినీ ఆ కమిటీల్లో సభ్యులుగా చేశారు. కానీ వార్డు మున్సిపల్ అధ్యక్షులను మాత్రం అధికారికంగా ఖరారు చేయడం లేదు. పార్టీ ఎమ్మెల్యేలు ఇన్ చార్జిలను ఆశావహుల్లో ఎవరడిగినా నీకే ఇస్తామని వారు చెబుతున్నారని సమాచారం.

బెల్లంపల్లి మున్సిపాలిటీ అధ్యక్ష పదవి కోసం అయిదారుగురు పోటీలో ఉన్నారు. వీళ్లంతా ఎమ్మెల్యే చిన్నయ్య వెంటపడుతున్నారు. అందరూ కావాల్సినవారే కావడంతో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట ఇతర మున్సిపాలిటీల్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.ఇక ఎవరెవరికి ఏ స్థానాలు ఇస్తారో వేచి చూడాలి.