ఎందుకు సంపాదించాలి!

చాలా రోజుల క్రితం ఓ పిసినారి ఉండేవాడు. అతని యావంతా డబ్బు మీదే! సాయంత్రమయ్యేసరికి ఇంకొకరితో కన్నీళ్లు పెట్టించయినా, తన కడుపు కొట్టుకుని అయినా వీలైనంత డబ్బుని పోగుచేసుకోవాలన్నదే అతని తాపత్రయం! రోజురోజుకీ ఇంట్లో డబ్బు మూటలు పోగవుతున్న కొద్దీ పిసినారికి వాటిని పెంచుకోవాలన్న యావ పెరగసాగింది. ఇలా కాలం గడిచేకొద్దీ ఒకటి కాదు, రెండు కాదు... పదుల కొద్దీ నాణెపు మూటలు పోగవడం మొదలయ్యాయి.

 

ఇంతవరకూ బాగానే ఉంది! కానీ ఎక్కడైతే నిధి ఉంటుందో అక్కడ అశాంతి తప్పదు కదా! ఎప్పుడు ఎవరి కన్ను పడుతుందా? ఎవరు వచ్చి తన నెత్తిన ఒక దెబ్బ వేసి ఆ మూటలను దోచుకుపోతారా? అని బిక్కుబిక్కుమంటూ పిసినారి కాలం గడపడం మొదలుపెట్టాడు. ఈ భయంతో అతనికి రాత్రిళ్లు కూడా సవ్యంగా నిద్ర పట్టేది కాదు. తన ఆస్తంతా ఇలా దోచుకుపోవడానికి సిద్ధంగా ఉండటమే... తనలోని అశాంతికి కారణం అని అర్థమైంది పిసినారికి. దాంతో అతను ఒక ఉపాయాన్ని ఆలోచించాడు.


ఒకరోజు తన నాణెపు మూటలన్నీ తన బండిలో వేసుకుని పట్నానికి బయల్దేరాడు. అక్కడ నేరుగా ఒక బంగారపు దుకాణానికి చేరుకున్నాడు. తన వద్ద ఉన్న నాణెలకు బదులుగా బంగారాన్ని ఇవ్వమని బేరం పెట్టాడు. దుకాణం యజమానికి ఇదంతా చాలా సాధారణమైన విషయంలా తోచింది. వెంటనే ఆ నాణేలన్నింటినీ తీసుకుని తన పనివారితో లెక్కపెట్టించాడు. వాటి లెక్కకు తగినంతగా... ఒక ఇటుకరాయంత బంగారాన్ని పినినారి చేతిలో పెట్టాడు.

 

ఆ ఇటుకరాయంత బంగారాన్ని తీసుకుని పసినారి సంతోషంగా బయల్దేరాడు. కానీ దారిలో అతనికి ఇంకో అనుమానం తట్టింది. ఇంతకుముందు నాణేల మూటలు ఉన్నాయి కాబట్టి, అంత పెద్ద మూటలని దోచుకోవడం కష్టం కావచ్చు. కానీ ఇప్పుడు చేతిలో పట్టేంత బంగారపు ఇటుకని దోచుకుంటే నా గతేం కాను! నా సంపద, నా శ్రమ అంతా ఈ ఇటుకరాయంత బంగారంలోనే ఉంది కదా! మరేం చేసేది అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా మరో ఉపాయాన్ని ఆలోచించాడు.

 

పిసినారి తన ఊరి బయటకు చేరుకోగానే ఎవ్వరూ చూడకుండా చల్లగా ఒక రావి చెట్టు చాటుకి చేరుకున్నాడు. చీకటి పడేవరకూ ఉండి. ఆ చెట్టు కింద వీలైనంత పెద్ద గుంతను తవ్వాడు. తన బంగారపు ఇటుకను అందులో కప్పి... ఏమీ ఎరుగనట్లు ఊరిలోకి చేరుకున్నాడు. మర్నాటి నుంచి పిసినారి జీవితం మామూలుగానే సాగిపోయింది. జనాలని పీక్కు తినడం, తన కడుపుని మాడ్చుకోవడం, డబ్బుని పోగుచేసుకోవడం! ఇదే అతని దినచర్యగా సాగింది. కాకపోతే వారం వారం ఊరిబయటకు వెళ్లి ఆ బంగారపు ఇటుకను బయటకు తీసి తనివితీరా చూసుకుని ఇంటికి చేరుకునేవాడు.

 

ఓ వారం ఎప్పటిలాగే పిసినారి ఊరిబయట చెట్టు కిందకు వెళ్లాక... అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి మతిపోయింది. చెట్టు కింద గుంత తవ్వేసి ఉంది. బంగారపు ఇటుక మాయమైపోయింది. ఇంకేముంది! లబోదిబోమంటూ ఎడవడం మొదటుపెట్టాడు. పిసినారి ఏడుపుని చూసి అటుపక్కగా రహదారి మీద పోయేవారంతా చెట్టు కిందకి చేరుకున్నారు. వారిలో ఒక సాధువు, పినినారి భుజం మీద చేయి వేసి ఏమైందంటూ అనునయంగా అడిగాడు. పిసినారి భోరుభోరుమంటూ జరిగిందంతా చెప్పుకొచ్చాడు. సాధువు ఒక్క నిమిషం ఆలోచించి ఇలా అన్నాడు... ‘నీదేమంత పెద్ద సమస్య కాదు.

నీకు కావల్సింది గుంతను తెరిచి చూసుకోవడమే కానీ, అందులో ఉన్న ధనాన్ని వాడుకోవడం కాదు కదా! ఓ పని చేయి. ఓ బండరాయిని తీసుకుని ఆ గుంతలో పూడ్చిపెట్టు. వారం వారం వచ్చి దాన్ని చూసుకో! అదే బంగారం అనుకో. ఉపయోగపడనిదానికి, అది బండరాయి అయితేనేం, బంగారం అయితేనేం?’ అంటూ తన దారిన తను చక్కా పోయాడు.

 

పిసినారికి సాధువు మాటల్లోని మర్మం తెలిసి వచ్చింది. జీవితం కోసం డబ్బుని సంపాదించడం తప్పులేదు కానీ, డబ్బే జీవితంగా మారకూడదని బోధపడింది. రోజువారీ ఖర్చులకు, భవిష్యత్తులోని అవసరాలకు డబ్బుని సంపాదించాలే కానీ... కేవలం కూడపెట్టడం అనే ఒకే ఒక్క ఆశయంతో సంపాదన చేయకూడదని అర్థమైంది. అదే కనుక జీవితాశయం అయితే బంగారానికీ, బండరాయికీ తేడా ఏముంటుంది.

 

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

..Nirjara