ప్రార్థించే చేతులు

 

ఆయనో పేరు మోసిన వైద్యుడు. ఏదో కాన్ఫరెన్సులో పాల్గొనేందుకని దేశ రాజధానికి బయల్దేరాడు. కానీ అంత వైద్యుడిని కూడా దురదృష్టం వెన్నాడింది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో విమానం కాస్తా మధ్యలోనే మరో ఊరిలో ఆగిపోయింది. ఒక పక్క చాలా అత్యవసరమైన కాన్ఫరెన్స్‌, మరో పక్క వాతావరణం చూస్తే ఇలా! దాంతో వైద్యునికి ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే ఆ ఊరిలో తనకు తెలిసిన మిత్రులని వాకబు చేసి ఒక కారుని అద్దెకు తీసుకున్నాడు. ఏదైతే అదయ్యిందనుకుంటూ ఆ కారులోనే తన ప్రయాణాన్ని కొనసాగించేందుకు బయల్దేరాడు.

 

ఆకాశమే కారుమబ్బులతో కమ్ముకుపోయి ఉంటే... నేల మీద మాత్రం వర్షం కురవకుండా ఉంటుందా! వైద్యుడు కారులో బయల్దేరిన కాసేపటికే హోరున గాలి, జోరున వర్షం మొదలైంది. ఓ రెండు గంటలలో గమ్యం చేరుకుందామనుకున్న వైద్యుడి ఆశ నిరాశగా మారిపోయింది. ఎడతెరిపిలేని ఆ వర్షంలో ఆయన కారు ఎటుపోతోందో కూడా అర్థం కావడం లేదు. అటుతిరిగీ ఇటుతిరిగీ చివరికి ఆ కారు ఓ పల్లెటూరికి చేరుకుంది. వర్షం తగ్గేదాకా తాను ప్రయాణం కొనసాగించడం అసాధ్యమని తేలిపోయింది వైద్యుడికి. దాంతో ఆ పల్లెటూరి చివర ఉన్న ఓ ఇంటి తలుపు తట్టాడు. ఆ తలుపు తెరుచుకుని వచ్చిన యువతికి వైద్యుడిని చూడగానే పరిస్థితి దాదాపుగా అర్థమైపోయింది. వెంటనే అతడిని లోపలికి ఆహ్వానించింది.
యువతి ఇచ్చిన వేడి వేడి టీ తాగి, చలిమంట దగ్గర కాసేపు సేదతీరి... చలి నుంచి, వర్షం నుంచి హాయిగా కోలుకున్నాడు వైద్యుడు. ‘భగవంతుడు దయతలిస్తే త్వరలోనే వర్షం తగ్గిపోతుంది. మీరు ఎలాంటి ఇబ్బందీ లేకుండా గమ్యం చేరిపోతారు,’ అంటూ ఊరడించింది ఆ యువతి. ‘ఇందులో భగవంతుడు దయతలిచేది ఏముంది. మన జీవితం మన చేతుల్లో అన్నా ఉంటుంది లేకపోతే ప్రకృతి చేతుల్లో అన్నా ఉంటుంది. మధ్యలో భగవంతుడు ఎవరు?’ అంటూ కాస్త చిరాకుపడ్డాడు వైద్యుడు.

 

వైద్యుని మాటలకు ఆ యువతి ఏం బదులు చెప్పలేదు. నిశ్శబ్దంగా లోపలి గదిలోకి వెళ్లిపోయింది. లోపలకి వెళ్లిన యువతి ఎంతకీ రాకపోవడంతో ఆమె ఏం చేస్తోందో చూడాలనిపించింది వైద్యుడికి. ఓ నాలుగడుగులు వేసి లోపల గదిలో అడుగుపెట్టిన అతనికి ఓ ఊయల పక్కనే మోకరిల్లి భగవంతుని ప్రార్థిస్తున్న యువతి కనిపించింది. ఆమె ఛాదస్తానికి మరోసారి నవ్వుకొని- ‘ఎందుకలా ఊయల పక్కనే ఉండి ప్రార్థిస్తున్నారు? భగవంతుడికీ ఊయలకీ ఏంటి సంబంధం?’ అని అడిగాడు వైద్యుడు.

 

వైద్యుని మాటలలో వ్యంగ్యాన్ని పట్టించుకోలేదు ఆ యువతి. ‘ఈ ఊయాలలో ఉన్న పిల్లవాడి మీదే నా ఆశలన్నీ పెట్టుకుని బతుకుతున్నాను. వీడు పుట్టగానే వాళ్ల నాన్న చనిపోయాడు. ఇప్పుడు వీడి ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే ఉంది,’ అంటూ కన్నీటిపర్యంతం అయ్యింది.

 

ఆ మాటలు వినగానే వైద్యుడిలో ఆసక్తి మొదలైంది. చటుక్కున ఊయల దగ్గరకి వెళ్లి బాబుని చూస్తూ ‘ఏమైంది బాబుకి!’ అంటూ ఆదుర్దాగా అడిగాడు. ‘బాబు గుండె చాలా బలహీనంగా ఉందట. పిల్లలకి సంబంధించి ఎవరన్నా హృద్రోగ నిపుణుడు మాత్రమే వీడికి వైద్యం చేయగలడట. నేనా పేదరాలిని. అలాంటి నిపుణుల ఖర్చుని నేను ఎలా భరించగలను. అందుకే ఏదో ఒక మార్గం చూపమని ఆ దేవుడిని నిరంతరం వేడుకుంటూ ఉంటాను. నా ప్రార్థనలు ఫలిస్తాయేమోనని ఆశగా ఎదురుచూస్తుంటాను,’ అంటూ చెప్పుకొచ్చింది.

 

ఆ యువతి చెప్పిన మాటలు విన్న వైద్యుడికి మతిపోయినంత పనయ్యింది. అప్రయత్నంగా అతని కంటివెంట నీరు రాలింది. ‘నా పేరు డా॥ అబ్రహాం. పిల్లలకి సంబంధించిన గుండెజబ్బులను నయం చేయడంలో నిపుణుడిని. నీ ప్రార్థనలే ఫలించాయో, లేక నాకు నీ సేవ చేసుకునే అదృష్టమే వరించిందో.... దేశమంతా తిరిగి చివరికి నీ ఇల్లు చేరుకున్నాను. నీ పిల్లవాడికి ఉచితంగా చికిత్స చేసే బాధ్యత నాది,’ అంటూ ఆ పిల్లవాడిని చేతులలోకి తీసుకున్నాడు.

 

మనం మానవ ప్రయత్నాన్ని ఎన్నడూ విడనాడకూడదన్నది మంచిమాటే! కానీ పరిస్థితులు మన చేయి దాటిపోయినప్పుడు... ఒకోసారి ప్రార్థనలు బలాన్ని చేకూరుస్తాయి. భగవంతుడే పలుకుతాడో లేకపోతే మన మనసులోని శక్తే దారిచూపుతుందో... కారణం ఏదైతేనేం, అసాధ్యం అనుకున్న సమస్యకి అనుకోని సులువు లభిస్తుంది. భగవంతుడే లేడనుకుంటే అది వేరే విషయం. కానీ అతని అస్తిత్వాన్ని నమ్మినప్పుడు మాత్రం ప్రార్థన తప్పకుండా ఫలితాన్ని అందిస్తుంది.

 

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

 

- నిర్జర.