అన్నిటికంటే గొప్ప రుచి!

 

మీనా అని ఒక పన్నెండేళ్ల పిల్ల ఉండేది. ఆ పిల్ల పొద్దస్తమానం ఇంట్లోనే కూర్చుని ఆడుకుంటూ ఉండేది. బడికి సరిగా వెళ్లేది కాదు. అమ్మతో పాటుగా పొలం పనులకీ వెళ్లేది కాదు. మీనా తల్లి మాత్రం కోడి కూయగానే పొలం పనులకు బయల్దేరి, చీకటి పడిన తరువాత ఎప్పుడో ఇంటికి చేరుకునేది. భర్త చనిపోయినా కూడా ధైర్యాన్ని కోల్పోకుండా నిబ్బరంగా సంసారాన్ని లాక్కువచ్చేది.

 

తల్లి శ్రమ మీనాకి అర్థమయ్యేది కాదు. పగలంతా పనిచేసి అలసిసొలసి ఇంటికి వచ్చిన తల్లిని ఇంకా అన్నం ఎప్పుడు వండుతావంటూ విసిగించేసేది. తల్లి వండిన అన్నానికి ఏదో ఒక పేరు పెట్టి సగం అవతలికి విసిరిపారేసేది. మిగతా సగాన్ని కూడా సణుక్కుంటూ గొణుక్కుంటూ తినేది. ఆ రోజు కూడా ఎప్పటిలాగే మీనా తల్లి కోసం, ఆమె వండే వంట కోసం ఎదురుచూడటం మొదలుపెట్టింది. తల్లి వచ్చిన తరువాత అన్నం ఎప్పుడు వండుతావంటూ సతాయించడమూ మొదలుపెట్టింది. కానీ మీనా తల్లికి ఆ రోజుతో ఓపిక నశించిపోయింది. ‘రేపటి నుంచి ఎలాగూ బడికి సెలవులు కదా! నువ్వు కూడా నాతో పాటు పొలం పనులకు రా. నాతో పాటు పొలానికి వచ్చి ఎంతో కొంత పనిచేస్తేనే నీకు సాయంత్రానికి తిండి దొరికేది!’ అంటూ కరాఖండిగా చెప్పేసింది.

 

మర్నాడు ఉదయం చేసేదేమీ లేక ఉసూరుమంటూ, అమ్మ వెంటే మీనా పొలానికి బయల్దేరింది. ‘అమ్మ ఎలాగూ ఏదో ఒక పనిలో మునిగిపోయి ఉంటుంది కదా! నేను పొలం గట్ల వెంబడి రోజంతా ఆడుకోవచ్చులే!’ అనుకుంది మీనా. కానీ మీనా పప్పుల ఉడకలేదు. మీనాతో చచ్చేటట్లు పనిచేయించింది వాళ్ల అమ్మ. మట్టి తవ్వించింది, తవ్విన మట్టి అవతల పోయించింది, కలుపు మొక్కలు పీకించింది... ఇలా ఒకటా రెండా! మీనా వయసు పిల్లలు చేయగలిగే పనులన్నీ చేయించడం మొదలుపెట్టింది.

 

సూర్యుడు నిదానంగా నడినెత్తికి వచ్చేశాడు. ఎండతో పాటుగా మీనా కడుపులో ఆకలి కూడా మండిపోతోంది. ‘అమ్మా బాగా ఆకలి వేస్తోంది. ఏదన్నా తింటానికి పెట్టవా!’ అని దీనంగా అడిగింది మీనా. ‘ఓస్‌ అదెంత భాగ్యం! ఆ మూటలో చద్దన్నమూ, పుల్లటి పెరుగూ తెచ్చుకున్నాను. వాటిని కలుపుకొని తినేసిరా ఫో!’ అంది తల్లి. కానీ పుల్లటి పెరుగు అన్నమాట వినగానే మీనా అకలి చచ్చిపోయింది. కడుపు మాడ్చుకుని అలాగే పొలం పనులు చేస్తూ ఉంటిపోయింది.

 

సాయంత్రం వేళయ్యింది. నీడలు నిదానంగా పెరుగుతున్నాయి. గాలిలో చల్లదనం మొదలైంది. తల్లి ఎప్పుడెప్పుడు ఇంటికి బయల్దేరుతుందా! ఎప్పుడెప్పుడు తనకి వేడిగా ఇంత అన్నం వండిపెడుతుందా అని ఎదురుచూడసాగింది మీనా. తల్లి చివరి సూర్యకిరణం కనిపించేదాకా పనిచేసి, ఇక మీనాతో పాటుగా ఇంటికి బయల్దేరింది. నిదానంగా పొయ్యి వెలిగించి వంట మొదలుపెట్టింది. తల్లి ఎంత వేగంగా వండుతున్నా మీనాకి మాత్రం యుగాలు గడుస్తున్నట్లు అనిపించింది. చివరికి తల్లి పొయ్యింలోచి అన్నం దింపి మీనాకు వడ్డించిందో లేదో... అది కాలుతుందని కూడా చూసుకోకుండా, మీనా గబగబా నోట్లో కుక్కేసుకుంది. ‘మీనా రోజూ నా వంటకి ఏదో ఒక వంక పెట్టేదానికవి కదా! సగానికి సగం పారేసేదానికవి కదా! ఇవాళ నా వంట ఎలా ఉంది?’ అని అడిగింది మీనా తల్లి.

 

‘ఏమోనమ్మా! ఇవాళ అసలు నాకు రుచి గురించే తట్టలేదు. బాగా ఆకలి వేసింది కదా... గబగబా మొత్తం తినేశానంతే!’ అని నాలుక కరుచుకుంది మీనా. ‘నీకు ఆకలి విలువ, తిండి విలువ తెలియాలనే ఇవాళ పొలంలో అలా పనిచేయించాను. కష్టపడి పనిచేసినప్పుడు తిండి విలువ తెలిసొస్తుంది. ఆ విలువ తెలిసినప్పుడు ఆహారాన్ని పారేయాలని కానీ, వంకలు పెట్టాలని కానీ అనిపించదు. అది మన కడుపు నింపుతోందన్న గౌరవం మాత్రమే ఉంటుంది. కష్టమే అన్నింటికంటే గొప్ప రుచిని ఇస్తుంది!’ అని చెప్పుకొచ్చింది తల్లి.

 

- నిర్జర.