మోసం చేసే అవకాశం వస్తే!

 

అది ఒక తీర గ్రామం. అక్కడ ఉన్నవాళ్లంతా చేపల మీదే ఆధారపడి జీవించేవారు. వాళ్లలో కొంతమంది ముత్యాల వేటకి వెళ్లి ఎంతోకొంత లాభంతో తిరిగి వచ్చేవారు. అలా ముత్యాల కోసం సముద్రపు లోతులకి వెళ్లే వారి జీవితాలు ఒకోసారి అక్కడే ముగిసిపోయేవి! అలాంటి ఒక రోజు...

 

దట్టంగా మబ్బులు కమ్ముకుని ఉన్న ఆ రోజున ఒక కుర్రవాడు ముత్యాల వేట కోసం బయల్దేరాడు. అతనికి తోడుగా ఉన్న ఒకే ఒక్క గుడ్డి తల్లి ఉరుముల శబ్దాన్ని విని, సముద్రంలోకి వెళ్లవద్దంటూ తెగ వారించింది. అయినా ఉడుకు రక్తం, ముసలి తల్లి మాటలను వినలేదు. ‘నాకేమన్నా అయితే ఇదిగో ఈ డబ్బాలో కాసిని ముత్యాలు ఉన్నాయి. వాటిని అమ్ముకో,’ అంటూ సముద్రంలోకి వెళ్లిపోయాడు. అవే అతని చివరి మాటలయ్యాయి.

 

వద్దని చెప్పినా వినకుండా సముద్రంలోకి వెళ్లి చనిపోయిన పిల్లవాడి కోసం ఆ ముసలి తల్లి విలపించని రోజు లేదు. ఆమె కన్నీటికి కొడుకు తిరిగిరాలేదు. కానీ రోజులు గడిచేసరికి ఆకలిని ఓర్చుకోవడం మాత్రం కష్టమైపోయింది. కొడుకు వెళ్తూ వెళ్తూ తనకి అప్పగించిన ముత్యాలని తీసుకుని ముత్యాల వ్యాపారి దగ్గరకి బయల్దేరింది. ముత్యాల వ్యాపారి దగ్గరకు చేరుకున్న ముసలమ్మ విషయాన్నంతా చెప్పి ‘ఎంతో కొంత ధరకు ఈ ముత్యాలను తీసుకోండి. నాకు మాత్రం కొన్నాళ్ల పాటు కడుపు నింపుకునేలా కాసిని డబ్బులు ఇప్పించండి!’ అని ప్రాథేయపడింది. ముసలమ్మను అందించిన ముత్యాలను చేతిలోకి తీసుకున్న వ్యాపారికి నోటమాటరాలేదు. అవి చాలా అరుదుగా దొరికే నల్ల ముత్యాలు. పైగా మంచి మెరుపుతో పెద్దపెద్దగా ఉన్నాయి. ‘ఏమ్మా ఈ ముత్యాలను ఇంతకుముందు ఎవరికన్నా చూపించావా!’ అని అడిగాడు వ్యాపారి. ‘లేదయ్యా! నేరుగా నీ దగ్గరకే వస్తున్నాను,’ అని బదులిచ్చింది ముసలమ్మ.

 

‘నువ్వు తెచ్చిన ముత్యాలు అత్యంత అరుదైన నల్ల ముత్యాలు. వీటితో నీ ఆకలి తీరడం ఏం ఖర్మ... పదేళ్ల తిండీ తిప్పలకు సరిపదేంత డబ్బు వస్తుంది. ఇదిగో ఈ సొమ్ములు తీసుకుని ఎవరి కంటా పడకుండా దాచుకో,’ అంటూ బంగారు నాణేల మూటను అందించాడు వ్యాపారి. జరుగుతున్న తతంగాన్నంతా వ్యాపారి కొడుకు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు. ‘నాన్నా ఆ ముసలిది గుడ్డిది. తను తెచ్చిన ముత్యాలు ఎలాంటివో ఆమెకు తెలియదు. ఆ ముత్యాల గురించి మూడోకంటికి కూడా తెలియదు. అలాంటప్పుడు నువ్వు ముత్యాల గురించి నిజం చెప్పకుండా ఉంటే సరిపోయేది కదా! ఏవో కాసిని నాణేలు విదిలిస్తే బంగారంలాంటి ముత్యాలు అప్పనంగా మన చేతికి చిక్కేవి,’ అన్నాడు నిరసనగా.

 

‘మోసం చేసేందుకు అన్ని పరిస్థితులూ అనువుగా ఉన్నప్పుడే మన మంచితనం బయటపడేది. ఈ ముత్యాల మీద ఎలాగూ నేను చాలా డబ్బే సంపాదిస్తాను. అది వ్యాపారం. మనకి కొంత లాభం మిగిలేలా చేసేది వ్యాపారం. అవతలివారి కడుపుకొట్టేది మోసం. వ్యాపారం వేరు! మోసం వేరు!’ అంటూ చెప్పుకొచ్చాడు వ్యాపారి. వ్యాపారి కొడుకుకి ఆ సంఘటనతో అటు వ్యాపారం గురించీ ఇటు వ్యక్తిత్వం గురించీ కూడా తెలిసొచ్చింది.

 

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

 

- నిర్జర.