స్నేహితులు కాస్తా శత్రువులుగా మారిపోతే!

 

అన్ని బంధాలూ అన్నివేళలా సజావుగా ఉండవు. ఒకప్పుడు ఒకే కంచం ఒకే మంచం అన్న తీరున సాగిన స్నేహాలు, మనిషి కనపడితే మొహం చాటేదాకా వస్తాయి. మాటతూలడం వల్లనో, డబ్బు వ్యవహారాలు బెడిసికొట్టడం వల్లనో... కారణం ఏదైనా కావచ్చు- స్నేహమేరా జీవితం అని పాడుకున్నవారు కాస్తా శరణమా రణమా అంటూ యుద్ధమంత్రాలు వల్లిస్తారు. మరి ఇలాంటి పరిస్థితులని దాటేదెలా?

 

మాటలు ఆపవద్దు :

పోయిన చనువు మళ్లీ తిరిగిరాకపోవచ్చు. కానీ వీలైనంతవరకూ మాటలని మాత్రం ఆపే ప్రయత్నం చేయవద్దు. మర్యాద కోసమైనా బాగున్నారా? మీ అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉంది? లాంటి కర్టెసీ సంభాషణలని కొనసాగించే ప్రయత్నం చేయండి. అది కూడా సాధ్యపడదంటారా! కనీసం ఎదురుపడినప్పుడు ఓ చిరునవ్వు నవ్వి చూడండి. లేకపోతే వారి ఉనికి జీవితాతం ఒక పుండులా సలుపుతూనే ఉంటుంది.

 

ఇతరుల జోక్యం వద్దు:

సాధారణంగా ఏదన్నా బంధం చెడిపోయిన తర్వాత... జరిగినదాని గురించి కనిపించినవారందరికీ పూసగుచ్చినట్లు వివరించడం చాలామందికి అలవాటు. దానివల్ల మన మనసుకి సాంత్వన కలుగుతుందేమో కానీ, విషయం మరింత ప్రచారం అవుతుంది. మీరన్న మాటలు అవతలివారికి చేరి తీరతాయి. అది మరిన్న గొడవలకు, అపార్థాలకు దారితీయడం వల్ల ఏ ఉపయోగమూ లేదు!

 

మనసుని మరల్చండి:

ఆ బంధం కోల్పోవడం వల్ల మీకు తీరని నష్టమే జరిగి ఉండవచ్చు. కానీ జీవితం ముందుకు సాగాల్సిందే కదా! అందుకని గతం మీద కాకుండా వర్తమానం మీదా భవిష్యత్తు మీదా దృష్టి మరల్చే ప్రయత్నం చేయండి. లక్ష్యం మీద దృష్టి పెట్టడం, కొత్త స్నేహాలను అలవర్చుకోవడం, కొత్త అలవాట్లను అనుసరించడం... వంటి చర్యలతో వీగిపోయిన బంధం నుంచి మనసుని మరల్చే ప్రయత్నం చేయండి.

 

ఏం జరిగినట్లు:

కేవలం అవతలి వ్యక్తి మూర్ఖత్వం వల్లనో, అహంకారం వల్లనో బంధం చెదిరిపోతే అది వేరే పరిస్థితి. కానీ చాలా సందర్భాలలో స్నేహం, శత్రుత్వంగా మారేందుకు ఇద్దరి బాధ్యతా ఉంటుంది. మీ వంతుగా ఏ పొరపాటు జరిగిందో విశ్లేషించుకోండి. అలాంటి విశ్లేషణ వల్ల ఒకోసారి మన వ్యక్తిత్వంలో ఉన్న తీవ్రమైన లోపాలు బయటపడవచ్చు. మున్ముందు అలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు సాయపడవచ్చు.

 

ఏమీ జరగనట్లే ప్రవర్తించండి:

అయిపోయిందేదో అయిపోయింది. ఆ గొడవని పెద్దది చేయడం, అవతలివారిని రెచ్చగొట్టడం... వంటి చర్యలు వద్దే వద్దు. అహం దెబ్బతిన్నదనో, గౌరవం మంటగలిసిందనో... మరిన్ని తప్పులకు దారితీయవద్దు. అవసరమైతే కొద్ది రోజుల సమయం తీసుకునైనా సరే ఆ గొడవ నుంచి పూర్తిగా బయటపడండి.

- నిర్జర.