విరిగిపోని పాత్రలు

 

అది ఓ చిన్న పల్లెటూరు. ఆ ఊరి చివర ఓ పూరిగుడిసె. గుడిసె పేదదే కానీ, అందులో ఉండే తండ్రీకొడుకులు మాత్రం మహా సంతోషంగా ఉండేవారు. పొద్దన లేచిందగ్గర్నుంచీ పొద్దుగూకేదాకా ఊళ్లో ఏదో ఒక పని చేసుకుని వచ్చేవారు. వస్తూ వస్తూ ఇన్ని కట్టెలు కొట్టుకు వచ్చి పొయ్యి రాజేసుకునేవారు. ఉన్నదేదో వండుకుని తినేవారు. కొంతకాలానికి కొడుకు పెళ్లి చేసుకున్నాడు. కొత్తగా వచ్చిన కోడలుతో ఆ ఇంటి సంతోషం రెట్టింపయ్యింది. తండ్రీ కొడుకు ఎప్పటిలాగే నిత్యం ఏదో ఒక పని చేసుకు వచ్చేవారు.

 

కాలం గడుస్తున్న కొద్దీ తండ్రికి ఓపిక తగ్గిపోసాగింది. అతని చేతుల్లో మునుపటి పట్టు లేదు. అతని చేతల్లో మునుపటి దుడుకు లేదు. ఇప్పుడు ఇల్లు గడిచేందుకు కొడుకూ, కోడలూ కలిసి పనికి వెళ్తున్నారు. వారికి పుట్టిన బిడ్డ ఆలనాపాలనా కూడా ముసలాయనకి అప్పగించి ఊరిలోకి బయల్దేరుతున్నారు. కొంతకాలానికి మనవడు పరుగులెత్తే వయసుకి చేరుకున్నాడు. ముసలాయన మాత్రం మరింత నీరసించిపోయాడు. భోజనం చేసేటప్పుడు కూడా ఆయన చేతులు వణుకుతున్నాయి. తినే ప్రతిసారీ కాస్తో కూస్తో కిందా మీదా ఒలకాల్సిందే!

 

భోజనాల బల్ల దగ్గర తన తండ్రి చేసే పని చూసి కొడుకూ, కొడలుకి చిరాకెత్తిపోయేది. ప్రతిరోజూ ఏదో ఒక పదార్థంతో బల్లంతా తడిసిపోవడం, ఏదో ఒక పాత్ర విరిగిపోవడం చూసి వారి కోపం నషాళానికి అంటేది. దాంతో తండ్రి భోజనాన్ని ఓ మూల ఏర్పాటు చేశాడు కొడుకు. ఆయన చేతిలోంచి జారినా పగలకుండా ఉండేందకు చెక్క పాత్రలు చేశాడు. ఇక రోజూ ఈ మూల సంతోషంగా కొడుకూ, కోడలూ, మనవడూ భోజనం చేస్తూంటు... గుడిసెలో మరో మూల ముసలాయన వణుకుతున్న చేతులతోనే తింటూ ఉండేవాడు. మధ్యమధ్యలో ఆయన కంటి నుంచి జారే కన్నీటి చుక్కని కొడుకు పెద్దగా పట్టించుకునేవాడు కాదు!

 

ఒక రోజు కొడుకూ, కోడలూ ఊళ్లో పనంతా ముగించుకొని ఇంటికి చేరుకున్నారు. అదే సమయంలో పిల్లవాడు ఓ చెక్కముక్కతో ఆడుకోవడం కనిపించింది వాళ్లకి.

‘ఏం ఆడుకుంటున్నావు బాబూ!’ అంటూ బాబుని దగ్గరకు తీశాడు కొడుకు.

‘నేను చెక్క పాత్రల్ని తయారుచేస్తున్నాను నాన్నా!’ అంటూ బదులిచ్చాడు బాబు. 

‘మంచిది! మంచిది! పాత్రలు తయారుచేశాక వాటితో ఏం చేస్తావు?’ అని గారాబంగా అడిగాడు కొడుకు.

‘ఏముందీ! నీకు ఒకటీ, అమ్మకి ఒకటీ ఇస్తాను. మరి మీరు పెద్దవాళ్లయ్యాక మీకు చెక్క పాత్రల్లోనేగా భోజనం పెట్టాలిగా!’ అంటూ అమాయకంగా బదులిచ్చాడు బాబు.

 

బాబు మాటలకి కొడుకు దిమ్మ తిరిగిపోయింది. తనకి తెలియకుండానే ఒక కన్నీటి చుక్క చెంపల మీదకి జారింది. నెమ్మదిగా వెళ్లి తన తండ్రి కోసం ఉంచిన చెక్క పాత్రలని పొయ్యిలో పడేశాడు. ఆ రోజు నుంచి మళ్లీ నలుగురూ కలిసి ఒకే బల్ల ముందర తినడం మొదలుపెట్టారు. అడపాదడపా తండ్రి ఏదన్నా ఒలకబోసినా, దాన్ని పట్టించుకోవడం మానేశాడు కొడుకు.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

..Nirjara