ప్రోత్సాహం

Publish Date:Jun 21, 2016

 

జేమ్స్‌ అనే కుర్రవాడికి ఫుట్‌బాల్‌ అంటే చచ్చేంత ఇష్టం. నిరంతరం అతని మనసులో ఫుట్‌బాల్‌ మీదే ధ్యాస. ఇక హైస్కూలుకి వచ్చాడో లేదో ఎలాగైనా స్థానిక ఫుట్‌బాల్‌ టీంలో చేరాలని, చేరి తన సత్తా చూపాలనీ తెగ ఉబలాటపడిపోయేవాడు. కానీ జేమ్స్‌ కుర్రవాడయ్యే! పైగా బాగా పీలగా, పొట్టిగా ఉండేవాడు. దాంతో స్థానికంగా ఫుట్‌బాల్‌ ఆడే జట్టు అతన్ని ఆడించుకునేందుకు పెద్దగా శ్రద్ధ చూపించేది కాదు. ఫుట్‌బాల్‌ జట్టు తనని పట్టించుకోకపోవడంతో జేమ్స్‌ వెనుకడుగు వేసేవాడేమో! కానీ జేమ్స్‌ వాళ్ల నాన్న ఎప్పుడూ అతని వెంటే ఉండి ప్రోత్సహిస్తూ ఉండేవాడు. ఎప్పటికైనా నీకు ఆ జట్టులో చోటు దొరుకుతుందంటూ వెన్ను తడుతూ ఉండేవాడు. అంతేకాదు! జేమ్స్‌ని దగ్గరుండి మరీ పొద్దునా సాయంత్రం ఫుట్‌బాల్‌ ఆడుకునే మైదానానికి తీసుకువెళ్తూ ఉండేవాడు.

 

తాము ఎన్నిసార్లు ఛీ కొట్టినా కూడా విడవకుండా జేమ్స్‌ మైదానంలోనే ఉండటం చూసి స్థానిక జట్టుకి చిరాగ్గా ఉండేది. కానీ జేమ్స్‌ ఇదేమీ పట్టించుకునేవాడు కాదు. ఎండావానని లేకుండా, పగలూరాత్రీ అని లేకుండా తన తండ్రితో కలిసి మైదానానికి వస్తూనే ఉండేవాడు. తండ్రి ఓ మూల కూర్చుని చూస్తూ ఉంటే, జేమ్స్‌ మాత్రం ఫుట్‌బాల్‌ ప్రాక్టీసు చేస్తూ ఉండేవాడు. జేమ్స్‌ ఆటతీరుని చూసీచూసీ స్థానిక జట్టులోని సభ్యులకి అతని మీద కాస్త సదభిప్రాయం ఏర్పడింది. అతని శరీర కదలికలు చూసి ఓ అసాధారణ క్రీడాకారుడు అన్న నమ్మకం మొదలైంది. చివరికి ఓ రోజు అతనికి అవకాశం ఇద్దామనుకున్నారు. ‘వచ్చే ఆదివారం పక్క ఊరి జట్టుతో మన జట్టు తలపడుతో్ంది. ఆ పోటీలో మనం ఎలాగైనా గెలిచి తీరాలి. నువ్వు కూడా ఆ రోజు మా జట్టులో ఆడుదువుగాని...’ అంటూ ఓ అవకాశాన్ని అందించాడు జట్టు కోచ్.

 

జేమ్స్‌, అతని తండ్రి... ఇద్దరి సంతోషాలకూ అవధులు లేవు. ఆ రోజు నుంచి పోటీ జరిగే రోజుదాకా జేమ్స్‌ జట్టులోని మిగతా సభ్యులతో కలిసి విపరీతంగా ప్రాక్టీస్‌ చేశాడు. తన కొడుకు జట్టుతో కలిసి ఆడటం చూసి తండ్రి తెగ మురిసిపోయాడు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. జట్టు సభ్యులు ఊహించినట్లుగానే జేమ్స్‌ చెలరేగిపోయాడు. ఒంటిచేత్తో తన జట్టుని గెలిపించాడు. కానీ ఆట ముగిసిన తరువాత ఆ విజయాన్ని సంబంరంగా చేసుకునేందుకు జేమ్స్‌ కనిపించలేదు. ఆ మర్నాడు జేమ్స్‌ ఇంటిని వెతుక్కుంటూ జట్టు కోచ్‌ బయల్దేరాడు. వాళ్లనీ, వీళ్లనీ అడగ్గా అడగ్గా ఓ చిన్న పాడుబడిన ఇంటిని చూపించారు. కోచ్‌ ఆ ఇంటి తలుపుని తెరుచుకుని లోపలికి అడుగుపెట్టగానే తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. ఎదురుగా జేమ్స్‌ తండ్రి ఫొటో! ఆ ఫొటోకి ఓ పూలదండ! ‘అయ్యో! నాన్నగారు చనిపోయారా? ఎప్పుడు?’ అని అడిగాడు కోచ్ బాధగా. ‘మన మ్యాచ్‌ జరిగిన రోజు తెల్లవారుజామున’ అని కన్నీళ్లను ఉగ్గపట్టుకుంటూ చెప్పాడు జేమ్స్‌.

 

‘నీకు బుద్ధుందా! ఓ పక్క నీకు నిరంతరం తోడుగా ఉన్న మనిషి చనిపోతే, నువ్వు సిగ్గులేకుండా ఫుట్‌బాల్‌ అడతావా? నీ తండ్రి అంత్యక్రియలకంటే నీకు నీ ఆట ఎక్కవైపోయిందా?’ అని కోప్పడ్డాడు కోచ్‌.

 

కోచ్‌ మాటలు విన్న జేమ్స్‌ ఒక్క క్షణం నివ్వెరపోయాడు. ఆ తరువాత నిదానంగా ‘నా తండ్రి ఎప్పుడూ నేను ఓ ఫుట్‌బాల్‌ జట్టులో చేరి అద్భుతంగా ఆడాలని కోరుకున్నాడు. ఆయన బతికి ఉన్నన్నాళ్లూ అది సాధ్యం కాలేదు. కనీసం ఆయన చనిపోయిన రోజునైనా నేను ఆ లక్ష్యాన్ని సాధించడం చూసి ఆయన ఆత్మ శాంతిస్తుందని అనుకున్నాను. ఆ రోజు మైదానంలో వేలమంది జనం ఉండవచ్చు. కానీ అక్కడ ఓ మూలన కూర్చుని ఉండే మా నాన్నే నా మనసులో ఉన్నాడు. ఆయన తృప్తి కోసమే ఆ రోజు ఆడాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

 

..Nirjara

By
en-us Life Style News -