వేధింపులే సిక్కాను సాగనంపాయా..?

దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో విశాల్ సిక్కా తన పదవులకు రాజీనామా చేయడం భారతీయ ఐటీ రంగాన్ని విస్మయానికి గురిచేసింది. ఆ ఒక్క ప్రకటనతో స్టాక్ మార్కెట్లు భారీ కుదుపులకు లోనయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇన్ఫీ షేర్ విలువ 13 శాతం నష్టపోయింది. షేర్ విలువ పడిపోవటమే కాదు..కంపెనీ మార్కెట్‌ విలువలో అక్షరాల 30 వేల కోట్ల రూపాయలు ఆవిరి అయ్యాయి. కేవలం మూడు గంటల్లోనే రూ.2.40 లక్షల కోట్ల నుంచి రూ.2.04 లక్షల కోట్ల రూపాయలకు మార్కెట్ విలువ పడిపోయిందంటే సిక్కా రాజీనామా ఏ స్థాయిలో ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.

 

అసలు ఇంతకీ విశాల్ ఉన్నపళంగా కంపెనీకి ఈ స్థాయిలో నష్టం చేకూర్చే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే అందుకు రెండు కారణాలు చెబుతున్నారు ఆర్థిక రంగ నిపుణులు. కంపెనీ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తొలి నుంచి పనితీరుపై విమర్శలు మూటగట్టుకంటున్నారు సిక్కా. సీఈవోతో పాటు ఇతరత్రా కొందరు టాప్ ఎగ్జిక్యూటీవ్‌ల వేతన ప్యాకేజీలు భారీగా పెంచడం, కంపెనీని వీడిపోయిన కొంతమంది ఎగ్జిక్యూటీవ్‌లకు భారీ మొత్తంలో వీడ్కోలు ప్యాకేజీలను ఇవ్వడాన్ని నారాయణమూర్తి సహా కొందరు ప్రమోటర్లు బహిరంగంగానే విమర్శించారు.

 

మరోవైపు విశాల్ సిక్కా రాజీనామా చేసిన కాసేపటి తర్వాత పిడుగులాంటి వార్తను చెప్పారు కంపెనీ బోర్డు సభ్యులు. నారాయణమూర్తి నిరంతర వేధింపులే సిక్కా రాజీనామాకు ప్రధాన కారణమని ఆరోపించారు. కంపెనీలు కార్పోరేట్ పరిపాలనా ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయని మూర్తి పలుమార్లు బహిరంగ లేఖలు రాశారు. విశాల్ సిక్కా తన ఉద్యోగులకు రాసిన లేఖలో వ్యాఖ్యానించారు వీరి వాదనకు బలం చేకూర్చేలా ఉన్నాయి. ప్రతి విషయానికి నిరాధార ఆరోపణలు చేస్తూ..వ్యక్తిగత దాడులకు దిగుతుంటే..తాను సీఈవో పదవిలో కొనసాగలేనని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై గౌరవం, విశ్వాసం, సాధికారత ఉన్న పదవిలో ఉండాలని చెప్పడం గమనార్హం.