త్వరలో ఆంధ్ర, తెలంగాణ ప్రాజెక్టులకు జలకళ!

 

మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల కృష్ణ దాని ఉపనదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆల్మట్టి రిజర్వాయర్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రవాహస్థాయి ఎక్కువగా ఉండడంతో అధికారులు నీటిని కిందికి వదులుతున్నారు. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకోనున్నాయి. ఆల్మట్టి రిజర్వాయర్ లో ప్రస్తుతం 87 టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉంది. పై నుంచి లక్షా 57 వేల క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతోంది. నారాయణపూర్ రిజర్వాయర్ లోకి 9798 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 635 క్యూసెక్కుల నీటిని కిందకి వదులుతున్నారు. తుంగభద్ర ప్రాజెక్టులోకి 92891 క్యూసెక్కుల నీరు వస్తుండగా 3484 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యాంకు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదనీరు మరో మూడు రోజులు కొనసాగితే డ్యాంపూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుతుంది. కృష్ణ, తుంగభద్రల నుంచి నీటిని విడుదల చేస్తే శ్రీశైలం జలాశయానికి కళకళలాడనుంది. వర్షాలు లేక ఎండిపోతున్న శ్రీశైలం జలాశయం, నాగార్జునసాగర్ డ్యాంలు మరికొద్ది రోజుల్లో జలకళ సంతరించుకునే అవకాశాలున్నాయి.