మరో "నిప్పు" రాజేయాలనుకుంటున్న పాక్

కశ్మీర్ సమస్య..దశాబ్దాలుగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య వైరానికి కారణమైన ఓ జడ పదార్థం. దేశ నైసర్గిక సరిహద్దుల్లోని ఒక్క అంగుళం భూభాగాన్ని కోల్పోవడానికి మన మనస్తత్వం అంగీకరించదు. అలాగే తాను ఆక్రమించిన భూభాగంతో పాటు కశ్మీర్ మొత్తం తనదేనంటూ పాక్ ఎప్పటి నుంచో వాదిస్తోంది. దీనిపై యుద్ధాలు జరిగాయి..అనేక వేదికల మీద వాదనలు జరిగాయి. కానీ ఫలితం మాత్రం శూన్యం. భారత్‌లో ఏం జరిగినా దానిని కశ్మీర్ అంశంతో ముడిపెట్టేందుకు పాకిస్ధాన్ నక్కలా వేచి చూస్తూనే ఉంది. తాజాగా హిజుబుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వానీ‌ని సైన్యం హతమార్చడంతో కశ్మీర్ రగులుతోంది. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ ఆస్తులపై దాడులకు తెగబడటంతో పాటు భద్రతా దళాలపై రాళ్లు రువ్వుతున్నారు. దీంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఈ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 38కి పెరిగింది.

 

దీనిని అవకాశంగా మలుచుకునేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. బుర్హాన్ వానీని భారత్ హతమార్చడం తమను షాక్‌కు గురిచేసిందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. అక్కడి పౌరులను భారత ఆర్మీ, పారామిలటరీ బలగాలు అణచివేస్తున్నాయని అని నిరసించారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు కశ్మీర్‌ ఆందోళనకారులకు తమ పూర్తి మద్ధతు ఉంటుందని..జూలై 19న బ్లాక్‌ పాటిస్తామని నవాజ్ ప్రకటించారు. విషయం అక్కడితో ఆగలేదు..పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవజా ఎం ఆసిఫ్ ఏకంగా 2002 నాటి గుజరాత్ అల్లర్ల ఘటనను..నేటి కశ్మీర్ అల్లర్లతో పోల్చారు. ఓ జాతిని నిర్మూలించేలా 2002లో గుజరాత్‌లో మోడీ ప్రారంభించిన ఊచకోతలకు కొనసాగింపే ప్రస్తుతం కశ్మీర్‌లో జరుగుతున్న అల్లర్లు అంటూ ఆరోపించారు. కశ్మీర్‌ పరిస్థితిని సమీక్షించడానికి కేబినెట్‌ను ప్రత్యేకంగా సమావేశ పరిచి..కశ్మీరీలు స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారని, స్వీయ నిర్ణయాధికారం కోసం వారు చేస్తోన్న పోరాటానికి పాకిస్థాన్ పూర్తి మద్ధతిస్తోందని ప్రకటించారు.

 

మరో వైపు కశ్మీర్ పరిణామాలపై ఐక్యరాజ్యసమితి మద్ధతుతో స్వతంత్ర్య, పారదర్శక దర్యాప్తు జరిపించాలని పాక్ రాయబారి మలీహా లోధీ..ఐరాస ఉప సెక్రటరీ జనరల్ ఎడ్మంట్ ముల్లెట్‌ను కలిశారు. ఈ పరిణామాలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు గానీ, మూడో వ్యక్తికి గానీ జోక్యం చేసుకునే అర్హత లేదని స్ఫష్టం చేసింది. మా అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నాలు మాకు దిగ్భ్రాంతి కలుగజేస్తున్నాయన్నారు.  ఉగ్రవాదానికి పాక్ ఏ స్థాయిలో మద్ధతు ఇస్తోందో మళ్లీ అంతర్జాతీయ వేదికల సాక్షిగా రుజువైందన్నారు.

 

ఇరు దేశాల మధ్య పరిస్థితులు వేడేక్కుతున్న ఇలాంటి సమయంలో పాక్ మరో వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. నదీ జలాల పంపకం విషయంలో ఎప్పుడో ఖరారైన తీర్పును తిరగదోడేందుకు దాయాదీ దేశం ప్రయత్నాలు చేస్తోంది. జమ్మూకశ్మీర్‌లో కిషన్‌గంగా నదిపై నిర్మిస్తున్న జల విద్యుత్తు ప్రాజెక్ట్‌ల వల్ల తన ప్రయోజనాలకు భంగం కలుగుతుందని ఆరోపిస్తూ పాక్ ప్రభుత్వం హేగ్‌లోని "పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌"ను ఆశ్రయించాలని నిర్ణయించింది. హిమాలయ పర్వత ప్రాంతం నుంచి పశ్చిమ దిక్కుగా ప్రవహించే నదులు రెండు దేశాల మధ్య వివాదాలకు తావిస్తున్నాయి. ఈ నదీ జలాలను పంచుకునేందుకు, వివాదాలను పరిష్కరించుకునేందుకు 1960లో ఇరు దేశాల మధ్య సింధూ నదీ జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పు నదులుగా భావించే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు..పశ్చిమ నదులైన ఇండస్, చీనాబ్, జీలం నదులపై పాకిస్థాన్‌కు ఆజమాయిషీ లభించింది.

 

జమ్మూకశ్మీర్‌లో 330 మెగావాట్ల "కిషన్‌గంగా" జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ను, 850 మెగావాట్ల "రాట్లే జలవిద్యుత్" ప్రాజెక్ట్‌లను భారత ప్రభుత్వం 2007లో ప్రారంభించింది. ఈ రెండింటిని పాక్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. దీనిపై 2010లోనే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్భిట్రేషన్‌కు వెళ్లింది. కానీ న్యాయస్థానం తన ప్రాథమిక తీర్పులో, తుది తీర్పులో భారత ప్రభుత్వ వాదనను సమర్థించింది. జల విద్యుత్తు కోసం కిషన్‌గంగా నది నుంచి నీరు మళ్లించవచ్చని పేర్కొంది. అయితే సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని భారత్, పాకిస్థాన్‌ను ఆహ్వానించింది. తత్ఫలితంగా గత రెండున్నరేళ్లుగా చర్చలు సాగుతూ వచ్చాయి. చివరికి తన వాదన నెగ్గని కారణంగా పాక్ మరో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది.