అమలుకాని వాగ్దానాలతో కేసీఆర్ మోసం
Published on: Sat Nov 15, 2014 1:04PM

అమలు కాని వాగ్దానాలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తున్నారని భారతీయ జనతాపార్టీ నాయకుడు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో బీజేపీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు. ‘‘కేంద్రం ఇస్తున్న 13వ ఆర్థిక సంఘం నిధులను తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. కేంద్రం తెలంగాణకు 350 మెగావాట్ల విద్యుత్‌ని అదనంగా ఇచ్చినప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న అమరుల కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 5 ఎకరాల సాగు భూమి, పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఇంతవరకు ఆ పని చేయలేదు’’ అన్నారు.


