TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రతికూలతల మధ్య కూడా అమెరికాను ధిక్కరించిన ధీర వనిత ఇందిర.. మరి మోడీ?

Published on: Wed May 14, 2025 10:03AM

భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మోడీ సర్కార్ అంగీకరించడంపై దేశం రగిలిపోతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి ప్రధాని మోడీ తలొగ్గారన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. దీంతో 1971 యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తెగువ.. సాహసం గుర్తు చేసుకుంటూ.. మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు.  అమోరికా ఒత్తిడిని లెక్క చేయకపోవడమే కాకుండా, ఆ దేశ హెచ్చరికలను, ఆంక్షల బెదరింపులను లెక్క చేయకుండా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అద్భుత దౌత్యం నెరపడమే కాకుండా పాకిస్థాన్ పీచమణిచిన తీరును ప్రస్తుతిస్తున్నారు.   

  పాకిస్తాన్‌పై అన్ని విధాలుగా పై చేయి సాధించి కూడా అమెరికా ఒత్తిడికి తలొగ్గి కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన మోడీ  తీరును గర్హిస్తూ..  నాడు అంటే 1971 యుద్ధ సమయంలో ఇందిరాగాంధీ సాహసోపేత నిర్ణయాలను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.  అప్పటి అమెరికా అధ్యక్షుడు పాక్ తో యుద్ధం ఆపాలని ఎంతగా ఒత్తిడి తెచ్చినా ఇందిరా గాంధీ పట్టించుకోలేదని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో భారత్ , పాకిస్థాన్ మధ్య ఆర్థికంగా, అభివృద్ధి పరంగా ఇంత తేడా లేదు. దాదాపు ఇరు దేశాలూ సమాన స్థాయిలో ఉన్నాయి. అప్పట్లో అయితే అమెరికా ఎలాంటి దాపరికం లేకుండా పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచింది. అయినా సరే ఇందిరా గాంధీ అగ్రరాజ్యం అభ్యంతరాలను, ఒత్తిడినీ తోసిరాజని గట్టిగా నిలబడింది. అదే ఇప్పుడు.. పాకిస్థాన్ ఒక చితికిపోయిన దేశం. ఏ రకంగానూ భారత్ తో సరితూగలేదు. ఉగ్రవాదాన్ని అడ్డంపెట్టుకుని భారత్ లో అశాంతి, అల్లర్లు రేపాలన్న ప్రయత్నంలో ఉంది.

ఇన్ని సానుకూలతల మధ్య కూడా మోడీ అమెరికా ఒత్తిడికి తలొగ్గి.. ట్రంప్ చెప్పినదే తడవుగా బేషరతు కాల్పుల విరమణకు ఓకే చెప్పేశారు. కనీసం భారత్ లో దాడులకు సూత్రధారులైన మసూద్ అజర్ వంటి ఉగ్రవాదుల అప్పగింతకు కూడా డిమాండ్ చేయలేదు.  అందుకే దేశమంతా ఇప్పుడు ఇందిరాగాంధీని గుర్తు చేసుకుంటోంది. గట్టిగా నిలబడి భారత్ సత్తాను చాటడంలో మోడీ వైఫల్యాన్ని ఎండగడుతోంది. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్ని ఎత్తి చూపుతోంది.