TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

షర్మిల పార్టీకి బిగ్ షాక్.. కీలక నేత గుడ్ బై.. అదే దారిలో మరికొందరు? 

Published on: Fri Aug 20, 2021 10:20AM

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. పార్టీ కమిటీలు ఇంకా పూర్తిగా ఏర్పాటు కాక ముందే ముఖ్య నేతలు ఆమెకు హ్యాండిస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్‌టీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలకనేత, మొదటి నుంచి షర్మిలకు అండగా నిలిచిన ఇందిరాశోభన్ రాజీనామా చేశారు. వైఎస్సార్ టీపీ పార్టీ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు  ఓ ప్రకటనలో ఆమె తెలియజేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఇందిరా శోభన్ పంపారు. అసలు ఎందుకు రాజీనామా చేయాలని అనుకున్నారు..? రాజీనామా వెనుక అసలు కారణాలేంటి..? రాజీనామా చేసిన తర్వాత ఏం చేయబోతున్నారు..? అనే విషయాలను ప్రకటనలో నిశితంగా ఇందిరాశోభన్ రాసుకొచ్చారు.

ఇందిరా శోభన్  షర్మిల పార్టీకి రాజీనామా చేయబోతున్నారని గతంలోనూ ప్రచారం జరిగింది. అయితే అప్పుడు ఆ వార్తలను ఆమె ఖండించారు. ఓ సభా వేదికపైనే ఇందిరను షర్మిల కోప్పడిన వీడియోలు వైరల్ గా మారాయి. అప్పుడు కూడా ఆమె రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది. కాని తర్వాత కూడా షర్మిల పార్టీలో యాక్టివ్ గా కనిపించారు ఇందిరా శోభన్. తాజాగా మాత్రం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాను. ప్రజాజీవితంలోనే ఉంటా. జనం కోసమే కదులుతా. ప్రజల కోసమే అడుగులు వేస్తా. ఇదే ఆదరాభిమానాలను ఇక ముందు కూడా మీ నుంచి నాకు ఉంటాయని, నన్ను నడిపిస్తారని తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాను. ఇన్నాళ్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో నాకు సహకరించిన ప్రతీ నాయకుడికి, కార్యకర్తలకు పేరు పేరునా ధన్యవాదాములు’ అని ఇందిరాశోభన్ ప్రకటనలో తెలిపారు.

‘నా శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు నమస్కారం.. నన్ను ఆదరిస్తూ, అభిమానిస్తూ ప్రజాజీవితంలో ముందుకు నడిపిస్తున్న తెలంగాణ ప్రజలకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. తెలంగాణ ఉద్యమంలో రాష్ర్ట సాధన కోసం కలిసి కోట్లాడినం. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలని కలలుగన్నం. వాటిని సాకారం చేసుకునేందుకు ప్రజలతో మమేకమైన నన్ను.. మీరంతా ఆశీర్వదిస్తూనే ఉన్నారు. అందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాను. అది మీరు కోరుకుంటున్నట్లుగానే షర్మిలక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశాను’ అని ఇందిరా శోభన్ తన రాజీనామా ప్రకటనలో వెల్లడించారు. 

షర్మిల పార్టీకి ఇప్పటికే కొందరు నేతలు రాజీనామా చేశారు .మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నాయకులు లోటస్ పాండ్ ఆఫీసులో పెద్ద రగడే చేశారు. తాజాగా కీలక నేత ఇందిరాశోభన్ రాజీనామా చేయడంతో షర్మిలకు పెద్ద షాకే అంటున్నారు. ప్రస్తుతం షర్మిల ప్రతి మంగళవారం జిల్లాలో పర్యటిస్తూ.. దీక్షలు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. అక్టోబర్ లో పాదయాత్రకు షర్మిల ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఒక్కొక్కరుగా నేతలు పార్టీ వీడుతుండటం.. షర్మిల శిబిరంలో ఆందోళన కల్గిస్తోంది.