ఆప్ గూటికి ఇందిరా.. తెలంగాణలో ఆదరణ లభిస్తుందా?
Published on: Sun Dec 26, 2021 11:25AM
ఇందిరా శోభన్ గుర్తున్నారుగా? ఎందుకు గుర్తుండరు లెండి, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రతి రోజు ఎదో ఒక టీవీ చర్చలో కనిపించి, వినిపించిన నాయకురాలు.. ఇందిరా శోభన్. అంతే కాదు, చెప్పదలచుకున్నవిషయాన్ని చక్కగా చెప్పడంలో ఆమె మంచి మార్కులే తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఉంటే ఎలా ఉండేదో ఏమో కానీ, ఆమె వైఎస్ షర్మిల పెట్టిన పార్టీ వైఎస్సార్ టీపీలో చేరారు. అయితే, ఆ పార్టీలో ఎక్కువ కాలం ఉండలేక పోయారు. ఇందిరా పార్క్ ధర్నాలో, షర్మిల, పది మంది ముందు ఇందిరను మందలిచడమో మాట తూలడమో చేశారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆమె వైసీపీటీపీకి గుడ్ బై చెప్పారు.
ఇప్పుడు ఆమె మరో గూటికి చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రాథమిక సభ్యత్వంతోపాటు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సౌత్ ఇండియా ఇన్ చార్జీ సోమ్ నాథ్ భారతితో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పేద ప్రజలకు విద్యా, వైద్యంతోపాటు అన్ని రంగాల్లో అండగా నిలిచిందని, అలాంటి పాలనే తెలంగాణలో తెచ్చేందుకు ఆప్’లో చేరానని చెప్పుకొచ్చారు.
అయితే అదే సందర్భంలో ఆమె చేప్పినట్లుగా, ‘దబ్బున్న వాడిదే రాజ్యాధికారం’ అన్నట్లుగా మారినా తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఎంత వరకు నిలదొక్కుకుంటారు, అనేది చూడవలసి వుంది. అయితే, అన్ని విషయాల్లో జాతీయ పార్టీ నేతలు అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్టు ఆమె వెల్లడించారు. నిజంగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కు పోటీగా విస్తరణ దిశగా గట్టిగానే అడుగులు వేస్తోంది. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరిగే పంజాబ్, గోవా పై ప్రత్యేక దృష్టి పెట్టింది.అలాగే, ఉత్తర ప్రదేశ్, ఉత్తారాఖండ్’లోనూ పోటీకి దిగుతోంది. పంజాబ్’లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆప్’ అవతరిస్తుందని సర్వేలు సూచిస్తున్నాయి. తెలంగాణలో ఎలా ఉన్నా, దేశంలో మాత్రం ఆప్’ రేపటి పార్టీగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2013 నుంచి రాష్ట్రంలో పార్టీ ఉదని, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఆమ్ ఆద్మీ పార్టీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తుందని ఇందిర శోభన ప్రకటించారు.అయితే, మూడు ప్రధాన పార్టీలు తెరాస, బీజేపీ, కాంగ్రెస్ ..అవికాక షర్మిల పార్టీ, ప్రవీణ్ కుమార్ సారధ్యంలో కొత్తగా తెరపికొచ్చిన, బీఎస్’పీ ఇంకా కోదండ రామ్ టీజేఎస్’ లాంటి ఉద్యమ పార్టీల మధ్య ఇందిర శోభన ‘ఆప్’ ను ఎంతవరకు నిలబెట్టగాలుగుతారో చూడవలసి వుంది.


