'కోవ్యాక్సిన్' క్లినికల్‌ ట్రయల్స్‌కు గ్రీన్ సిగ్నల్.. హైదరాబాద్ నుంచే వ్యాక్సిన్!

కరోనా మహమ్మారి నియంత్రణ వ్యాక్సిన్‌ తయారీలో హైదరాబాద్‌కు చెందిన 'భారత్‌ బయోటెక్‌' మరో ముందడుగు వేసింది. కరోనా‌ కట్టడికి ‘కోవ్యాక్సిన్‌’ను భారత్‌ బయోటెక్ డెవ‌ల‌ప్ చేసింది. తాజాగా ఈ వ్యాక్సిన్ కు క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి లభించింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ను జంతువులపై ప్రీ క్లినికల్ ట్రయల్స్ చేశారు. జంతువుల పై ఇది సానుకూల ఫలితాలను ఇవ్వడంతో ప్రస్తుతం మానవులపై ప్రయోగాలకు సిద్ధమైపోయింది. ఈ ‘కోవ్యాక్సిన్‌’ ప్రయోగాలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతిచ్చింది. మానవులపై ఫేజ్‌ -1, ఫేజ్‌ -2 పరీక్షలకు అనుమతులు జారీ చేసింది. కరోనా‌‌ నియంత్రణకు తయారవుతున్న తొలి స్వదేశీ వ్యాక్సిన్‌ ఇదే కావడం విశేషం. భారత్‌ బయోటెక్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రిసెర్చ్‌(ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ) సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. జులై నెల నుంచి మానవులపై ప్రయోగాలు చేయనుంది. ఈ సందర్భంగా భారత్‌ బయోటెక్‌ ఎండీ డాక్టర్‌ కృష్ణా ఎల్లా మాట్లాడుతూ.. ‘కోవ్యాక్సిన్‌’ తయారీ చరిత్రాత్మకం అవుతుందన్నారు.