భారతీయ స్త్రీలకి ఎక్కువవుతున్న మానసిక వత్తిడి

 

 

సరోజ అయిదు గంటలకే లేచింది. బ్రష్ చేసుకుని కాలకృత్యాలు తీర్చుకుని కాసేపు యోగా చేసి, పిల్లల్ని లేపి, స్కూల్ కి రెడీ కమ్మని చెప్పి వంట గదిలోకి దూరింది. బ్రేక్ ఫాస్ట్ చేసింది. అందరూ ఒకటే రకం తినరు. కొంతమందికి ఇడ్లీ, చట్నీ చేసి, పాలు, సిరియల్, పళ్ళరసం, బ్రెడ్ టోస్ట్ చేసి, బట్టర్, జామ్, టేబుల్ మీద పెట్టింది. తనకి, భర్తకి కాఫీ, కలిపింది. పిల్లలకి లంచ్ బాక్స్ ల్లో ఒకరికి పరోటా, స్నాక్ కి కుక్కిస్, జ్యూస్ పెట్టింది, మరొకరికి సాండ్ విచ్, స్నాక్, చాక్లెట్ మిల్క్ పెట్టింది. కూతురు బ్రేక్ ఫాస్ట్ చేయగానే రెండు జడలు వేసింది, కూచిపూడి నేర్చుకుంటుంది కాబట్టి జుట్టు కట్ చేసుకోకుండా పెంచుకుంటుంది కాబట్టి రోజు జడలు వేయాల్సిందే. పిల్లలు రెడీ అయ్యి స్కూల్ బస్ వచ్చే టైమ్ కి పరిగెత్తారు. భర్త కూడా రెడీ అవుతున్నాడు, సరోజ తమ ఇద్దరికి లంచ్ ప్యాక్ చేసి టేబుల్ మీద పెట్టి బట్టలు మార్చుకుని రెడీ అయ్యి, బ్రేక్ ఫాస్ట్ తిన్నాననిపించింది, కాఫీ చల్లారి పోతే వేడి చేసింది, భర్త బ్రేక్ ఫాస్ట్ టి.వి.లో న్యూస్ చూస్తూ తింటున్నాడు. సరోజ కాఫీ సిప్ చేస్తూనే గిన్నెలు డిష్ వాషర్ లో పెట్టేసింది. టైమ్ కాగానే ఇద్దరూ ఇంటికి తాళం వేసి బయట పడ్డారు.

 

సరోజ పిల్లల స్కూల్ అయిపోయేవరకే వర్క్ చేస్తుంది. మిగిలిన పని ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పనులయ్యాక రాత్రి ఒక రెండు గంటలు పని చేసుకుంటుంది. పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చి వారికి తినడానికి ఏదైనా పెట్టి ఒకరిని పియానో క్లాస్ కి, మరొకరినీ సాకర్(ఇండియాలో ఫుట్ బాల్) ప్రాక్టీస్ దగ్గర దిగబెట్టి ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత ఒకొక్కరిని పికప్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చి వారికి హోం వర్క్ లో సాయం కావాలంటే చేస్తుంది మళ్ళీ సాయంత్రం వంట, ఇల్లు క్లీనింగ్, లేదా లాండ్రీ పనులు చేసుకుంటుంది. భర్త ఇంటికి త్వరగా వస్తే పిల్లలకి హోం వర్క్ చేయించడమో, లాండ్రీ పనో, ఎపుడైనా ఒకసారి ఇల్లు వాక్యూమ్ పని చేస్తాడు. రోజు పిల్లలకి స్కూల్ తర్వాత ఏదో ఒక క్లాస్ వుంటుంది. ఇండియన్ పిల్లలందరికి ప్రజ్ఞా క్లాస్ అనీ శ్లోకాలు అవి నేర్పిస్తారు,పాపని కూచిపూడి డ్యాన్స్ కి పంపిస్తారు, బాబుకి మృదంగం, మళ్ళీ ఇద్దరికీ కలిపి కర్ణాటక సంగీతం గాత్రం నేర్పిస్తారు. మాతృభాష తనే నేర్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళు సరిగ్గా నేర్చుకోలేదు మళ్ళీ దానికి క్లాసులకి పంపించడం మొదలు పెట్టారు. ఇలా సరోజ అటూ ఉద్యోగం, ఇటు పిల్లలకి మన సంస్కృతిని మర్చిపోకుండా వుండాలంటే అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేయాలి అనుకుని చాలా సమయం పిల్లల్ని ఈ రకరకాల క్లాసులకి తీసుకెళ్ళడానికి కార్లోనే గడిపేస్తుంది. ఈ మధ్యనే తనకి థైరాయిడ్ సమస్య వచ్చింది. త్వరగా అలిసిపోతుంది. వీకెండ్స్ వస్తే ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళడమో, వారిని పిల్చి గెట్ టుగెదర్ చేసుకోవడమో చేస్తారు. కొంతమంది స్త్రీలు వలంటీర్ పని చేయడం, ఏదైనా ఇండియన్ సంస్థలో కానీ అక్కడి వలంటీర్ సంస్థల్లో వారికిష్టమయిన పనులు చేస్తుంటారు. ఒకోసారి రాత్రిపూట ఎవరైనా కాల్ చేస్తే అక్కడికి వెళ్ళి వారికి ఏ విధంగా సాయం చేయగలరో అలా చేయడానికి ప్రయత్నిస్తారు. ఇలా ఉరుకులు పరుగుల మీద సాగుతుంటుంది సామాన్యంగా విదేశాల్లో వుండే ఏ భారతీయ స్త్రీ జీవితం అయినా. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

 

ప్రపంచంలో అందరికంటే ఎక్కువ మానసిక వత్తిడి ఎదుర్కునే స్త్రీలెవరంటే, భారతీయ స్త్రీలు 87% కంటే ఎక్కువగా మానసిక వత్తిడి (Stress)కి గురవుతున్నారని నీల్ సన్(Nielsen)సర్వేలో తేలింది 2010 సంవత్సరంలో. భారతీయ స్త్రీలు ప్రతి రంగంలో అడుగిడుతున్నారు, తాము ఎవ్వరికీ తీసిపోమని నిరూపించుకుంటున్నారు, విజయాలేన్నో సాధిస్తున్నారు. అయినా ఇంకా భారతీయ కుటుంబంలో ఆడపిల్ల పుడుతుందంటే భయం, ఎందుకూ? ఆడపిల్లని చదివించాలి, మొగపిల్లలని కూడా చదివిస్తారనుకొండి, కానీ వారయితే వృద్దాప్యంలో తమని చూసుకుంటారని పున్నామ నరకం నుండి తప్పిస్తారని ఒక మూడ నమ్మకం. స్త్రీలు అత్తగారి ఇంట ముక్కు మొహం తెలియని వ్యక్తిని పెళ్ళి చేసుకుని, కొత్త మనుషులని తన మనుషులుగా అనుకుని సర్ధుకు పోవాలి, అక్కడే ఆమె ధైర్యం, తెగువ కనిపిస్తాయి. ఎక్కడకెళ్ళినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒదిగిపోయి ఆ యింటిని ఒక ఆనందనిలయంగా చేయడానికి ప్రయత్నిస్తుంది. మారుతున్న సమయంతో పాటు పరిస్థితులు మారుతున్నాయి.

 

కొడుకులు తమని వృద్దాప్యంలో చూసుకుంటార నుకున్నవారు, విదేశాల్లో ఉద్యోగాలు వచ్చి లేదా అక్కడ జీవితం ఇక్కడికన్నా బాగుంటుందని వెళ్ళేవారు కొందరు. అలా కొడుకులు దూరమైతే వారిని చూసుకుంటున్నది ఎవరూ? కేవలం కొడుకులున్నవారైతే స్నేహితులతో, బందువులతో, తమలా ఒంటరిగా బ్రతుకుతున్న వారిని స్నేహితులుగా చేసుకుని కాలేక్షేపం చేస్తున్నారు తల్లి తండ్రులు. అమ్మాయిలున్నవారు వారి కుటుంబంతో పాటు తల్లి తండ్రులని చూసుకుంటున్నారు. ఎవరైతే భారమవుతారనుకుంటున్నారో నేడు వారే, బాగా చదువుకుని, మంచి వుద్యోగాలు చేస్తూ తల్లి తండ్రులకి కూడా ఆసరా అవుతున్నారు.

 

మరో ఉదాహరణ చెప్పుకోవాలంటే....

ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలు, అందులో ఇద్దరు విదేశాల్లో వున్నారు, ఇండియాలో వున్న కూతురు మంచి వుద్యోగం చేస్తుంది, తన ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఒకోసారి కొన్ని వారాలకి, నెలలకి ఇతర దేశాలకి వెళ్ళాల్సి వుంటుంది. ఇంట్లో పనులతో పాటు, పిల్లలను చూసుకుంటూ, ఒంట్లో బాగాలేని తండ్రికి అప్పాయింట్ మెంట్ కోసం ఆఫీసు నుండి టైమ్ తీసుకుని వచ్చి తీసుకెళ్ళడం, టెస్ట్ లు చేయించడం, మందులు కొని ఇంటికి తీసుకెళ్ళి వదిలిపెట్టి శనివారం, ఆదివారం వారితో గడపడానికి పిల్లలు, భర్తతో వెళ్ళి తల్లి తండ్రికి కావాల్సినవి అన్నీ అమర్చిపెడుతుంది. తల్లి ఈ మధ్యనే రిటైర్ అయ్యింది, వారం అంతా తండ్రిని చూసుకోవడంలో బిజీగా వుండే అమ్మని కాసేపు బయటికి తీసుకెళ్ళడం, రాత్రిళ్ళు ఆఫిసు పనులు ఇంటికి తెచ్చుకుని చేసుకోవడం చేస్తుంది. అత్తగారు, మామగారు వచ్చినా వారికి కావాల్సినవి అన్నీ చూసుకుంటుంది తన తల్లి తండ్రులకి చూసుకున్నట్టుగానే.

 

ఇప్పుడు చెప్పండి ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తున్న స్త్రీలు మానసిక వత్తిడికి లోనుకావడంలో ఆశ్చర్యం ఏమైనా వుందా! అందరికీ భర్తల సహకారం వుంటుందని లేదు అలాంటి వారు, తాము అనుకున్న పనులన్నీ చేయాలంటే వారితో వాదిస్తూ కూర్చోవడం కంటే అన్నీ పనులు తాము చేసుకుంటేనే సులువవుతుందని చేసుకుంటుంటారు.

 

కొంతమంది స్త్రీలకి తాము నమ్మే సిద్దాంతాల కోసం పాటు పడాలని వుంటుంది. వారు అనుకున్నది చేస్తున్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదురుకుంటూ ముందుకు సాగుతున్నారు. వుద్యోగాల్లో ఒకో మెట్టు ఎక్కుతూ ప్రమోషన్లు సంపాదిస్తూ సాగుతున్నవారు ఒకోసారి పెద్ద ప్రమోషన్లు వచ్చినపుడు ఏం చేయాలో తెలియక అవస్థ పడుతున్నారు. ప్రమోషన్ తీసుకుంటే, ఇంట్లో బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించలేమని, పిల్లలను ఎప్పుడో ఒకసారి చూసుకోవాల్సి వస్తుందని, రోజులు, వారాలు లేదా నెలలు కాన్పరెన్స్ లకో, మీటింగ్ లకో, వేరే వూళ్ళకి, దేశాలకి వెళ్ళాల్సి వస్తుందని, పిల్లలు పెరిగిపోతుంటే వారితో పాటు సమయం గడపలేకపోతున్నామనే బాధ అమ్మలని పీకుతూనే వుంటుంది. అందుకని కొంతమంది ప్రమోషన్లు వదులుకుంటున్నవారు కూడా వున్నారు. అదే గాక వర్క్ ప్లేస్ లో వివక్షతని ఎదుర్కునేవారు దాన్ని పట్టించుకోని వారు కొందరయితే, మరి కొంతమంది ధైర్యంగా వివక్షతకి, సెక్స్యువల్ హరాస్మెంట్ కి వ్యతిరేకంగా పోరాడుతూ, ముందుకు సాగుతున్నారు. ఇవన్నీ మానసిక వత్తిడిని పెంచకపోతే మరేం చేస్తాయి? చెప్పండి.

 

ఈ మానసిక వత్తిడికి గురి కాకుండా వుండాలంటే, కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో అందరు కుటుంబ సభ్యులని కానీ, వుద్యోగం చేసే దగ్గర కానీ ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టాలనే రూల్ లేదు, అది సాధ్యం కాదు కూడా అందుకని సినిమాలోలా మంచి కోడళ్ళుగా వుండాలంటే అసాధ్యం కనుక మీకు తృప్తి కలిగే వరకు ఏదైనా పనిని చేసి వదిలి పెట్టండి, అది ప్రతి ఒక్కరికీ నచ్చుతుందా లేదా అని ఆలోచిస్తూ కూర్చుంటే ఆ పనిని అసలు చేయడానికి ప్రయత్నం కూడా చేయరు. స్త్రీలూ మనుషులుగానే పని చేయాలి కానీ "సూపర్ మామ్స్" లా, "సూపర్ వుమెన్" లా వుండాలని, రోబోట్స్ లా ప్రతి నిముషం పని చేస్తుంటే శారీరక, మానసిక వత్తిడి ఎక్కువయి జబ్బుల పాలవుతారు. అందుకని కేవలం మీకంటూ సమయం పెట్టుకుని రిలాక్స్ కావడానికి ప్రయత్నించండి. రిలాక్స్ కావడానికి మంచి సంగీతం వినవొచ్చు, లేదా పాడుకోవచ్చు, మీకు వచ్చిన ఏవైనా కళలను(ఒక భార్యగా, అమ్మగా, కోడలిగా, వదినగా, వుద్యోగినిగా, ఇలా ఎన్నో బాధ్యతల మధ్య మీరూ మీకిష్టమైన కళని నేర్చుకున్నారనే విషయాన్ని మర్చిపోతారు చాలామంది) బయటికి తీసి వాటిని మళ్ళీ సాధన చేయడం మొదలు పెట్టండి.

 

యోగాసనాలు చేస్తే శరీరానికి మంచిది, మెదడుకి ప్రశాంతత లభిస్తుంది. అపుడు ఫ్రెష్ గా అన్నీ పనులు ఎక్కువ వత్తిడి లేకుండా చేసుకోవచ్చు. యోగా ఒకటే కాదు ఇపుడు ఎన్నో రకాల ఎక్సర్ సైజులు వచ్చాయి అందులో మీకు ఏది బాగా సూట్ అవుతుందో, నచ్చుతుందో అదే ఎన్నుకొని చేసుకొండి.

 

వుద్యోగంలో మీకు తృప్తిగా వుంటే వుండండి లేదా మీకూ, మీరు ఎంత కష్ట పడి చేసినా ఆ పనికి విలువనివ్వకపోతే మీకు మరో వుద్యోగం సంపాదించుకోగలను అనే నమ్మకం వుంటే అది వదిలేసి వీలయితే ఎన్నో కొత్త కొత్త కోర్సులు, ట్రైనింగులు, డిగ్రీలు వున్నాయి, కొత్త పనులు నేర్చుకొండి. ఎప్పుడూ ఆర్ధిక స్వాతంత్ర్యం కలిగి వుండేలా చూసుకొండి. ఎప్పటికీ భర్త మీద ఆధార పడి వుంటే ఎప్పుడూ ప్రతి దానికి చెయ్యి జాపాలి, లేదా ఇంటి జమా ఖర్చులు లెక్క తప్పకుండా చెబుతూ వుండాలి, మీకంటూ స్వతంత్రంగా ఏమీ చేసుకోలేరు బాగా కంట్రోలింగ్ భర్త వుంటే. మీ మీద మీకు నమ్మకం, ఆత్మ విశ్వాసం, ఆత్మ స్థయిర్యాన్ని పెంపెందించుకుని ధైర్యంగా వుంటే ఎటువంటి సమస్యనైనా ఎదుర్కునే మన:స్థయిర్యం వుంటుంది. ప్రతి పనిలో పర్ఫెక్షన్ వుండాలి అనే వత్తిడిని మనమే పెట్టుకుంటే చాలా ఇబ్బందులకి గురవుతాము.

 

అన్ని పనుల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలనుకోవడం రాకపోతే నిరాశ చెందడానికి మనం పరీక్షల్లో పాల్గొనటం లేదు, అలా అనుకుంటే మనసు బాధ పడడం జరుగుతుంది. అప్పుడప్పుడు ఇల్లు క్లీన్ చేసుకోకుండా వదిలేసి మీకు ఆ రోజు మంచి పుస్తకం చదవాలనిపిస్తే హాయిగా కిటికీ పక్కన కూర్చొని, వేడి ఏది పల్లీలని నముల్తూ మీ పుస్తకంలో లీనమై పొండి. దానివల్ల ఇంటికి వచ్చిన నష్టం ఏమీ లేదు, ఇల్లు అక్కడే వుంటుంది, సర్ధడానికి పనీ అక్కడే వుంటుంది. మీకు ఓపిక వున్నప్పుడు అంతా ఒకటేసారి చేసేయాలనుకోకుండా మెల్లి మెల్లిగా కొద్ది కొద్దిగా చేసుకొండి. ఇందులో కుటుంబ సభ్యుల్ని కలుపుకున్నారనుకొండి ముఖ్యంగా పిల్లల్ని వారికీ పనుల్ని నేర్పించినవారవుతారు, ప్రతి రోజు అమ్మ ఎంత కష్టపడుతుందో దాని విలువ కూడా తెలుస్తుంది. మీ పిల్లలకు ఏం నేర్పించాలి, వారికి ఏదంటే ఇష్టం కనుక్కుని మీకు వీలయిన వాటిల్లోనే జాయిన్ చేయండి. ఇతరులను చూసి వాళ్ళ పిల్లలు బోలెడన్నీ చేస్తున్నారు మన పిల్లలు కొన్నే చేస్తున్నారు అని మీరు కంగారు పడి, పిల్లల్ని హైరానా పెట్టి మీకూ, వారికి కూడా "స్ట్రెస్స్" ని ఎక్కువ చేసుకుంటున్నారు. జీవితం పరుగు పందెం కాదు, వేరే వాళ్ళు చేసే పనులన్నీ మనం చేయాలనుకుంటే పిల్లల మీద వత్తిడి పెరిగి కొన్నిట్లో కూడా సరిగ్గా చేయలేరు. అదే వారికిష్టమయిన వాటిలో చేర్పిస్తే చక్కగా మనసు పెట్టి నేర్చుకుంటారు, చూడండి.

 

ఉద్యోగం, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టం అనే ఆలోచన మనసులోనుండి తీసేయండి. మనసుని ముందునుండే గట్టి పరుచుకుంటే అన్నీ చేయవచ్చు. ఉదాహరణకి పిల్లలతో సమయం గడపడం లేదని బాధ పడే వారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం పిల్లలతో ఎంత సమయం గడిపామన్నది కాదు ముఖ్యం, వారితో కొద్ది సమయం కానీ ఎక్కువ సమయం కానీ ఎలా గడిపామన్నదే ముఖ్యం. పిల్లలు మీతో గడిపిన సమయాన్ని సంతోషంగా గుర్తుపెట్టుకుంటే వారు సంతోషంగా వున్నట్టే, వారికి మీ పై ఎలాంటి కంప్లయింట్లు లేవు అని అర్ధం. ఈ విషయం ఇతర కుటుంబ సభ్యులకి కూడా వర్తిస్తుంది. ఇలాగే ప్రతి విషయంలో మనం ఆ విషయాన్ని చూసే దృక్కోణం మార్చుకుంటే చాలు. అన్నీ సులువు అవుతాయి.

 

అన్నిటికన్నా ముఖ్యం మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకొండి, అంటే ఎవరో మీకు, మీరు ఎలా వున్నారో చెప్పడం కాదు, మీరే నిర్ణయించుకోవాలి, మీరు ఎంత బరువుండాలి, మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, మీకు మేకప్ అవసరమా లేదా, మీరు సన్నగా కమర్షియల్స్ లో వచ్చే మాడల్స్ లా సన్నగా, పీలగా, ఒక గెడ కర్రలా వుండాలో, ఆరోగ్యంగా, ఎప్పుడూ సంతోషంగా వుంటూ, నలుగురికీ మీకు చేతనయినంత సాయం చేస్తూ మీ మనసుకి నచ్చినట్టు వుండాలా లేదా నిర్ణయించుకోవల్సింది మీరు. వేరే వారికి మిమ్మల్ని ఇలా వుండాలి, అలా వుండాలి అనే హక్కు లేదు. ఒకవేళ వాళ్ళు అలా అనుకుంటే అది వారి సమస్య కానీ మీ సమస్య కాదు. ఒక విషయం గుర్తు పెట్టుకోండి ఆనందంగా వుండడం మీ చేతిలో వుంది. నాకు తెల్సు ఇది చెప్పడం చాలా తేలిక దాన్ని చేరుకోవడం చాలా కష్టం అని.

 

ముఖ్యంగా కట్నాలు తేలేదని హింసించే భర్త, అత్తామామలున్న సమాజంలో, ఆడపిల్ల పుడితే ఇంట్లో నుండి తరిమేయడమో, విడాకులివ్వడమో చేసే భర్తలున్న సమాజంలో, వుద్యోగానికి వెళ్ళొస్తే అనుమానించి నెల జీతం అంతా తీసుకొని కేవలం బస్ పాస్ డబ్బులిచ్చే భర్తలున్న ఈ దేశంలో, రోజంతా కష్టపడి కుటుంబం అంతా పని చేసి కనీసం ఒక్క పూటయినా అందరూ కూర్చుని సంతోషంగా తిని కంటినిండా నిద్ర పోవడానికి నోచుకోనివ్వకుండా సంపాదించిందంతా తాగుడికి తగలపెట్టి ఇంటికి వచ్చి భార్యా, పిల్లల సంపాదన కూడా లాక్కుని చితకబాదే భర్తలున్న సమాజంలో, మంచి బట్టలేసుకుని బయటికి వెళితే ఆ పిల్ల ఇంటికి తిరిగి వచ్చేదాక గుండెల్లో దడతో తల్లి తండ్రులు భయపడుతూ బ్రతుకుతున్న సమాజంలో ఇంకా ఎన్నో సమస్యల్తో, పోరాటాలతో బ్రతుకుతున్న మన దేశంలో అది సాధ్యమా అని మీరు అనుకోవచ్చు. కానీ మనం సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా వుంటేనే ఇతరులకి సాయం చేయగలుగుతాము.

 

అందుకని మానసిక వత్తిళ్ళకు దూరంగా వుండాలంటే మనని మనం కొద్దిగా మార్చుకోవాల్సిందే మరి! ఏమంటారు. ప్రయత్నించండి, "సాధనమున పనులు సమకూరు ధరలోన," అన్నారు వేమన గారు.

గుడ్ లక్....

 

-కనకదుర్గ

 

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.