TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ పార్టీ గెలిస్తే 5 ల‌క్ష‌లు ఇస్తాం.. సందేహాలుంటే కాల్ చేయండి

Published on: Sat May 11, 2019 6:15PM

 

ఏపీలో తాము అధికారంలోకి వస్తామంటే తాము వస్తామని.. టీడీపీ, వైసీపీ పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు జ్యోతిష్యులు కూడా పలానా పార్టీ అధికారంలోకి వస్తుందని, గతంలో తాము చెప్పింది జరిగిందని చెబుతున్నారు. అయితే ఏపీ ఫ‌లితాల పై భార‌త నాస్తిక స‌మాజం స‌వాల్ విసిరింది. ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారో ముందుగానే చెప్పి.. అవి నిజ‌మైతే చెప్పిన జ్యోతిష్యులకు 5 ల‌క్ష‌లు బ‌హుమ‌తిగా ఇస్తామ‌ని భార‌త నాస్తిక స‌మాజం రాష్ట్ర అధ్య‌క్షుడు శ్రీరామ్మూర్తి ప్రకటించారు.

కొంత మంది జ్యోతిష్యులు ఎన్నిక‌ల ఫ‌లితాల పైన లెక్క‌లు వేసి ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడుతారు అని లెక్కలు చెప్తూ.. ఒకవైపు ప్రజలను మిస్ లీడ్ చేస్తూ, మరోవైపు పార్టీల మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారని నాస్తిక స‌మాజం ఆరోపణ. ఇటువంటి వారి కోస‌మే తాము ఈ సవాల్ చేస్తున్నామ‌ని శ్రీరామ్మూర్తి తెలిపారు. స‌రిగ్గా అంకెల‌తో స‌హా చెప్పిన వారికి ఈ బ‌హుమతి ఇస్తామని ప్రకటించారు.

కొద్ది రోజులు క్రితం విజయనగరం జిల్లా పార్వతీపురం అయ్యప్ప దేవాలయం ప్రధాన అర్చకుడు మురపాక కాళిదాస్‌.. నాడీ జ్యోతిష్యం ప్రకారం వైసీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పడమే గాక జగన్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై కూడా సంఘం ప్ర‌తినిధులు స్పందించారు. తాము చేస్తున్న స‌వాల్‌ ను కాళిదాస్ సైతం స్వీకరించవచ్చని అన్నారు. వైసీపీ గెలిస్తే.. ఎన్ని సీట్ల‌లో గెలుస్తుందో చెప్పాల‌ని.. ఆయ‌న చెప్పింది నిజ‌మైతే ఆయ‌న‌కు బ‌హుమ‌తి ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. శాస్త్రీయ స్పృహ‌ను పెంచాల్సిన వారు కూడా జ్యోతిష్యం పేరుతో ఇలా చేయ‌టం స‌రి కాద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేసారు. దీని పైన ఎవ‌రికైనా సందేహాలుంటే 94402 60280, 90106 96498 నంబర్లను సంప్రదించాలని సూచించారు.