TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బుల్లెట్ కు క్షిపణితో బదులు.. పాకిస్థాన్ కు భారత్ హెచ్చరిక

Published on: Mon May 12, 2025 6:29AM

భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న తీవ్రత యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. పహల్గాం దాడి తరువాత నుంచీ పరిస్థితి తీవ్రంగా మారింది. భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పకిస్థాన్ ను వణికించేసింది. పాక్ దాడులకు తెగబడినా భారత్ వాటిని అత్యంత సమర్దంగా తిప్పి కొట్టడమే కాకుండా ప్రతిదాడులు చేసింది. ఈ ప్రతిదాడులు పాకిస్థాన్ అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేశాయి. ఈ పరిస్థితిలో స్పష్టమైన స్వార్థ పూరిత కారణాలతో ట్రంప్ మధ్యవర్తిత్వానికి ఏకపక్షంగా పూనుకుని కాల్పుల విరమణ ఒప్పందం అంటూ ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలను సడలించేందుకు ప్రయత్నించారు. భారత్ మాత్రం కాల్పుల విరమణ విషయంలో ట్రంప్ క్రెడిట్ ఏమీ లేదనీ, అది పూర్తిగా ద్వైపాక్షిక అంశమనీ తేల్చి చెప్పింది. పాకిస్థాన్ నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకే తాము మానవతా దృక్పథంతో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించామనీ చాటింది. అయితే ఈ ఒప్పందం అమలులోకి వచ్చిన గంటల వ్యవధిలోనే పాక్ నుంచి ఉల్లంఘన జరిగింది. దీంతో భారత్ దీటుగా స్పందించింది. ప్రధాని మోడీ త్రివిధ దళాధిపతులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఆ సందర్భంగా వారికి కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. పాకిస్థాన్ నుంచి బుల్లెట్ వస్తూ మీరు క్షిపణితో సమాధానం ఇవ్వండి అంటూ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు.     

దీంతో పాకిస్థాన్ కు ఇక శరణుజొచ్చడం వినా మరో గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. అన్నిటి కంటే పాక్ సరిస్థితి దయనీయతకు  త్రివిధ దళాలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన అద్దం పట్టింది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా తొలుత పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్ధావరాలను ధ్వంసం చేశామనీ, ఆ తరువాత పాక్ సరిహద్దులలో భారత భూభాగంపై చేసిన దాడులకు ప్రతిగా   పాక్ లోని   ఆర్మీ స్థావరాలను ధ్వంసం చేసినట్లు వివరించాయి. అంతే కాకుండా ఈ దాడుల్లో పాక్ సైనిక స్థావరాలు ధ్వంసమైన వీడియో క్లిప్పింగ్ లను చూపాయి.

పాక్ చేసిన ప్రతి దాడినీ సమర్ధంగా తిప్పికొట్టినట్లు త్రివధ దళాల ప్రతినిథులు తెలిపారు. పాక్ ఏ మాత్రం తోక జాడించినా ముప్పేట దాడికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.  పాక్ పై చర్యలపై విషయంలోకేంద్ర ప్రభుత్వం తమకు పూర్తి స్థాయి స్వేచ్ఛ  ఇచ్చిందని పేర్కొన్నారు.  పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పాకిస్తానే మొదట కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదించిందని, దానికి భారత్ అంగీకరించిందని, అయితే ఆ దేశమే ముందు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందనీ, మరోసారి ఆ పని చేస్తే భారత్ నుంచి ఎదురయ్యే దాడుల ప్రభావం తీవ్రాతితీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.