అజ్ఞానాంధకారంలో భారత ప్రజానీకం

 

India Pakistan border, Indian Chinese border, India Pakistan, Congress banks on propoor schemes

 

..... సాయి లక్ష్మీ మద్దాల

 

 

నేడు దేశాన్ని ఎన్నో సమస్యలు తీవ్రంగా పట్టి పీడిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనది దేశ భద్రత. దేశ భద్రతను గాలికి వొదిలేసి ఆహార భద్రత అనే సంక్షేమ పధకం  ద్వారా తమ అధికారానికి భద్రత కల్పించుకునే ప్రయత్నంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఒకపక్క నుండి పాకిస్తాన్ స్వయంగా దేశంలోనే చొరబడి దేశ ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తుంటే,ప్రజల ప్రాణాలకు ఎలాంటి భద్రత కల్పిస్తారో భరోసా ఇవ్వలేని నాయకులు నేడు దేశాన్ని ఏలుతున్నారు. మరో ప్రక్కనుండి చైనా రోజుకు కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంటూ ముందుకొస్తున్నా ఎటువంటి ధిక్కార చర్యలు చేపడుతున్నారో చెప్పలేరు. పైగా భూసేకరణ బిల్లు ద్వారా దేశ ప్రజలకు ఏదో ఒరగదోస్తామని మాత్రం ప్రగల్భాలు పలుకుతున్నారు.

 

 

ఇవన్ని దేశ సరిహద్దు సమస్యలు. కానీ  నేడు దేశాన్ని పట్టి పీడిస్తున్న మరో పెద్ద సమస్య ఆర్ధిక సంక్షోభం. దీనికి ఎవరు భాద్యులు?పనికి మాలిన ప్రజాకర్షక పదకాలన్ని ప్రవేసపెట్టి,ముందుచూపు లేని ఆర్ధిక నిర్ణయాల పర్యవసానమే నేటి ఆర్ధిక సంక్షోభానికి ముఖ్య కారణం. 2014 ఎన్నికలలో తిరిగి అధికారాన్ని దక్కించు కోవటమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న యు.పి. ఎ సర్కారుకు దేశ ప్రగతి పట్టటం లేదు. ఫలితంగానే 45లక్షల కోట్లు ప్రపంచ దేశాలకు రుణపడేలా భారత దేశాన్ని ఉంచింది. ఈ చర్యల తాలూకు పర్యవసానాన్ని దేశ ప్రజలు భరిస్తున్నారు. ఏది కొందామన్న,తిందామన్న అందుబాటులో లేని ధరలు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి,తగురీతిలో భవిష్యత్తులో ఆర్ధిక కార్యాచరణ చేపట్టగలమని చెప్పే ధైర్యం అటు అధికార పక్షానికి లేదు. ఆ అధికార పక్షం నైజాన్ని ఎండగట్టి ప్రజలకు భరోసా ఇవ్వగలిగిన సత్తా ఇటు దేశ ప్రధాన ప్రతిపక్ష మైన బి.జె. పి  కి లేదు. మరి దేశం ఎలా బాగుపడేది?


                   

ప్రజలందరికి అందుబాటులో నాణ్యమైన విద్య,వైద్యం మౌలిక సదుపాయాలు ఉంచగలిగే పరిపాలన సామర్ధ్యం నేటి నేతలలో కొరవడిన ఫలితంగానే ఈనాడు ప్రజల మధ్య పనికిమాలిన విద్వేషాలసృష్టికి అంకురార్పణ జరుగుతోంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల మధ్యకు కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నారు. దానిలో భాగంగానే ఆహారభద్రత పేరుతో 1,80,000కోట్ల భారాన్ని ప్రజల మీద మోపుతున్నారు. రాష్ట్రాల విభజనను తెరమీదికి తెస్తున్నారు. ప్రజలంతా ఆర్దికభారంతో,ప్రాంతీయ విద్వేషాలతో తన్నుకు చస్తుంటే సందట్లో సడేమియా లాగ తమ పదవికి అధికారానికి ఏ డోకా లేదని వారు మాత్రం వికటాట్టహాసం చేస్తున్నారంటే యావత్ భారత ప్రజానీకం అజ్ఞానాంధకారంలో ఉన్నారనే కదా!