గోబల్ గ్రోత్ ఇంజిన్ ఇండియా కానీ..
Published on: Wed Apr 22, 2026 2:37PM
.webp)
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న తరుణంలో భారతదేశం వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా ఎదుగుతోంది. అందులో సందేహం లేదు. అయితే.. అదే సమయంలో తయారీ రంగం బలహీనత, రూపాయి విలువ పతనం వంటి సమస్యలు ఈ వేగాన్ని నిలబెట్టగలవా అన్నసందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి. భారత ఆర్థిక వృద్ధి ప్రపంచ సగటు కంటే రెండింతలుగా ఉంది. 2022-2025 మధ్య కాలంలో భారతదేశం వాస్తవ జీడీపీ సగటున 7.7శాతం వృద్ధి నమోదు చేసింది. అదే సమయంలో చైనా 4.6శాతం, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వృద్ధి 3.4శాతంగా ఉన్నాయి. ఈ గణాంకాలు చాలు.. ఇండియా గ్లోబల్ గ్రోత్ కు ప్రధాన చోదకంగా నిలబెట్టాయని చెప్పడానికి. బలమైన దేశీయ డిమాండ్, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటం, వినియోగం, పెట్టుబడులలో స్థిరత్వం ఇవీ భారత్ ఆర్థిక పురోగతికి కారణాలుగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చెబుతోంది.
భారత తలసరి ఆదాయం ఇప్పటికీ చైనా తలసరి ఆదాయంలో ఐదో వంతు మాత్రమే కావడంతో ఉత్పాదకత పెరుగుదలకు బోలెడు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆదాయ వృద్ధికి కావలసినంత స్పేస్ ఉంది. అంతే కాకుండా ఆర్థిక పురోగతి మరింత వేగం పుంజుకోవడానికి ఇండియాలో అనుకూల పరిస్థితులు ఉన్నాయి.
ఇకపోతే.. యువ భారత్.. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద శ్రామిక శక్తిగా చెప్పాలి. భారత జనాభాలో 65 శాతం మూడున్నర పదుల వయస్సులోపు వారే. చైనా సహా పాశ్చాత్య దేశాలు వృద్ధాప్య దశలోకి వెళ్తున్న నేపథ్యంలో యువశక్తి.. భారతదేశానికి ఎంతో ప్రయోజనకారిగా నిలుస్తోంది. అలాగే గత దశాబ్దంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లలో ఇండియా 79 స్థానాలు మెరుగుదల కనబరిచింది. అదే విధంగా డిజిటల్ మౌలిక వసతులు, పన్ను సంస్కరణలు, లాజిస్టిక్స్ అభివృద్ధి కూడా పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడటానికి దోహదపడ్డాయి.
ఐఎంఎఫ్ 2026 వృద్ధి అంచనాను 6.4% నుంచి 6.5%కి పెంచింది. ప్రపంచ ఇంధన సంక్షోభం మధ్య కూడా భారత్ ఆర్థిక వృద్ధిలో పెరుగుదల ఉండటం విశేషం. ఎందుకంటే.. ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకునే దేశాలలో ఇండియా ముందు వరుసలో ఉంటుంది. ఇక చైనా వృద్ధి 2026 నాటికి 4.4%కి తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. దీంతో ప్రపంచ వృద్ధి భారాన్ని భారతదేశం మోయాలన్న అంచనాలు పెరుగుతున్నాయి.
ఇక ఇండియా వృద్ధికి అవరోధంగా నిలుస్తున్న సమస్యల విషయానికి వస్తే.. భారత్ జీడీపీలో తయారీ రంగం వాటా కేవలం 15శాతంలోపే.. అదే జపాన్ ను తీసుకుంటే ఆ దేశంలో ఇది 35శాతం, చైనాలో 30శాతం, దక్షిణ కొరియాలో పాతిక శాతంగా ఉంది. ఇక రెండోది రూపాయి విులవ పతనం. డాలర్ పరంగా చూస్తే ఇండియా 6వ స్థానానికి పడిపోయింది. చమురు, బంగారం, గ్యాస్ వంటి వాటి దిగుమతులు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితి ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరిగే ప్రమాదాన్ని ఇనుమడింప చేసింది. వీటిని అధిగమించి భారత్ ముందుకు సాగాలంటే.. హరిత ఇంధనంపై దృష్టి సారించాలి. దీని వల్ల శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుంది. దాంతో ఇంధన బిల్లు ఇటోమేటిగ్గా తగ్గుతుంది. అంటే రూపాయి స్థిరపడుతుంది. ప్రపంచ ఇంధన సంక్షోభాల ప్రభావం తగ్గుతుంది ఇందు కోసం తయారీ రంగాన్ని భారీగా విస్తరించాలి. తద్వారా ఎగుమతులు పెరుగుతాయి. విదేశీ మారక ద్రవ్య ప్రవాహం కూడా పెరుగుతుంది. అంటే రూపాయి బలపడుతుంది. అప్పుడే చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియా స్థిరమైన తయారీకేంద్రంగా ఎదిగే అవకాశాలు మెరుగుపడతాయి. భారతదేశం ప్రపంచ వృద్ధి కీలక చోదక శక్తిగా ఎదుగుతోంది. ఈ వేగాన్ని తయారీ రంగాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారా నిలబెట్టుకోవాలి.
సేకరణ, సంకలనం : సీతారాం కంఠంనేని


