ఇలా జరిగితేనే టీమ్ ఇండియాకు సెమీస్ బెర్త్..!
Published on: Thu Nov 4, 2021 4:51PM
దుబాయ్ లో జరుగుతున్న టీట్వంటీ వరల్డ్ కప్ లో తొలి రెండు మ్యాచ్ లు ఘోరంగా ఓడిపోయింది టీమిండియా. తొలి మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో చిత్తైంది. పాక్ తో ఘోర ఓటమిని ఫ్యాన్స్ మరిచిపోకముందే న్యూజీలాండ్ చేతిలో పరాజయం పాలైంది. రెండు వరుస ఓటములతో గ్రూప్ 2 నుంచి సెమీస్ చేరే అవకాశాలను భారత్ క్లిష్టతరం చేసుకుంది. అయితే మూడో మ్యాచ్ లో మాత్రం ఆప్ఘనీస్తాన్ పై 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ప్రపంచ కప్ లో కోహ్లీ సేనకు సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. అయితే అందుకోసం కొన్ని అద్భుతాలు జరగాల్సి ఉంది.
సెమీస్ పోటీలో నిలవాలంటే తప్పక గెలవడమే కాకుండా రన్‌రేట్‌ను కూడా మెరుగుపర్చుకోవాల్సిన స్థితిలో భారత్ ఆల్‌రౌండ్ షోతో అప్ఘన్ పై అదరగొట్టింది. గతరెండు మ్యాచ్‌ల్లాగే మరోసారి టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన.. ఈసారి 210/2 భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించడంతో గ్రూప్-2 పాయింట్ల పట్టికలో ఒక స్థానం మెరుగు పర్చుకొని నాలుగో ప్లేస్‌లో నిలిచింది. నెట్ రన్ రేట్ కూడా భారీగా పెరిగింది. మ్యాచ్ కు ముందు మైనస్ లో ఉన్న రన్ రేట్ ప్లస్ కి వచ్చింది, దీంతో ఇప్పుడందరూ టీమ్‌ఇండియా సెమీ ఫైనల్ చేరాలని కోరుకుంటున్నారు.
కోహ్లీసేన ఇప్పుడు సెమీస్ చేరాలంటే అంత తేలికేం కాదు. అయితే టీ20 క్రికెట్‌లో ఏమైనా జరగొచ్చు. న్యూజిలాండ్ తన ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో ఏ ఒక్కటి ఓడినా టీమ్ ఇండియాకు మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే మన జట్టు మిగతా రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో స్కాట్లాండ్, నమీబియాలపై నెగ్గి రన్‌రేట్‌ను (అఫ్గాన్ కన్నా 1.481 ప్రస్తుతం) మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. టీమ్‌ఇండియా ప్రస్తుత రన్‌రేట్ 0.073. ఈ రెండు మ్యాచ్‌లు గెలవడం భారత్‌కు ఈజీనే. కానీ కివీస్ ఆ రెండు జట్లతో ఓడాలంటే మాత్రం అద్భుతం జరగాలి. ఈ నేపథ్యంలో భారత అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు ప్రధానంగా అఫ్గాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌పైనే పడ్డాయి. ఆ మ్యాచ్‌లో కివీస్ ఓటమిపాలై భారత్ ముందుకు సాగాలని ఆశిస్తున్నారు. అదే జరగాలని మనమూ ఆశిద్దాం.


