TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జడేజా రికార్డ్ స్కోర్.. పంత్ సూప‌ర్‌హిట్‌.. టీమిండియా బిగ్ ఇన్నింగ్స్‌..

Published on: Sat Mar 5, 2022 2:22PM

జ‌డేజా బాదేశాడు. రెచ్చిపోయి ఆడేశాడు. వ‌న్డే త‌ర‌హా బ్యాటింగ్‌తో కుమ్మేశాడు. అంత‌కుముందు రిష‌భ్ పంత్ టీ20 బ్యాటింగ్‌కు త‌ల‌పించ‌గా.. తానేమీ త‌క్కువ కాద‌న్న‌ట్టు.. జ‌డ్డూ సైతం చెల‌రేగిపోయాడు. 

శ్రీలంకతో తొలి టెస్టు, తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (175 నాటౌట్‌; 228 బంతుల్లో 17×4,3×6) భారీ స్కోర్ చేశాడు. టీమిండియా తరఫున 7 నెంబర్‌ బ్యాట్స్‌మెన్‌గా.. టెస్టుల్లో అత్యధిక స్కోర్‌ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు కపిల్ దేవ్‌ (163) పేరిట ఉన్న ఆ రికార్డును జ‌డ్డూ బ్రేక్ చేశాడు. 

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 574/8 స్కోర్ ద‌గ్గ‌ర‌ డిక్లేర్‌ చేసింది. శనివారం రెండో రోజు ఆటలో భారత్‌ 357/6 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్‌ కొనసాగించగా మరో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకో 217 పరుగులు జోడించింది.  

తొలి సెషన్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ (61; 82 బంతుల్లో 8×4)తో కలిసి ఏడో వికెట్‌కు 130 పరుగుల కీలక భాగస్వామ్యం జోడించాడు జ‌డేజా. సెకండ్‌ సెషన్‌లో మహమ్మద్ షమి (20; 34 బంతుల్లో 3x4) తో కలిసి 103 పరుగుల మరో సెంచ‌రీ భాగస్వామ్యం నిర్మించాడు. దీంతో టీమిండియా 23 టెస్టుల తర్వాత 500కు పైగా స్కోర్‌ నమోదు చేసింది.
 
శుక్రవారం తొలిరోజు రిషభ్‌ పంత్‌ (96; 97 బంతుల్లో), హనుమ విహారి (58; 128 బంతుల్లో 5×4) హాఫ్ సెంచ‌రీలతో చెల‌రేగిపోయారు. రిష‌భ్ పంత్ అయితే లంక బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోసేశాడు. తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సుల‌తో చుక్క‌లు చూపించాడు. అయితే, సెంచ‌రీకి 4 ప‌రుగుల ముందు అవుటై పెలివియ‌న్‌కు చేరుకున్నాడు. 

ఇక‌, శ్రీలంక బౌలర్లలో సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండో, లసిత్‌ ఎంబుల్దెనియా రెండేసి వికెట్లు తీయగా.. లాహిరు కుమార, ధనంజయ డి సిల్వా చెరో వికెట్ పడగొట్టారు.