అవును నిజమే.. చైనా హద్దులు దాటింది.. మరి ఆ మంట పెట్టింది ఎవరు? 

భారత చైనా సరిహద్దులోని గాల్వన్ లోయ ప్రాంతం లో కొద్ది రోజుల క్రితం ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఐతే తాజాగా ఉపగ్రహ ఛాయాచిత్రాల సమాచారం ప్రకారం చైనా సైన్యం 423 మీటర్లు భారత భూభాగం లోకి చొచ్చుకువచ్చినట్లుగా తెలుస్తోంది. 1960లో చైనా పేర్కొన్న సరిహద్దు రేఖను దాటి 423మీటర్ల మేర మన ప్రాంతం లోకి ఆ దేశం చొరబడింది. ఐతే చైనా తో భారత్‌ ఈ రోజు కమాండర్‌ స్థాయి చర్చలు జరపనుంది. ఇప్పటివరకూ రెండు సార్లు చర్చలు జరగగా అవి సరిహద్దుకు అవతలి వైపున్న చైనా వైపున ఉన్న మోల్డోలో జరిగాయి. ఈ రోజు జరిగే చర్చలు భారత భూభాగంలోని చుల్‌షుల్‌లో జరగనున్నాయి. ఇది ఇలా ఉండగా హిందూ మహా సముద్రంపై భారత్‌ తన నిఘాను పెంచింది. దానితో పాటు అమెరికా, జపాన్‌ నేవీలతో కలిసి సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు చేపట్టింది. భారత యుద్ధనౌకలు ఐఎన్‌ఎస్‌ రాణా, ఐఎన్‌ఎస్ కులిష్‌ ఇందులో పాల్గొన్నాయి.

గల్వాన్‌ లోయను ఆక్రమించి చైనా సైనికులు వేసిన గుడారం అనుకోని విధంగా అగ్నిప్రమాదానికి గురైందని దాంతో ఈ నెల 15న ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని కేంద్రమంత్రి వీకే సింగ్‌ తెలిపారు. మొట్టమొదటి సారి రెండు దేశాల మధ్య చర్చలు జరిగినప్పుడు గల్వాన్‌లోని నియంత్రణ రేఖ వెంట రెండు దేశాల సైనికులు ఉండరాదని ఒప్పందం జరిగిందని, ఐతే చైనా సైనికులు మళ్లీ అక్కడకు చేరి గుడారం నిర్మించారని అయన తెలిపారు. దీని పై చైనా సైన్యాన్ని ప్రశ్నించేందుకు భారత సైనికులు వెళ్లగా.. అక్కడ ఉన్న గుడారం అంతుచిక్కని రీతిలో అగ్నికి ఆహుతి అయిపోవడంతో ఘర్షణ మొదలైందని ఆయన అన్నారు.

ఇది ఇలా ఉండగా సోషల్‌ మీడియాలో పాకిస్తాన్ భారత్ పై విషప్రచారం చేస్తోంది. పీవోకేలోని గిల్గిట్, స్కర్దు‌ విమానాశ్రయాలలో చైనా 50 జే-10 యుద్ధవిమానాల్ని మోహరించిందని తన సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసున్నాయి. ఐతే ఆ రెండు విమానాశ్రయాలు కలిపినా కూడా ఆ స్థాయిలో ఫైటర్ విమానాల్ని నిలిపేందుకు కావలసిన మౌలికవసతులు లేవని తెలుస్తోంది. ఐతే తాజాగా తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలలో అసలు గిల్గిట్‌లో విమానాలు లేవని తేలింది. ఇక అటు చైనా వైపున గల్వాన్‌లో భారీ సంఖ్యలో సైన్యాన్ని సమీకరించింది కానీ అక్కడ నదీ ప్రవాహం అడ్డంకిగా మారింది. చైనా వైపున కొత్తగా నిర్మించిన రహదారులు నదిలో కొట్టుకుపోయినట్లు కూడా తెలుస్తోంది. నదీ తీరాన్ని కృత్రిమంగా చైనా కొంత తగ్గించినప్పటికీ దాన్ని కూడా గల్వాన్‌ నది తిరిగి కలిపేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా చైనాలోని రిజర్వు బలగాలు అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అధీనంలోకి వచ్చాయి. చైనా సైన్యాన్ని ప్రపంచస్థాయి సైన్యంగా తయారుచేసేందుకు ఈ చర్య తీసుకున్నట్లు చైనా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశం అయ్యారు.

ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాయంత్రం 4 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని ప్రధాని కార్యాలయం ఓ ట్వీట్‌ లో తెలిపింది. అన్‌లాక్‌ 2.0పై కేంద్రం మార్గదర్శకాల తో పాటు నిన్ననే 59 చైనా యాప్‌లపై నిషేధం ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు జాతినుద్దేశించి ప్రధాని చేయనున్న ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆదివారం తన ‘మన్‌కీ బాత్‌’ లో స్వదేశీ వస్తువులనే కొనాలని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.