అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈనెల 31 వరకు రద్దు

ప్రత్యేక పరిస్థితుల్లో ఇరుదేశాల అంగీకారంతో సర్వీసులు
దేశీయ, కార్గో సర్వీసులు అందుబాటులో ఉంటాయి

అంతర్జాతీయ విమాన సర్వీసులను ఈనెల 31వరకు రద్దు చేస్తున్నామని పౌర విమానయాస నియంత్రణ సంస్ధ(డిజిసిఎ) ప్రకటించింది. కరోనా కట్టడి చేసేందుకు లాక్ డౌన్లో భాగంగా విదేశీ విమాన ప్రయాణాలను మార్చి 23 నుంచి నిలిపివేశారు. ఈనెల 15తో రద్దు గడువు ముగిసిపోతుంది. అయితే ఈ గడువును జూలై 31వరకు పొడిగిస్తామని డిజిసిఎ ఛైర్మన్ అరవింగ్ సింగ్ చెప్పారు. వందే భారత్ మిషన్ లో భాగంగా మే ఆరో తేదీ నుంచి కొన్ని దేశాలకు ప్రత్యేక సర్వీసులు నడుస్తున్నాయని, అవి అవసరాన్ని బట్టి నడుస్తాయని ఆయన చెప్పారు. ఆయా దేశాల్లో చిక్కుపడిపోయిన భారతీయులను స్వదేశం తీసుకురావడానికి, మన దేశంలో ఉండిపోయిన విదేశీయులను వారి దేశాలకు పంపించడానికి ఇరు దేశాల మధ్య అంగీకారంతో కొన్ని అంతర్జాతీయ సర్వీసులు నడుస్తాయి. దేశీయ విమాన సర్వీసులు, కార్గో సర్వీసులు నడుస్తాయి.