చైనాకు భారత్ మరో పెద్ద షాక్.. మరో 43 యాప్‌ల నిషేధం

భారత్ చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో గత జూన్ లో పలు చైనా యాప్‌లను నిషేధిస్తూ చర్యలు తీసుకున్నకేంద్ర ప్రభుత్వం.. తాజాగా చైనాకు మరో ఝలక్ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన 43 యాప్‌లను బ్యాన్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మనదేశ సార్వభౌమత్వం, సమగ్రత, రక్షణ, భద్రతకు ముప్పు వాటిల్లుతోందని పేర్కొంటూ ఈ 43 మొబైల్ అప్లికేషన్లను నిషేధిస్తూ సమాచార, సాంకేతిక శాఖ ఈరోజు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుబంధ ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా బ్యాన్ చేసిన ఈ యాప్స్‌లో చైనా వ్యాపార దిగ్గజ సంస్థ అలీ ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది. దానితో పాటు అలీబాబా వర్క్ బెంచ్, హీరోస్ ఎవాల్వ్‌డ్, డింగ్ టాక్ వంటి ఇతర అప్లికేషన్లున్నాయి. 

 

ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది జూన్ 29న ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69 ఏ కింద 59 మొబైల్ యాప్స్‌ను.. అలాగే సెప్టెంబర్ 2న మరో 118 యాప్‌లను ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. వీటిలో ఎక్కువగా చైనీస్ యాప్‌లే. కాగా టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, వీ చాట్, లూడో వంటి యాప్‌లు భారతదేశ సమగ్రత, సార్వభౌమత్వానికి భంగం వాటిల్లేలా చేస్తున్నాయంటూ గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి.