అశ్విన్ ఆస్ట్రేలియా రా... అప్పుడు చెప్తా..
Published on: Wed Mar 22, 2017 11:58AM

ఆస్ట్రేలియా-ఇండియా జట్ల మధ్య ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉందో.. జట్టు సభ్యుల మధ్య పోరు కూడా అదే రేంజ్ లో ఉంది. ఇప్పటికే కోహ్లీ, స్మీత్ ల మధ్య వివాదం ఏర్పడిన నేపథ్యంలో కోహ్లీపై ఆసీస్ పలు ఆరోపణలు చేస్తుంది. ఇప్పుడు తాజాగా మరో ఆటగాడు ఆస్ట్రేలియన్ పేస్‌బౌలర్ మిచెల్ స్టార్క్ స్పిన్నర్ అశ్విన్ ను టార్గెట్ చేశాడు. అశ్విన్‌కు బౌలింగ్ చేయడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నానని, అతని హెల్మెట్ లక్ష్యంగా బంతులు విసరాలనుకుంటున్నట్లు స్టార్క్ చెప్పాడు. బెంగళూరులో జరిగిన రెండో టెస్ట్ సందర్భంగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ స్టార్క్‌ను అశ్వినే ఔట్ చేశాడు. స్టార్క్ ను ఔట్ చేసిన తరువాత.. అశ్విన్ తన నుదురుపై షూట్ అన్నట్లుగా రెండు వేళ్లు పెట్టి పదేపదే సంబరాలు చేసుకున్నాడు. అయితే అంతకుముందు టీమిండియా ఓపెనర్ ముకుంద్‌ను ఔట్ చేసినపుడు స్టార్క్ ఇలాగే చేయడంతో అతన్ని అశ్విన్ అనుకరించాడు. ఇక అది మనసులో పెట్టుకున్న స్టార్క్... ఆస్ట్రేలియాలో అశ్విన్‌కు బౌలింగ్ చేయాలని అనుకుంటున్నా. అతని సలహా మేరకే అతని తల లక్ష్యంగా చేసుకొని బౌలింగ్ చేస్తా అని మాట్లాడాడు. మరి ఇరు జట్ల మధ్య ముదురుతున్న వివాదాలు ఇలాగే కొనసాగితే ముందు ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి వీటికి ఎవరు ముగింపు పలుకుతారో చూడాలి.


