చరిత్ర సృష్టించిన భారత్

 

 

india australia, india delhi test, australia delhi test

 

 

ఆస్ట్రేలియాపై ఇండియా రికార్డ్ విజయం సాధించింది. ఢిల్లీలో జరిగిన చివరి టెస్టు లో భారత్ ఆరు వికెట్లతో గెలుపొందింది. నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. 80ఏళ్ల భారత్ క్రికెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద సిరీస్ విజయం. చివరిసారిగా 1993-94లో ఇంగ్లండ్‌పై అజహరుద్దీన్ టీం 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. రవీంద్ర జడేజా 'మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్', రవిచంద్రన్ అశ్విన్ కు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' వరించాయి.

 

తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్ల నష్టంతో 266 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ కేవలం 6 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన ఇషాంత్(0),ఓజా(0) వెను వెంటనే ఔటయ్యారు. దీంతో భారత్ తొలిఇన్నింగ్స్‌లో 272 పరుగులు చేసి 10 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.


అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆటగాళ్లపై భారత బౌలర్లు విరుచుకుపడ్డారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 164 పరుగులకే ఆలౌట్ అయి, భారత్ ముందు 155 పరుగులు విజయలక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్ ఆటగాడు సిడల్ ఒంటిపోరాటం చేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో సిడిల్ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కోవాన్(24),వేడ్(19) స్మిత్(18) పరుగులు మినహా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత్ బౌలర్లు జడేజాకు ఐదు వికెట్లు, అశ్విన్, ఓజాకు చెరో రెండు వికెట్లు, ఇషాంత్ శర్మకు ఒక వికెట్ దక్కాయి.


తర్వాత 155 పరుగుల విజయమే లక్ష్యంగా ఆట ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడి ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. పుజారా (82)పరుగులు, ధోని(11) పరుగులతో నాటౌట్‌గానిలిచారు.