ఈ నెంబర్స్ ఇండియా, పాకిస్తాన్ లకు ఎంతో ఇంపార్టెంట్! ఎందుకు?

 

ఆగస్ట్ 14…. మనకు పెద్ద ప్రత్యేకం ఏం కాదు! కాని, ఆగస్ట్ 15 మనకు చాలా స్పెషల్! ఆ రోజే మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది. అయితే, ఆగస్ట్ 14 మన పక్క దేశానికి వెరీ వెరీ స్పెషల్! పాకిస్తాన్ పుట్టింది ఆ రోజే! మనకన్నా ఒక్క రోజు ముందు పాకిస్తాన్ కు స్వేచ్ఛ లభించింది. అయితే, అఖండ భారత్ నుంచి పాకిస్తాన్, నేటి బంగ్లాదేశ్ లు విడిపోయిన రోజుగా.. ఆగస్ట్ 14 మనకు మాత్రం ఓ విషాద దినం! మరి మన 70ఏళ్లు పూర్తైన మన స్వతంత్ర ప్రస్థానం వేళ… ఓ సారి కొన్ని ముఖ్యమైన సంఖ్యలపై దృష్టి సారిద్దామా! ఈ కీలకమైన నెంబర్లు మనకే కాదు, పాకిస్తానీలకు, బంగ్లాదేశీలకు కూడా ఎంతో ముఖ్యమే!

 

190… అవును… 190సంవత్సరాల సుదీర్ఘ కాలం మన దేశాన్ని బ్రిటీషర్లు ఆక్రమించారు. పరిపాలించారు. దోపిడీ చేశారు. వెళుతూ వెళుతూ ఇండియా, పాకిస్తాన్ గా అఖండ భారత్ ని విడదీసి వెళ్లారు.

 

400మిలియన్లు… అంటే 40కోట్లు! ఈ సంఖ్య డెబ్బై ఏళ్ల కిందటి భారత దేశ జనాభ! మనల్ని బ్రిటీష్ వాళ్లు వదిలి వెళ్లేటప్పుడు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ భూభాగాలు మొత్తంలో కలిపి వున్న జనం సంఖ్య!

 

40రోజులు… ఈ సంఖ్య ఏంటో తెలుసా? బ్రిటీష్ జడ్జ్ సిరిల్ రాడ్ క్లిఫ్ కు విధించిన కాల పరిమితి! కేవలం 40రోజుల్లో కోట్లాది మంది భారతీయుల బతుకుల్ని, చావుల్ని నిర్దేశించే దేశ విభజన చిత్రపటాన్ని గీసేశాడు ఆ తెల్ల న్యాయాధికారి! అతను చేసిన విభజన తరువాత విపరీతమైన ప్రాణ నష్టం సంభవించింది…

 

3800మైళ్లు… అంటే 6100కిలో మీటర్లు! ఇంత సుదీర్థ సరిహద్దులు ఇండియా , పాకిస్తాన్ ల మధ్య ఏర్పడ్డాయి. ఆనాటి తూర్పు పాకిస్తాన్… అంటే నేటి బంగ్లాదేశ్ … పశ్చిమ పాకిస్తాన్ కు 1000మైళ్ల దూరంలో వుండేది! మధ్యలో భారత భూభాగం వుండగా తూర్పున, పశ్చిమాన పాకిస్తాన్ వుండేలా విభజన జరిగింది.

 

0… అవును సున్నా సార్లు పాకిస్తాన్ అన్న పేరు ఉచ్ఛరించారు అప్పటి బ్రిటీష్ ప్రధాని అట్లీ, భారత వైస్రాయ్ మౌంట్ బ్యాటన్! దేశ విభజన ప్రకటన చేస్తూ, జూన్ 3, 1947న… బ్రిటీష్ ప్రధాని, వైస్రాయ్ ఒక్కసారి కూడా పాకిస్తాన్ అన్న పదం వాడలేదు!

 

48గంటలు… ఇండియాకి ఫ్రీడమ్ డిక్లేర్ చేయటానికి 48గంటల ముందు నుంచీ బ్రిటీష్ సేనలు తమ స్వదేశానికి బయలుదేరటం ప్రారంభించాయి. కాని, పూర్తిగా తెల్ల వారి సైన్యం ఇంటి ముఖం పట్టటానికి 1948 ఫిబ్రవరీ వరకూ సమయం పట్టింది!

 

1మిలియన్… అంటే 10లక్షలు! ఈ ఒళ్లు గగుర్పొడిచే సంఖ్య భారత్ , పాకిస్తాన్ విభజన కారణంగా చనిపోయిన అభాగ్యులది! ఇది తప్పని వాదించే వారు చాలా మంది వున్నారు. 20లక్షల మందికి పైగానే ప్రాణాలు కోల్పోయి వుంటారని అంచన!

 

83వేలు! మీ గుండె రాయి చేసుకోండి! ఈ సంఖ్య దేశ విభజన కాలంలో అత్యాచారాలకి, కిడ్నాప్ లకి గురైన అమ్మాయిలు, స్త్రీల సంఖ్య! సహజంగానే… ఇది కూడా ఖచ్చితమైన లెక్క కాదు! ఇంకా ఎక్కువ సంఖ్యలోనే అభాగిణులు తమ మానాలు, ప్రాణాలు కోల్పోయి వుండవచ్చు!

 

15మిలియన్లు… అంటే ఒక కోటీ యాభై లక్షలు! ఇంత మంది భారత్ , పాకిస్తాన్ ల మధ్య వలస వెళ్లారు! అత్యధికులు హిందూ, సిక్కు మతస్థులు పాకిస్తాన్ నుంచి భారత్ వచ్చేశారు!

 

4లక్షలు… అవును… నాలుగు లక్షల మంది పాకిస్తాన్ నుంచి కాలి నడకన ఎర్రటి ఎండలో భారతదేశం వలసొచ్చారు! వారంతా ఒకే క్రమ వరుసలో క్యూ కట్టినట్టు స్వంత దేశంలో శరణార్థలై నడిచొచ్చారు!

 

2లక్షల మైళ్లు… శరణార్థుల్ని మోసుకుని వచ్చిన ట్రైన్లు అప్పట్లో తిరిగిన మొత్తం దూరం సంఖ్య ఇది!

 

3…. ఇప్పటికి మూడు సార్లు మనకు , పాకిస్తాన్ కు మధ్య యుద్ధం జరిగింది! మూడు సార్లు మనమే గెలిచాం. ఒకసారైతే విభజన సమయంలో తూర్పు పాకిస్తాన్ గా ఏర్పడ్డ భూభాగం బంగ్లాదేశ్ గా ఆవిర్భవించింది! ఇందిరా గాంధీ సమయంలో జరిగిన ఈ పరిణామం భారతదేశానికి ఎంతో మేలు చేసిందని చెప్పాలి! ఇరువైపుల పాకిస్తాన్ వుంటే… ఇప్పటి మన పరిస్థితి మరింత దారుణంగా వుండేది!