TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టెండూల్కర్‌ మండిపడ్డాడు

Published on: Thu Aug 11, 2016 1:13PM

 

కొంతమంది ఏం మాట్లాడినా సంచలనమే అవుతుంది. మరికొందరు కేవలం సంచలనం కోసమే మాట్లాడినట్లు కనిపిస్తారు. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత్రి, కాలమిస్టు శోభా డే ఏ కోవలోకి వస్తారో చెప్పడం కష్టం కానీ, సంచలనాలకి మాత్రం కేంద్రబిందువుగా ఉంటుంటారు. తాజాగా ఒలింపిక్స్‌లో భారతీయ ఆటగాళ్ల మీద శోభా చేసిన ట్వీట్ మీద భారతీయ క్రీడాభిమానులు మండిపడుతున్నారు. ‘ఒలింపిక్స్‌కు వెళ్లండి. సెల్ఫీలు తీసుకోండి. ఖాళీ చేతులతో ఇంటికి రండి. ఇదే మన భారతీయ ఒలింపిక్‌ జట్టు లక్ష్యంలా ఉంది. వీరి వల్ల ఎంత డబ్బు, ప్రతిభా వృథా!’ అంటూ శోభా మొన్న సోమవారం వాక్రుచ్చారు.

 

అసలే రోజులు గడుస్తున్నా ఒక్క కాంస్యం కూడా దక్కక చిరాకెత్తి ఉన్న అభిమానులకు శోభా వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లు అనిపించాయి. దీంతో వాళ్లూ వీళ్లూ అని లేకుండా అభిమానులంతా శోభా మీద విరుచుకుపడ్డారు. అభిషేక్‌ బచ్చన్‌, అర్జున్‌ కపూర్‌, సోనాక్షీసిన్హా వంటి బాలీవుడ్‌ ప్రముఖులంతా శోభాని తమ ట్విట్టర్‌లో దులిపేశారు. ఇక గుత్తా జ్వాల, అభినవ్‌ బింద్రా, మన్‌ప్రీత్‌ కౌర్‌ వంటి ఆటగాళ్లంతా... ఆటగాళ్ల విధేయతను శంకించవద్దంటూ తలంటారు.

 

ఇదంతా ఒక ఎత్తైతే ఎప్పుడూ వార్తల్లోకి ఎక్కని టెండూల్కర్ కూడా శోభా వ్యాఖ్యలకు స్పందించడం విశేషం. ‘ఒలింపిక్స్‌ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పోటీ అనీ, ఇలాంటి పోటీలకి దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం సామాన్యమైన విషయం కాదని’ చెప్పుకొచ్చాడు. తాను వారిని దగ్గరగా చూసి వస్తున్నాననీ, ఏళ్ల తరబడి శ్రమించినా.... తృటిలో పతకం జారిపోతే చాలా బాధగా ఉంటుందనీ పేర్కొన్నాడు. మన ఒలింపిక్స్ జట్టుకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం వల్ల టెండూల్కర్‌ ఇలా స్పందించాడా లేకపోతే ఒక భారతీయుడిగా ప్రతిస్పందించాడా అన్నది పక్కన పెడితే... ఎప్పుడూ నోరు విప్పని సచిన్‌ ఇలా ఎదురుతిరగడంతో మీడియా పండగ చేసుకుంటోంది.