TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ మద్యం కుంభకోణం.. ఇప్పుడు ఐటీ ఎంట్రీ.!

Published on: Fri Aug 28, 2026 3:42PM

ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణం దర్యాప్తులోకి ఇప్పుడుఐటీ ఎంటర్ అయ్యింది. జగన్ హయాంలో జరిగిన కోట్లాది రూపాయల మద్యం కుంభకోణం వ్యవహారంలో ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్, ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంగా తాజాగా ఈ కేసు దర్యాప్తులోకి ఆదాయపన్ను శాఖ ఐటీ ఎంటరైంది.  ప్రభుత్వ వ్యవస్థలను, మద్యం డిస్టిలరీలను గుప్పిట్లో పెట్టుకుని వందల కోట్ల రూపాయల ముడుపులు దండుకున్న తీరును విచారణ సంస్థలు బయటకు తీస్తున్న సంగతి విదితమే. 

ఏపీ మద్యం కుంభకోణంలో   డిస్టిలరీలు, మద్యం సరఫరా సంస్థల నుంచి లంచాల రూపంలో వసూలు చేసిన వేల కోట్ల రూపాయల నగదును ఫేక్ ఇన్వాయిస్‌లు, షెల్ కంపెనీల నెట్‌వర్క్ ద్వారా మళ్లీ మార్కెట్‌లోకి తీసుకువచ్చినట్లు ఇప్పటికే  దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. డిస్టిలరీల నుంచి సేకరించిన సొమ్మును  హవాలా మార్గాల ద్వారా, బినామీ కంపెనీల పేరిట దుబాయ్ వంటి  దేశాలకు అక్రమంగా తరలించినట్లు ఈడీ, సిట్ విచారణలో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ మనీ ట్రయిల్, అక్రమ ఖాతాల వివరాలను సేకరించేందుకు ఇటీవల హైదరాబాద్‌లో సిట్, ఈడీ,  ఐటీ ఉన్నతాధికారులు ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. బ్యాంకు ఖాతాల లావాదేవీలు, ఫారిన్ రెమిటెన్సులు, ట్యాక్స్ ఎవేషన్ అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.

 మద్యం విక్రయాల్లో కమీషన్ల దందా   పక్కాగా జరిగిందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ప్రతి మద్యం కేస్‌పై   15నుంచి 20 శాతం వరకు కమీషన్ వసూలు చేశారని  ఆ సంస్థలు చెబుతున్నాయి. లో-కాస్ట్ మద్యం బ్రాండ్లపై కేస్‌కు 150 రూపాయలు,   హై-ఎండ్ బ్రాండ్లపై కేస్‌కు 600  రూపాయల వరకు ప్రత్యేకంగా రేట్లు నిర్ణయించి మరీ లంచాలు దండుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

ఈ భారీ దందాలో కీలక సూత్రధారులుగా    రాజ్ కేసిరెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి, మాజీ మంత్రి కరుమూరి వెంకట నాగేశ్వర రావు,  ఆయన కుమారుడు సునీల్ కుమార్ ఉన్నారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. మాజీ మంత్రి కరుమూరి నాగేశ్వర రావు ఈ కేసులో ఇటీవలే అరెస్టై రిమాండ్ లో ఉన్నారు.  అంతకుముందే రాజ్ కేసిరెడ్డి, వాసుదేవ రెడ్డి, సునీల్ కుమార్‌లు అరెస్టయ్యారు.   ఇప్పటివరకు ఈడీ ఈ కేసుకు సంబంధించి 441 కోట్ల రూపాయల  విలువైన ఆస్తులను  జప్తు చేసింది. మరో 37.79 కోట్ల రూపాలయ విలువైన స్థిర, చర ఆస్తులను అటాచ్ చేసింది.  

ఈ తరుణంలో మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులోకి ఎంటరైన ఆదాయపన్ను (ఐటీ) శాఖ నిందితుల వ్యక్తిగత ఖాతాలు, వారి అనుబంధ షెల్ కంపెనీల ఆర్థిక వివరాలను పరిశీలిస్తోంది. పన్ను ఎగవేత, అకౌంటెన్సీ మోసాలపై త్వరలోనే డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకు సమాయత్తమవుతోంది. అసలు ఈ నిధుల మూలాలు ఎక్కడున్నాయి? విదేశాలకు డబ్బు ఎలా చేరింది? ఈ  కుంభకోణంలోతుది  లబ్ధిదారులు ఎవరు? అనే కోణంలో ఐటీ, ఈడీ, సిట్ సంయుక్తంగా విచారణ  చేస్తుండటం విశేషం.  

 

(Income Tax entry Into AP Liquor Scam Probe,  AP liquor case, ED investigation AP liquor scam shell companies, Telugu One)