ఇమ్రాన్.. పిచ్చా... వెర్రా?!
Published on: Fri Jun 3, 2022 6:43AM
అధికారంలో వున్నపుడు తిరుగులేదనుకున్నవాడు అందరూ కలిసి కిందకి దింపగానే అసలు దేశమే నాశనమైపోతుందని బాహాటంగానే ప్రకటించడం పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ నోటిదూల. ఈ కాలంలో ఏ దేశంలోనైనా ప్రధానిని సైతం ఛీత్కరించే ఓటర్లు, కుర్చీనుంచీ దించేసే సేనా నాయకులు వున్నారు, వుంటారు. తాను వున్నపుడే దేశం మహాద్భుతంగా వుందని, తనని దించేయడం దేశానికి అరిష్టమని అనడం ఖాన్‌గారి అమాయకత్వమే అవుతుంది. సరయిన నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ప్రగతి పథంలో నడపాలనే ఎవరయినా అనుకుంటారు. కానీ నీకు నచ్చలేదని ఆ నిర్ణయాలు దేశాన్ని దారుణ పరిస్థితులకు దారితీయిస్తాయని అనడం ఖాన్‌గారి మానసిక స్థితికి పరాకాష్ట. ఇది నిజానికి ఖాన్ స్వయంకృతం. ఇమ్రాన్ కి దేశాధినేత పీఠం పిచ్చ బాగానే అబ్బింది. అందుకనే అది దూరమయిన బాధలో పాపం ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియడం లేదు. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో గతే పట్టిందనే అనుకోవాలి, తిరిగి అధికారంలోకి రావడం కడు దుర్లభం. మరి ఏం చేస్తూ కాలం గడుపుతారని ఏకంగా ప్రెస్ వారే అడిగేరు.
ఖాన్‌గారు ఇంకా గొప్ప క్రికెటర్‌గా ప్రపంచ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నానన్న, హీరో భ్రమలోనే వున్నారు. మనోడు ఏదో చేస్తాడని పీఠం ఎక్కిస్తే సైనికాధికారుల మాట వినకా తప్పలేదు. తన మాట చెల్లించుకుని ఏదో చేసేనని ప్రచారం చేయించుకోవడానికి నానా తంటాలూ పడ్డాడు. ఏకంగా పదవీ పోయింది. ఇపుడు వుక్రోషంతో వున్నాడు. స్కూల్లో టీచర్ సొంటిపిక్క పెట్టినందుకు పుస్తకాలు చింపేసిన చిన్నపిల్లాడి ఆగ్ర హం ఎంతవరకూ సబబు. పరిస్థితులు బేరీజువేసుకుని తాను మళ్లీ అధికారంలోకి రావడానికి మార్గాలు సుగమం చేసుకోవాలేగాని నోటి దూలంతా ప్రదర్శిస్తే పడి చావడానికి గతంలో ఆయన్ను అభిమానించిన క్రికెట్ సంఘంవారు కాదు మిలటరీ అధికారులు. పైగా దేశ ఆర్ధిక పరిస్థితి దెబ్బతినే నిర్ణయాలు తీసుకో వడం దారుణ స్థితికి దేశాన్ని నెట్టేస్తుందని తెహ్రీక్ ఇన్‌సాఫ్ నేత గోడు పెడుతున్నాడు.
తాను అధికారంలో వుంటేనే దేశం బాగుంటుందని లేకుంటే విచ్ఛిన్నమవుతుందన్న అబిప్రాయాలు ఇమ్రాన్ బుద్ధి హీనతనే స్పష్టం చేస్తుంది. ఆర్ధికంగా పూర్తిగా దెబ్బతినేకాలం ఆట్టేదూరంలో లేదన్నది ఇమ్రాన్ ఖాన్ భవిష్యత్ వాణి. కానీ ఇదంతా ఆయన ఆశిస్తున్నదేగానీ, నిజానికి ఏ పాకిస్తానీ దేశం చీలి పోవడాన్ని ఇష్టపడటం లేదని, ఇదంతా భారత్ ప్రధాని మోడీ అలవాటు చేసిన పదజాల మహత్తేనని పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తిట్టిపోసేడు. ఖాన్ క్రమేపీ భారత్ భాషకు బాగా అలవాటు పడుతు న్నా డన్నది పాక్‌కి మింగుడుపడుతుందా? అధికారంలో వున్నపుడు ఒకలాగా, దిగిపోగానే మరొక లాగా వ్యాఖ్యానించడం, ఆగ్రహించడమన్నది మరి పొరుగువారి చలవేనని పాక్ మాజీ అధ్యక్షుల వారి ఉవాచ.
నిజమే కావచ్చు కొండకచో ఇమ్రాన్‌కి భారత్ పట్ల కొంత ప్రేమే వుండవచ్చు. పీఠం మీద వున్నంతసేపు అంతా తన మాటే వినాలని, దించబడిన తర్వాత లోకమంతా తనను మోసం చేసిం దన్న బాధతో నోటికి వచ్చినట్టు మాట్లాడి జనాన్ని రెచ్చగొట్టడం భారత్‌లో ఇటీవలికాలంలో బాగా సాగు తోంది. మరి ఈ గాలి అటు కూడా సోకకుండా వుంటుందా? పైగా ఖాన్‌సాబ్ మే 25 నాటి అజాదీ మార్చ్ ని ఎట్టిపరిస్థితుల్లో జరగ నీయమని షెహబాజ్ ప్రభుత్వం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడంతో ఇమ్రాన్‌కు ఏమీ తోచనిస్థితి ఏర్పడింది. ఇమ్రాన్ నిజానికి ఇదంతా కొనితెచ్చకున్న తంటాలేనని గ్రహించి వీలయినంత ప్రశాంతతో భవిష్యత్ ప్రణాళికలు వేయడంపై దృష్టిపెడితే మంచిది.


