మోదీ డౌటే.. హీరోలు, క్రికెటర్లు ఓకే.!!

పాకిస్థాన్ నూతన ప్రధానిగా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఈ కార్యక్రమానికి భారత్ లోని పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందనున్నట్టు వార్తలొచ్చాయి.. ముఖ్యంగా ప్రధాని మోదీకి ఆహ్వానం అందుతుంది, ఆయన కచ్చితంగా కార్యక్రమానికి హాజరవుతారు అనుకున్నారంతా.. కానీ ఈ విషయంపై ఇమ్రాన్ ఖాన్ స్పందన వేరేలా ఉంది.. 'రాజకీయ పరంగా ఎవరెవర్ని ఆహ్వానించాలనేది విదేశాంగ అధికారులు నిర్ణయిస్తారు' అని స్పష్టం చేసారు.. ఈ వ్యాఖ్యల వెనక బలమైన కారణం ఉన్నట్టు తెలుస్తోంది.

 

 

గతంలో మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరయ్యారు.. అలానే నవాజ్ షరీఫ్ ఇంట్లో శుభకార్యానికి మోదీ హాజరయ్యారు.. వీటివల్ల ఇరు దేశాల మధ్య స్నేహమైతే బలపడలేదు కానీ పాక్ లో నవాజ్ షరీఫ్ మీద వ్యతిరేకత మాత్రం పెరిగింది.. ఇది దృష్టిలో పెట్టుకునే ఇమ్రాన్ ఖాన్, మోదీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ గెలుపు కోసం సైన్యంతో పాటు టెర్రరిస్టు గ్రూపులు కూడా సహకరించాయి.. మరిక సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది?..  అందుకే రాజకీయ పరంగా ఆహ్వానాలు నా చేతిలో లేవని చేతులెత్తేశారు.. పాపం మరి ప్రధాని అయ్యాక ఆయన పరిస్థితి ఏంటి అంటారా?.. ఆ విషయం తెలీదు కానీ ప్రస్తుతానికైతే కొన్ని విషయాల్లో ఆయనికి స్వేచ్ఛ ఉంది.. అందుకే ఆయన ప్రమాణ స్వీకారానికి రాజకీయ ప్రమేయంలేని కొందరు స్నేహితులను పిలిచారట.. భారత్ నుండి బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్.. మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గావస్కర్‌లకు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది.. దీన్ని బట్టి చూస్తే ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి మోదీ డౌట్.. హీరోలు, క్రికెటర్లు ఓకే అనిపిస్తుంది.. చూద్దాం మరి ఎవరెవరు వెళ్తారో.