ఇమ్రాన్ పాక్‌కు రమ్మంటున్నాడు! ఐఎస్ఐ ఇండియాకు పంపుతోంది!

నిన్న మొన్నటి వరకూ కొట్టుకు చచ్చిన ఉత్తర, దక్షిణ కొరియాలు ఇప్పుడు దాదాపు ప్రశాంతంగా వున్నాయి! ఇది ఎవరమైనా ఊహించగలమా? కానీ, కొన్ని సార్లు అనూహ్యం అద్భుతంగా జరిగిపోతుంది! కొరియాల మధ్య కొరివి అలాగే చల్లారిందనుకోవాలి! అయితే, ఆ రెండు దేశాల్లాగే ఇండియా , పాక్ కూడా ఏ రోజుకైనా వివాదాలు మాని స్నేహం చేస్తాయా? స్నేహం సంగతి దేవుడెరుగు… కనీసం యుద్దాలు, రక్తపాతం లేకుండా వుండగలుగుతాయా? ఇది మాత్రం అనుమానమే! ఎందుకంటే, అలాంటి నక్క బుద్ధి పాక్ ప్రదర్శిస్తోంది.

 

 

ఆ దేశానికి మనపై వున్నది కేవలం కోపమే కాదు… నక్క తెలివితేటలు కూడా! భారత్ బూచిని చూపి పబ్బం గుడుపుకునే నేతలే ఆ దేశాన్ని పాలిస్తున్నారు. వార్ని ఆ దేశ ఉన్మాద సైన్యం నడిపిస్తోంది! అందుకే, ఈ నెల పదకొండున మరో కొత్త పీఎం వస్తోన్నా… పాక్ తోక మాత్రం వంకరగానే వుంటోంది. ఎంత మాత్రం నీతి, నిజాయితీలు పక్కదేశంలో కనిపించటం లేదు!

 

 

ఒక్కసారి చరిత్ర తిరగేస్తే… నెహ్రు నుంచీ మోదీ దాకా మన ప్రధానులు అందరూ పాక్ తో స్నేహం కోసమే ఆరాటపడ్డారు. ఎన్ని సార్లు ఆ దేశం వెన్నుపోటు పొడిచినా మళ్లీ మళ్లీ చర్చలకు ముందుకొచ్చారు. కానీ, అటు వైపు ఏం జరుగుతోంది? పాక్ నిస్సిగ్గుగా ఉగ్రవాదుల్ని మేపి మన మీదకు వదులుతోంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. ఒకవైపు ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నాడు. తన ఒకప్పటి తోటి ఆటగాళ్లు సిద్దూ, కపిల్ దేవ్, గవాస్కర్ల వంటి వార్ని రమ్మని పిలుస్తున్నాడు. పనిలో పనిగా బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ ని కూడా ఆహ్వానించాడు. ఇండియన్ సెలబ్రిటీల మీదున్న ఈ ప్రేమ ఇండియా సైన్యం మీద మాత్రం పాకీలకు వుండదు. వారు ఎంత ఎక్కువ మంది భారత సైన్యాన్ని చంపుదామా అనే ఆలోచిస్తుంటారు! కాశ్మీర్ మాదే అంటూ పాకిస్తాన్ సామాన్య జనాన్ని రెచ్చగొట్టడం… ఇటు ఉగ్ర దాడులతో భారత్ ను దెబ్బతీయటం…ఇదే అక్కడి పాలకుల పని! కాబోయే పీఎం ఇమ్రాన్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. 

 

 

అందుకు నిఘా వర్గాల తాజా రిపోర్టే తార్కాణం! జాతీయ నిఘా విభాగం అందించిన తాజా నివేదికలో భారత్ లో జొరబడటానికి ఆరు వందల మంది టెర్రరిస్టులు రెడీగా వున్నారని పేర్కొన్నారు! ఇండియా ఆ మధ్య సర్జికల్ స్ట్రైక్స్ చేశాక ఇంత పెద్ద మొత్తంలో ఉగ్రవాదులు సిద్ధం కావటం ఇదే మొదటిసారి! వార్ని ఎలాగోలా ఇండియాలోకి పంపేందుకు పాకిస్తాన్ సైన్యం నిర్వహించే బార్డర్ యాక్షన్ టీమ్ కూడా రెడీ అవుతోందట! సైన్యం మద్దతుతో ప్రధాని అవుతోన్న ఇమ్రాన్ పాలనలో ఇంతకంటే ఎక్కువ ఆశించటానికి ఏం లేదు. అదే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ ఇమ్రాన్ వ్యక్తిగతంగా ఉగ్రవాదుల్ని ఎగదోయకూడదని భావించినా మిలటరీ అతడి పప్పులేం ఉడకనీయదు.

 

ఇటువంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ చేసే ప్రమాణ స్వీకారానికి సిద్ధూ లాంటి మన రాజకీయ నాయకులు ఎగేసుకుని వెళ్లటం చాలా దారుణమైన విషయం. దీనిపై వారు మళ్లీ ఆలోచించుకోవాలి. కపిల్ దేవ్ ఇప్పటికే భారత ప్రభుత్వంతో మాట్లాడి తన అభిప్రాయం చెబుతానన్నాడు. సిద్ధూ మాత్రం తన మాజీ క్రికెట్ కొలీగ్ ప్రమాణ స్వీకారానికి వెళుతున్నట్టుగా సంతోషంగా ప్రకటించేశాడు. సిద్దూనే కాదు… గతంలో మణిశంకర్ అయ్యర్ లాంటి వారు కూడా ఉత్సాహంగా పాకిస్తాన్ కు వెళ్లి అక్కడ మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం మనకు తెలిసిందే! ఇంతగా దిగజారి రాజకీయం చేయటం దేశ భద్రతకే ముప్పు! ఇలాంటి వారిపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి శత్రు దేశంలో కాలు పెట్టకుండా చూడాలి…