ఈ రోజు చాలా ఇంపార్టెంట్ గురూ

 

ఈ రోజు దేశంలో కొన్నికీలక సంఘటనలు జరుగబోతున్నాయి.

ఈ రోజు జరుగబోయే కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణా నోట్ పై చర్చించి పార్టీ ఒక నిర్ణయం తీసుకోబోతోంది. ప్రస్తుతం ఉవ్వెత్తున సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాల నేపధ్యంలో అంటోనీ కమిటీ తన నివేదికను సమర్పించే వరకు ఆగడం మేలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. అయితే తెలంగాణా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గే ఆలోచన కూడా లేదని సమాచారం.

 

ఇక ఈ రోజే నరేంద్ర మోడీని బీజీపీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించేందుకు ఆ పార్టీ అగ్రనేతల పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతోంది. మోడీ అభ్యర్ధిత్వాన్ని అద్వానీ, సుష్మాస్వరాజ్ తదితరులు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నపటికీ, బీజేపీ మోడీ పేరును ఈ రోజే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే భారత రాజకీయాలు, పార్టీలలో అనేక పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా బీజేపీ నిలువునా చీలినా ఆశ్చర్యం లేదు. అదేవిధంగా రాహుల్ గాంధీని తమ ప్రధాని అభ్యర్ధిగా ముందుకు తెస్తున్న కాంగ్రెస్ పార్టీపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకు తగిన విధంగా ఆ పార్టీ మళ్ళీ సరికొత్తగా వ్యూహకల్పన చేసుకోవలసి ఉంటుంది. యావత్ భారత దేశ రాజకీయాలను, వివిధ వర్గాలను కూడా బీజేపీ నిర్ణయం ప్రభావితం చేయబోతోంది.

 

ఇక, నిర్భయ కేసులో దోషులుగా గుర్తింపబడిన నలుగురు నేరస్తులకు ఈ రోజే ఫాస్ట్ ట్రాక్ కోర్టు శిక్షలు ఖరారు చేయబోతోంది. వారికి ఉరిశిక్ష పడే అవకాశం ఉందని హోంమంత్రి షిండే ముందుగానే చెప్పడం వివాదాస్పదమయ్యింది.

 

ఇక జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణరావు బెయిలు పిటిషను ఈ రోజే విచారణకు రాబోతోంది. గత 15నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన ఆరోగ్యకారణాలతో బెయిలు కోరుతున్నారు. ఇటీవల తరచూ ఆయన అనారోగ్యం పాలవుతున్నారు.