TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమ‌రావ‌తి ప్ర‌త్యేక‌త‌లు ఇవే.. అందుకే ఏకైక రాజ‌ధానిగా డిమాండ్‌...

Published on: Wed Apr 6, 2022 2:40PM

ఐదు కోట్ల ప్రజల ఆశాజ్యోతిగా, ఆర్థికాభివృద్ధికి, తెలుగువారి సాంస్కృతిక రాజధానిగా, 2వేల‌ ఏండ్ల పైచిలుకు చరిత్ర క‌లిగిన నగరంగా ఉన్న అమ‌రావ‌తిని.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా ఎంపిక చేయ‌డం జ‌రిగింది. అమరావతిని ప్రజారాజ‌ధానిగా ఎంచుకోవడానికి గల ప్రధాన కారణాలు అనేకం. భౌగోళికంగా 1,200 కిలోమీటర్ల పొడవున్న ఆంధ్రప్రదేశ్ కు నడిమధ్యన.. బొడ్రాయి లాంటి చోట అమరావతి ఉండటం విశేషం. అటువారికీ, ఇటువారికీ సమాన దూరంలో ఉండటం ప్ర‌త్యేకం. 

భవిష్యత్తులో ఆంధ్రుల ప్రజారాజ‌ధానిగా విలసిల్లబోయే నగరానికి తాగునీటి సమస్య రాకుండా ఎంత పెద్ద జన బాహుళ్యానికైనా నీటి సమస్య లేకుండా చేయగలిగిన కృష్ణ ఏటి ఒడ్డున ఉన్న నగరం అమరావతి. ఆ నగరానికి ఉత్తరవాహినిగా, ఆపైన తూర్పుగా కృష్ణవేణి పరవళ్ళుతొక్కడం నగరానికి నీరు ఎత్తరనుండీ పల్లానికి ప్రవహిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలవటం మరో కారణంగా చెప్పవచ్చు.

ఇక, అమరావతి నగరానికి నలువైపులా పచ్చటి పొలాల్లో ఏడాది పొడవునా కాయగూరలూ, ధాన్యం సంమృద్ధిగా పండే పంటలు పండడం మరో ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఎంతటి జనాభాకైనా ఆహారం సమకూర్చగల సౌకర్యం ఉండటం అమరావతికి ఉన్న‌ ప్రతేకత. 

మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి యువతకు కావలసిన మరో సౌకర్యం రవాణా ఆధునిక జీవనశైలికి అనుగుణంగా ఉండవలసిన రోడ్డు, రైలు, విమాన, నౌకాయాన రవాణా సౌకర్యాలు అమరిన అమరావతి ప్రజాధాని. నాలుగు జాతీయ రహదారులు 65, 30, 16, 544డి, అమరావతిని ఒరుసుకొంటూ నడుస్తున్నాయి. 

దేశంలో కొన్నింటికే ఇలాంటి అవకాశం ఉంది. వీటితోపాటు దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్లలో నాల్గవది అయిన విజయవాడ రైల్వే కూడలి, గుంటూరు రైల్వే స్టేషన్లు 15 కి.మీ. దూరంలో ఉన్నాయి. గన్నవరం విమానాశ్రయం 35 కి.మీ దూరంలో ఉంది. ఇంకా రెండు గంటల రోడ్డు ప్రయాణంతో దగ్గరలో ఉన్న మచిలీపట్నం ఓడ రేవు అందుబాటులో ఉండడం దేశంలో మరి  ఏ నగరానికీ లేనటువంటి సౌకర్యం అమరావతికి ఉంది.

రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల జ్ఞాన, సమాచార సంపద భవిష్యత్తులో అంతర్జాతీయ నగరంగా పెరగడానికి తప్పక దోహద పడతాయి. రాష్ట్రంలో ఇతర నగరాలకు జ్ఞాన సంపద కానీ, సమాచార సంపద కానీ లేదని కాదు మిగిలిన సౌకర్యాలతో పాటు, అమరావతికి ఈ సౌకర్యం కుడా ఉండడం ఒక విశిష్టత. 

విజయవాడ, గుంటూరు, తెనాలి పట్టణాలతో కూడిన అమరావతి భవిష్యత్తులో మహానగరంగా అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశం ఉంది. ఇది అన్ని పార్టీలు, ప్రజలు ఒప్పుకున్న నగ్న సత్యం. 

మరో ముఖ్య విషయమేమిటంటే, అమరావతి (అ), ఆంధ్రప్రదేశ్ (ఆ) రెండూ అక్షర క్రమంలో రాజధాని నగరాలలోనూ రాష్ట్రాలలోనూ ముందువరసలో ఉండటం యాదృచ్చికమైనా, కలసివచ్చిన విషయమే.
చరిత్రకు అందనంత ప్రాచీన కాలంలోనే ఆంధ్ర శాతవాహనుల రాజధానీ నగరంగా దక్షిణ-తూర్పు ఆసియా దేశాలలో అమరావతి ఎంతో పేరుగాంచింది.

కలకత్తా, ముంబయి, చెన్నై, విశాఖపట్టణం మొదలైనవి సముద్రపు ఒడ్డున ఉండటంతో ఏటా వచ్చే తుఫానుల తాకిడి ఎక్కువగా ఉండడమనేది జగమెరిగిన సత్యం. అయితే, అమరావతికి దగ్గరలో ఓడ రేవు ఉన్నా, తుఫానులూ, సునామీలు అందనంత మేరకు దూరంగా ఉండటం విశేషం.

ఆంధ్రప్రదేశ్ లో, ఈ నవరత్నాలలో కనీసం ఏ నాలుగు సౌకర్యాలైనా ఏ ఒక్క నగరంలోనూ లేకపోవటంనలననే అమరావతి ప్రజాధానిగా ఉండగలిగిన సత్తా ఉన్న ఒకే ఒక నగరంగా ఎంపిక అయిందనేది జగమెరిగిన సత్యం. 

ఇలాంటి అద్భుత నగరాన్ని సంకుచితమైన మానసిక దృష్టితో అవమానకరంగా విజ్ఞత కోల్పోయి మాట్లాడటం, దురహంకారానికి నిదర్శనమని విశ్లేషకులు, విజ్ఞుల భావన.  ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ప్రజలకూ, ప్రభుత్వానికీ మధ్య నమ్మకస్తులైన ప్రతినిధులుగా ఉండాలి గానీ ఇంకోరకంగా కాదు. 

కాబట్టి, ఇన్ని విశేషాలున్న అమరావతి ఇప్పటికైనా ప్రజా రాజధానిగా  అంగీకరిస్తారని, అంగీకరించాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికి సుమారు మూడు సంవత్సరాల నుండి ఆంధ్ర రాష్ట్రం రాజధాని నగరం లేని రాష్ట్రంగా దేశంలో  పేరుకెక్కింది. కనీసం ఇప్పటికైనా నిజాన్ని గ్రహించి, ప్రెస్టేజ్‌ల‌కు పోకుండా అమరావతిని రాజధానిగా అంగీకరించాలి.