TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దీపావళి సామాన్ల రూపంలో పేలుడు పదార్ధాల అక్రమ రవాణా

Published on: Wed Mar 21, 2012 11:49AM

తమిళనాడు నుంచి మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ప్రాణాంతక పేలుడు పదార్ధాలు అక్రమంగా రవాణా అవుతున్నాయి. క్వారీల్లో ఉపయోగించే డిటోనేటర్లు, జిలెటన్ స్టిక్స్ పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి తరలిస్తున్నారు. వీటితోపాటు మందుగుండు సామాన్ల రూపంలో ప్రమాదకర పేలుడు పదార్ధాలను కూడా రాష్ట్రంలోకి అక్రమంగా చేరవేస్తున్నారు, రాయలసీమ, తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో క్వారీల తవ్వకాలకు ఉపయోగించే డిటోనేటర్లను చేపల వేటకు ఉపయోగిస్తున్నారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పెద్ద పెద్ద చెరువులు, నదీజలాల్లో చేపల గుంపు ఉన్నచోట నీళ్ళలో ఈ డిటోనేటర్లను పేల్చుతున్నారు.

 

ఈ పేలుళ్ళధాటికి చేపలు చనిపోయి నీటిపై తేలాడుతున్నాయి. దీంతో వాటిని సునాయాసంగా పట్టుకుని మార్కెట్లో విక్రయిస్తున్నారు. నిజానికి జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల వాడకానికి, వ్యాపారానికి చెన్నైలోని ఎక్స్ ప్లోజిన్ విభాగం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎటువంటి అనుమతులు లేకుండానే తెలంగాణా, రాయలసీమలకు చెందిన కొంత మంది వ్యాపారులు వీటిని అక్రమంగా తరలిస్తున్నారు. ఇలా తరలించిన పేలుడు పదార్ధాల్లో కొన్ని మావోయిస్టు గ్రూపులకు కూడా చేరుతున్నాయి. ఈ పేలుడు పదార్ధాలను రవాణా చేసేందుకు ఉపయోగించే వాహనాలు ప్రత్యేకంగా ఉండడంతో పాటు వాటికి సీల్ చేసి పంపిస్తుంటారు. దీంతో పేలుడు పదార్ధాలు ఆ వాహనాల్లో ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునే అవకాశం కూడా చెక్ పోస్టుల వద్ద అధికారులకు ఉండదు. తమను తనిఖీ చేసేవారు లేరన్న ధీమాతో వ్యాపారులు నిర్భయంగా పేలుడు పదార్ధాలు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.