ఏం తెలివిరా నాయనా.. పుచ్చకాయల్లో మద్యం సీసాలు తరలింపు

కరోనా కాలంలోనూ మద్యం అక్రమ రవాణాకు బ్రేకులు పడట్లేదు. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న రూ. 5 లక్షలు విలువైన మద్యాన్ని ఏపీ పోలీసులు సీజ్ చేశారు. లాక్ డౌన్ కారణంగా మూతపడిన మద్యం షాపులు.. దాదాపు 40 రోజుల తరువాత తెరుచుకున్నాయి. అయితే, ఏపీలో మద్యం ధరలు విపరీతంగా పెరగడం, దానికితోడు ఎంత ఖర్చు పెట్టినా సరైన బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో.. మందు బాబులు తమకిష్టమైన బ్రాండ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు పొరుగు రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం తెప్పించి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారు. తాజాగా, గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్ పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 2630 మద్యం సీసాలు పట్టుబడ్డాయి. పుచ్చకాయల మాటున మూడు వాహనాల్లో  రూ. 5 లక్షలు విలువైన మద్యాన్ని తరలిస్తున్నారు. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన గుంటూరు అడిషనల్ ఎస్పీ.. అక్రమంగా మద్యం తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.