రాహుల్ గాంధి జట్టులో ఐఐటి కుర్రాళ్లు
Published on: Tue Mar 8, 2016 10:05AM
.jpg)
ఐఐటి విద్యార్థులు అంటే చురుకైనవారన్నది దేశంలో ఓ నమ్మకం. రాహుల్ గాంధిలో ఆ నమ్మకం కాస్త మరీ ఎక్కువగా ఉన్నట్లుంది. అందుకని ఏకంగా ఓ 15మంది ఐఐటి కుర్రవాళ్లని ఎంపిక చేసి త్వరలో జరగబోయే అసోం ఎన్నికలలో వారిని ప్రయోగిస్తున్నారట. క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు వీరి సేవలను ఉపయోగించుకుంటున్నారట రాహుల్. గత ఏడాది రాహుల్ గాంధి నేరుగా ఎంపిక చేసిన సదరు ఐఐటీలందరూ, అసోంలోని రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తూ గడుపుతున్నట్లు సమాచారం.
వీళ్లందరూ కూడా అసోంకు పార్టీ జనరల్ సెక్రెటరీ అయిన సి.పి.జోషితో నేరుగా తమ పరిశీలనలను గురించి నివేదిస్తారట. రాహుల్ గాంధి ఇలా ఐఐటిల చేతిలో పార్టీ బాధ్యతలు చేపట్టడం వెనుక ఓ కథ కూడా ఉందంటున్నారు. 2014లొ రాహుల్ ఓ విశ్వవిద్యాలయంలో పర్యటిస్తున్నప్పుడు, అక్కడ పర్‌మర్ అనే ఓ ఐఐటి పట్టాదారుడు రాహుల్‌ని తన ప్రశ్నలతో తెగ తికమకపెట్టేశాడట. ఇతని ప్రశ్నలకు జవాబు చెప్పేకంటే, అసలు పార్టీని బలోపేతం చేసే బాధ్యతను పర్‌మర్‌కే ఎందుకు ఇవ్వకూడదు అన్న ఆలోచన వచ్చిందట రాహుల్‌కు. అనుకున్నదే తడవుగా పర్‌మర్‌ను పార్టీ కోసం నియమించుకున్నాడు. ఇదీ ఈ ఐఐటి కథలో మొదటిభాగం! మరి తరువాయి భాగం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే!


