నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటనపై వీసీ స్పందన

కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్ధినుల హాస్టల్లో విద్యార్ధి రోజంతా ఉన్న వ్యవహారంపై వైస్ ఛాన్సలర్ హేమచంద్రారెడ్డి స్పందించారు. పిల్లల భవిష్యత్తు పాడవుతుందనే ఉద్దేశంతోనే తాము ఈ వ్యవహారంపై మౌనంగా ఉన్నామన్నారు. అదే సమయంలో హాస్టల్లో భద్రతా వైఫల్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని వీసీ తెలిపారు. విద్యార్ధినుల హాస్టల్ కిటికీ బయటి నుంచి కంటే లోపల నుంచి తెరవడం సులువని ఆయన పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే లోపల ఉన్న విద్యార్ధినుల్లో ఒకరు కిటికీ తెరిచి తనకు పరిచయమైన విద్యార్ధిని లోపలికి ఆహ్వానించారని వీసీ వెల్లడించారు. అదే గదిలో ఉన్న మిగిలిన విద్యార్ధినుల్లో ఒకరు మంచం కింద ఎవరో ఉన్నారని వార్డెన్ కు ఫిర్యాదు చేయడంతో గది తాళం బద్దలు కొట్టి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

వాస్తవానికి ట్రిపుల్ ఐటీలో వార్షిక ఫెస్ట్ జరుగుతోంది. ఈ సమయంలో మిగిలిన విద్యార్ధులంతా ఫెస్ట్ లో బిజీగా ఉండటంతో ఓ విద్యార్ధిని ఉద్దేశపూర్వకంగానే కిటీకీ తెరిచి అదే ట్రిపుల్ ఐటీలో చదువుతున్న తనకు పరిచయమైన విద్యార్దిని లోపలికి తీసుకొచ్చింది. అయితే మిగిలిన విద్యార్ధినుల్లో ఒకరికి అనుమానం రావండంతో హాస్టల్ గది తలుపులకు తాళం వేసి వెళ్లిపోయింది. అయితే మరో విద్యార్దిని ఫిర్యాదు మేరకు వార్డెన్ సెక్యరిటీతో కలిసి తాళం బద్దలు కొట్టి తలుపు తెరవడంతో బండారం బయటపడింది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ మైనర్లు కావడంతో వీరికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లితండ్రుల దగ్గరికి పంపినట్లు వీసీ హేమచంద్రారెడ్డి వెల్లడించారు. అయితే ఈ ఘటనపై క్రమశిక్షణా కమిటీకి సిఫార్సు చేశామని, నివేదిక రాగానే తదుపరి చర్యలుంటాయన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆయన పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో మొత్తం 4500 మంది అమ్మాయిలు, 3500 మంది అబ్బాయిలు చదువుతున్నారు.