ఏపీకి కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఐటీ గ్రిడ్ కేసు అధికారి

 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో అధికారం టీడీపీకి దూరమై, వైసీపీకి దగ్గరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో చకచక అధికారుల బదిలీలు కూడా జరిగిపోతున్నాయి. ఏపీ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర రానున్నారు. ప్రస్తుతం ఆయన తెలంగాణలో ఐజీగా పనిచేస్తున్నారు. 1990 బ్యాచ్‌కు చెందిన రవీంద్ర.. ఇటీవల తెలంగాణలో చోటు చేసుకున్న ఐటీ గ్రిడ్ చోరీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు ఇంఛార్జ్‌ గా కూడా స్టీఫెన్ రవీంద్ర వ్యవహరించారు.

రెండు నెలల కిందటే ఏపీ కొత్త ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా కుమార్‌ విశ్వజిత్‌ నియమితులయ్యారు. విశ్వజిత్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన విశ్వజిత్‌ను నిమయించారు. గతంలో వైసీపీ ఫిర్యాదు మేరకు ఇంటిలిజెన్స్‌ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును కేంద్రం ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలిసిందే. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ చేసిన ఫిర్యాదుతో ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం రెండు నెలల కింద ఈ నిర్ణయం తీసుకుంది.