Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విడదల రజిని వైజాగ్ కి వెళ్లి ఉంటే..?
posted on: Apr 19, 2025 10:23PM

ఒక ఐడియా మాత్రమే కాదు.. ఒక పొరపాటు కూడా జీవితాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు ఓటమిపాలైన వైసీపీ నాయకుల్లో ఈ పరిస్థితి చాలా మందిలో కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డితో పాటు ఫ్యాన్ పార్టీని నమ్ముకున్న చాలామంది నాయకులు ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నారు. అలాంటి వారిలో పేరు చెప్తేనే ప్రజలందరికీ తెలిసే మాజీ మంత్రి విడదల రజిని ఒకరు.
ఏపీలో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన నేతలలో విడదల రజినీ కూడా ఒకరు. తెలుగుదేశంతో మొదలైన విడదల రజని రాజకీయ ప్రస్థానం వైసీపీలో ఉచ్ఛ స్థితికి చేరుకుంది. వాస్తవానికి ఆమెకు పార్టీలో అత్యధిక శాతం మంది వ్యతిరేకులే. అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మినహాయిస్తే ఇతర కోటరీ ఎప్పుడు విడదల రజనికి సహకరించ లేదు. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా అప్పటి ఎంపీ కృష్ణదేవరాయలతో విభేదాలు కొనసాగాయి అలాగే మర్రి రాజశేఖర్ తదితరులు కూడా ఆమెకు సొంత పార్టీలోనే సమస్యగా ఉండేవారు. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఫ్యాన్ పార్టీ హవా లో గెలిచిన ఆమె ఆ తర్వాత అనుకూలమైన పరిస్థితుల్లో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం పొందారు. మొదటి నుంచీ ఆమె వ్యవహార శైలి పార్టీలోని చాలా మందికి మింగుడు పడలేదు. ప్రధానంగా ఫ్యాన్ పార్టీలోని కొన్ని వర్గాలు ఆమెను చాలా సందర్భాల్లో ఒంటరి చేశారు. ఫ్యాన్ పార్టీ అధికారిక మీడియాలో కూడా అప్పటి మంత్రి రోజాకు ఇచ్చిన ప్రాధాన్యత విడదల రజినీకి ఇవ్వలేదన్న అసంతృప్తి ఆమెలో చాలా వరకు ఉంది.
అలాగే వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ బదిలీలు, నియామకాల విషయాల్లో ఉన్నతాధికారులు ఆమెకు సహకరించ లేదు. ప్రతి అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులు దాట వేసిన సందర్భాలు ఎన్నో. అప్పటి వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు తో పాటు డి ఏం ఈ స్థాయి అధికారులు కూడా ఆమె సిఫార్సులను చాలా సందర్భాల్లో అమలు చేయలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న దశలో ఆమె జరుగుతున్న పరిణామాలను అధినాయకుడు జగన్ దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయత్నించారు. అప్పటికే సమయం దాటిపోవడంతో టికెట్ల కేటాయింపులో జగన్మోహన్ రెడ్డి మూడో కన్ను సర్వేల్లో ఆమె చిలకలూరిపేటలో గెలవడానికి అవకాశాలు తక్కువని తేలింది. దీంతో ఆమెను విశాఖ ఎంపీగా పోటీ చేయాలన్న ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారట. అప్పటికి విశాఖ సిట్టింగ్ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ మరోసారి ఎంపీగా పోటీ చేయనని విశాఖ తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కసరత్తు ప్రారంభించారు విశాఖలో ఎంపీ స్థాయి అభ్యర్థి లేకపోవడం, అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆదరించే పరిస్థితి విశాఖలో ఉండడంతో.. జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎంపీ గా పోటీ చేసే అవకాశాన్ని విడదల రజనీకి ఇచ్చారు.
కానీ తన భర్త_ మామ సంబంధించిన వ్యవహారాలన్నీ గుంటూరు జిల్లా చుట్టూ ఉన్నాయనీ, అక్కడి నుంచే పోటీ చేస్తానని రజనీ చెప్పి, తనకున్న బలంతో గుంటూరు వెస్ట్ సమన్వయకర్తగా ప్రకటన చేయించుకున్నారు. కానీ ఫ్యాన్ పార్టీ కూటమి గాలికి కొట్టుకు పోవడంతో విడదల రజిని కూడా గల్లంతయ్యారు. అదే సమయంలో ఆమె సొంత పార్టీ నాయకులతో పాటు, కూటమి నాయకులు ఆమెపై దృష్టి పెట్టారు దీంతో ప్రస్తుతం ఏసీబీ కేసు కూడా ఆమె పై నమోదయింది నిజంగా ఆమె ఎన్నికలకు ఏడాది ముందే విశాఖ ఎంపీగా మకాం మార్చినట్లయితే ఇన్ని కష్టాలు ఉండేవి కాదని ఆమె అనుచరులు అంటున్నారు. విశాఖ నగరం చరిత్ర చూస్తే స్థానికేతరులే ఎమ్మెల్యే లు ఎంపీలు అయినా సందర్భాలు ఉన్నాయి. టి సుబ్బరామి రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, పురందేశ్వరి ఇలా ఎందరో ఎంపీలు స్థానికేతరులే.
విశాఖ ఇన్చార్జ్ మంత్రిగా విడదల రజిని రెండేళ్లలో విశాఖ వాసులకు ఒకింత పరిచయం కూడా అయ్యారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో వైద్య ఆరోగ్య శాఖకు కొంత ప్రాధాన్యత ఉండడం, అందుకు తగ్గట్టు విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి విక్టోరియా ఆసుపత్రి అంటువ్యాధుల ఆసుపత్రి ఇలా ఎన్నో వైద్య పరమైన అభివృద్ధి పనులు విడదల రజిని చేతుల మీదుగా ప్రారంభం అయ్యాయి. చివరికి పాడేరు అరకు లాంటి ప్రాంతాల్లో కూడా వైద్య ఆరోగ్య శాఖ అభివృద్ధి పనులు ఆమె చేతుల మీదుగా, ఆమె హయాంలోనే జరిగాయి. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి పరీక్షలకు కోట్లాది రూపాయలు ఆమె హయాంలోని మన్యానికి కేటాయించారు. పాడేరు మెడికల్ కాలేజ్ ను కూడా ఆమె ప్రారంభించాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఆ రకంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆమె ఏదో మేరకు ప్రజలకు దగ్గరయ్యారు. అందుకే గత ఎన్నికలలో జగన్ సూచించినట్లు ఆమె వైసీపీ అభ్యర్థిగా విశాఖ ఎంపీగా పోటీ చేసినట్లయితే గెలవడం మాట ఎలా ఉన్నా గుంటూరు లాంటి స్థానిక విభేదాల నుంచి ఆమె గట్టెక్కే పరిస్థితి ఉండేదని ఆమె అనుచరులు అనుకుంటున్నారు. అందుకే అంటారు ఒక ఐడియా మాత్రమే కాదు ఓ నిర్ణయం కూడా జీవితాన్ని మార్చేస్తుందని.


.webp)



