అంతర్జాతీయ కోర్టులో భారత్… గెలిచి కూడా ఓడనుందా?

 

కుల్భూషణ్ జాదవ్ ఉరిశిక్ష కేసు , అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ పోరు… ఇవన్నీ ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంత ఇంట్రస్టింగ్ కాకపోవచ్చు సామాన్య జనానికి. కాని, భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల్ని ఆసక్తిగా అధ్యయనం చేసేవారికి ఇదో పెద్ద సంకేతం. ఇంత కాలం ఇండియా అంటే విదేశాంగ విధానంలో బలహీనంగా ముందుకు పోయే దేశం. కాని, ఇప్పుడు మెల్లమెల్లగా ఆ పరిస్థితి మారిపోతోంది. మరీ ముఖ్యంగా, పాకిస్తాన్ విషయంలో మోదీ సర్కార్ తాను చేయగలిగింది ధీటుగా చేస్తోంది. అయినా కూడా పదే పదే అరాచక దేశమైన పాకిస్తాన్ మన సైనికుల ప్రాణాలు బలితీసుకుంటూనే వుంది. తలలు నరుకుతోంది. సరిహధ్దు గ్రామాల్లోని అమాయక ప్రజల్ని పొట్టన పెట్టకుంటోంది. ఇవన్నీ పాకిస్తాన్ కు సింహస్వప్నం అవుతాడనుకున్న మోదీకి కళంకం కలిగించేవే. అయినా, అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ క్రమ క్రమంగా పాక్ పై పై చేయి సాధిస్తోందన్నది మాత్రం నిజం…

 

మన సరిహద్దుల్లోకి చొరబడి మన సైనికుల తలలు నరికితే… మన కాశ్మీరీ సైనికుడ్ని మన భూభాగంలోనే ఉగ్రవాదులు కాల్చి చంపితే … ఎవరికైనా రక్తం మరిగిపోతుంది. కాని, అమాంతం యుద్ధం ప్రకటించి దాడి చేయటానికి పాకిస్తాన్ ఏం మరీ బలహీనమైన దేశం కాదు. అణు సామర్థ్యం కలిగిన ఉగ్రవాద దేశం. భారత్ ఎంత తొందరపాటుతో యుద్ధం మొదలు పెడితే అంత త్వరంగా బాంబు వేయాలని చూస్తోంది పాక్. అది మనకు ఎంత మాత్రం క్షేమం కాదు. అందుకే, గతంలో మన్మోహన్ అయినా, ఇప్పుడు మోదీ అయినా ప్రత్యక్ష యుద్ధానికి ముందడుగు వేయటం లేదు. అయితే, కుల్భూషణ్ జాదవ్ ఉరిశిక్ష కేసుని అంతర్జాతీయ న్యాయస్థానం ముందుకు తీసుకు పోయి మోదీ, సుష్మా స్వరాజ్, హరీష్ సాల్వే ఎంతో కీలకమైన ద్వైపాక్షిక విజయం సాధించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇండియా తనంతట తానుగా పాక్ ను అంతర్జాతీయ వేదిక మీదకి ఈడ్చింది. ఇది తొలి విజయం. అంతటితో ఆగక బలమైన వాదన వినిపించి పాక్ ను కట్టడి చేయగలిగింది. ఇంటర్నేషల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ముందు, జాదవ్ వ్యవహారం తమ పరిధిలోకి రాదన్న పాక్ వాదనను కొట్టి వేయించగలిగింది. ఇప్పుడు కేసు అంతర్జాతీయ కోర్టు పరిధిలోకి చేరింది. అలాగే అంతిమ తీర్పు వచ్చే దాకా జాదవ్ ఉరి కూడా ఆగిపోయింది. ఇవన్నీ పాక్ పై భారత్ సాధించిన విజయాలనే చెప్పుకోవాలి.

 

ఇంటర్నేషనల్ కోర్టు ఆదేశాలు, తీర్పులు సార్వభౌమాధికారం గల దేశాలు పట్టించుకోవాల్సిన పని లేదు. కాబట్టి పాక్ ఏ క్షణానైనా జాదవ్ ను గూఢచారిగా నిర్ధారిస్తూ ఉరి తీయవచ్చు. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యమే. అయినా అంతర్జాతీయ కోర్టు ద్వారా ఒత్తిడి తేవటం మోదీ సర్కార్ సక్సెస్సే. ఎందుకంటే,రేపు పాక్ జాదవ్ ను తన ఇష్టానుసారం ఉరి తీస్తే అది అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడుతుంది. అంతర్జాతీయ కోర్టు ధిక్కారణ పర్యవసానాలు ఐక్యరాజ్య సమితిలోనూ వుంటాయి. అక్కడ కూడా పాక్ దోషిగా నిలబడాల్సి వస్తుంది. అమెరికా లాంటి దేశాలు భారత్ తరుఫున పాక్ పై మరింత ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం వుంటుంది.

 

ఇక రాజకీయంగానూ నరేంద్ర మోదీ కుల్భూషణ్ జాదవ్ విషయంలో ధీటుగానే స్సందించారు. ఈ మధ్య పదే పదే ఆయన మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ విషయంలో తాము ఆశించింది మోదీ చేయలేకపోతున్నారని ప్రతిపక్షలే కాదు… మోదీ భక్తులు కూడా అసంతృప్తిగా వున్నారు. పాక్ హింసాత్మకంగా చెలరేగిపోయిన ప్రతీ సారి నమో బలంగా జవాబు ఇవ్వటం లేదనే భావన పెరుగుతోంది. కాని, ప్రపంచపు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా పాక్ కు దాని భాషలోనే సమాధానం ఇవ్వటం కుదరదు. అందుకే, అంతర్జాతీయ కోర్టును ఎంచుకోవటం ద్వారా మోదీ పాక్ పైన పై చేయి సాధించారు. అదే సమయంలో దేశం లోపల పాక్ ను కట్టడి చేసే విషయంలో తాను సీరియస్ గానే వున్నట్టు విమర్శకులకి గట్టి సంకేతాలిచ్చారు. అయితే, అంతిమంగా పాక్ కు బుద్ది చెప్పటం, కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొనటమే మోదీ పరమ విజయం అవుతుంది. ఆ దిశగా కుల్భూషణ్ జాదవ్ వివాదంలో పై చేయి సాధించటం ఒక ముందడుగు ఖచ్చితంగా అవుతుంది…