TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డాక్యుమెంట్ల ఫోర్జరీకి పాల్పడిన ఐబొమ్మ రవి!

Published on: Mon Dec 29, 2025 2:22PM

సినీ పరిశ్రమను కుదిపేసిన ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్‌ కేసులో  రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తున్నది. తాజాగా ఐబొమ్మ రవి కేవలం పైరసీకే పరిమితం కాలేదనీ.  ఇతరుల గుర్తింపు పత్రాలను సైతం దొంగిలించి భారీ అక్రమాలకు పాల్పడిన వైనం వెలుగు చూసింది. గతంలో పోలీసుల ముందు రవి ఇచ్చిన వాంగ్మూలంలో... ‘ప్రహ్లాద్ వెల్లేల’ అనే వ్యక్తి తన రూమ్‌మేట్ అనీ, ఐబొమ్మ నిర్వహణలో అతడికి కూడా పాత్ర ఉందని చెప్పాడు. అయితే విచారణలో   రవి చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని తేలింది. వాస్తవానికి ప్రహ్లాద్‌కు ఏమాత్రం తెలియకుండానే అతడి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కీలక డాక్యుమెంట్లను రవి దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు. అలా దొంగిలించిన పత్రాలతో ప్రహ్లాద్ పేరుపై నకిలీ పత్రాలు సృష్టించి, బ్యాంక్ ఖాతాలు తెరవడం, ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించడంతో పాటు అతని ఐడెంటిటీని వెబ్‌సైట్ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నట్లు పోలీసులు అనుమా నిస్తున్నారు.

ఈ కోణంలో నిజాలను వెలికితీసేందుకు బెంగళూరులో నివసిస్తున్న ప్రహ్లాద్‌ను ప్రత్యేకంగా విచారణకు పిలిపించారు. రవి ఎదుటే ప్రహ్లాద్‌ను కూర్చోబెట్టి పోలీసులు విచారణ చేపట్టగా, అతడు ఇచ్చిన స్టేట్‌మెంట్ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. తనకు రవి ఎవరో తెలియదని, తామిద్దరం ఎప్పుడూ రూమ్‌మేట్స్‌ కాదనీ  ప్రహ్లాద్ స్పష్టంగా చెప్పాడు. తన పేరుతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వాడుతున్నారన్న విషయం తెలిసి తీవ్రంగా కలత చెందానని పోలీసులకు వివరించాడు. తన డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు కూడా చేశాడు.

ఈ పరిణామాలతో రవి చేసిన నేరాల జాబితా మరింత పెద్దదిగా మారుతోంది. పైరసీతో పాటు ఐడెంటిటీ థెఫ్ట్‌, ఫోర్జరీ, మోసాలు వంటి తీవ్రమైన ఆరోపణలు అతడిపై నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే తరహాలో ఇంకెంతమంది అమాయకుల డాక్యుమెంట్లు దుర్వినియోగం అయ్యాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.