100 కోట్ల కుంభకోణం..ఐఏఎస్ అరెస్టుకు రంగం సిద్ధ౦!

 

IAS officer Vishnu HUDA case,  IAS officer Vishnu arrest,  IAS officer Vishnu arrested

 

 

విశాఖ నగరాభివృద్ధి సంస్థ భూ మాయ కేసులో ఐఏఎస్ అధికారి వీఎన్ విష్ణు అరెస్టుకు రంగం సిద్ధమైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన సమర్పించిన అభ్యర్థనను హైకోర్ట్ కొట్టివేసింది. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు సీఐడీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న వీఎన్ విష్ణు గతంలో వుడా వీసీగా వ్యవహరించారు. అప్పట్లో విశాఖలోని ఎంవీపీ కాలనీలో సామాజిక అవసరాలకు ఉద్దేశించిన స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా కొందరికి కేటాయించారు.



ఆ స్థలాన్ని సామాజిక అవసరాలకే ఉపయోగించాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పినా...  ఆ ఆదేశాలను భెఖాతరు చేస్తూ కొందరు వ్యక్తులు సమర్పించిన ఫోర్జరీ పత్రాలను ఆధారంగా చేసుకుని గజం రూ.50 వేలు విలువైన స్థలాన్ని కేవలం రూ.3,500 చొప్పున విష్ణు వారికి కేటాయించారు. ఆ తర్వాత ఆయన మహా విశాఖ నగర పాలక సంస్థకు కమిషనర్‌గా బదిలీపై వెళ్లారు. ఆ హోదాలో అదే స్థలంలో బహుళ అంతస్థుల భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చారు.


ఈ విషయాన్ని మీడియా వెలుగులోకి తెచ్చింది. దీంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇంతలో అక్రమంగా ఈ స్థలం పొందినవారు తమకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించారు. విచారణ తరువాత  సీబీఐ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం మళ్ళీ విచారణ చేయమని సీఐడీకి కేసు అప్పగించారు. సీఐడీ కూడా అక్రమాలు వాస్తవమేనని నిర్థారించి కేసు నమోదు చేసింది.ఐఏఎస్ అధికారి వీఎన్ విష్ణును ఏ1 నిందితునిగా పేర్కొంది. మరో 18 మందిని నిందితులుగా చేర్చి వారిలో ఆరుగురిని 15 రోజుల క్రితం అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. 


ఈ కేసులో అరెస్టులు జరుగుతున్నాయని తెలిసిన విష్ణు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. విష్ణు నిర్ణయం వల్ల వుడాకు రూ.100 కోట్ల నష్టం జరిగిందని...ఇందులో కుట్ర ఉందని, ముందస్తు బెయిల్ పొందడానికి అనర్హులు అంటూ దరఖాస్తును కొట్టేశారు.