సీఎం జగన్ టీంలోకి లేడి ఫైర్ బ్రాండ్!!

 

ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఇతర రాష్ట్రాల్లోని అధికారులను డిప్యూటేషన్ పై తీసుకు రావడం మీద ఎక్కువగా దృష్టి సారించినట్లున్నారు. తొలి సారి కేసీఆర్ తో సమావేశమైనప్పుడు.. తెలంగాణ కేడర్ లో ఉన్న స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మిలను ఏపీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. దానికి కేసీఆర్ కూడా ఓకే అన్నారు. అయితే కేంద్రం మాత్రం అడ్డుపుల్ల వేసింది. ఈ క్రమంలో వారిని ఏపీకి తీసుకొచ్చేందుకు.. విజయసాయిరెడ్డి ఢిల్లీలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని.. ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా వీరి జాబితాలోకి లేడి ఫైర్ బ్రాండ్ ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి సింధూరి పేరు చేరినట్లు తెలుస్తోంది.

హసన్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న రోహిణి సింధూరి కర్ణాటకలో సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఖమ్మం జిల్లా రుద్రాక్షపల్లిలో జన్మించిన దాసరి రోహిణి హైదరాబాద్‌లో పెరిగారు. 2009 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె.. నెల్లూరు జిల్లాకు చెందిన సుధీర్ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న సుధీర్ రెడ్డికి.. వైసీపీ నేతలతో పరిచయాలున్నాయని కూడా చెబుతున్నారు.

సిన్సియర్ అధికారిగా పేరొందిన రోహిణి.. కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో మంత్రి మంజు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలియడంతో తగిన చర్యలు తీసుకున్నారు. ఆమె నిబద్ధత తనకు అడ్డంగా మారడంతో.. మంత్రి మంజు ఒత్తిడితో సీఎం కుమార స్వామి ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. కానీ కోర్టు జోక్యంతో ఆమెను తిరిగి హసన్ కలెక్టర్‌గానే కొనసాగించారు.

ఈ క్రమంలోనే రోహిణి సేవలను తమ రాష్ట్రం కోరుకుంటుందని సీఎం జగన్ కర్ణాటక ప్రభుత్వానికి, కేంద్రానికి లేఖ రాసారు. కర్ణాటక ప్రభుత్వం ఎలాగూ సరే అనే అవకాశముంది. ఇక కేంద్రం అంగీకరిస్తే.. రోహిణీ త్వరలోనే ఏపీలో పని చేయడానికి వస్తారు. మండలాల్లో సమస్యల పరిష్కారానికి జగన్ కలెక్టర్లు, ఎస్పీ లతో ప్రతీ సోమవారం నిర్వహింప జేస్తున్న ప్రతిష్టాత్మక స్పందన కార్యక్రమానికి రోహిణి ని ఇంచార్జ్ గా నియమించాలన్నది సీఎం అంతరంగంగా చెబుతున్నారు.