TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వాటర్ ట్యాంకెక్కిన తల్లీకూతుళ్లు

Published on: Tue Aug 28, 2012 12:33PM

కట్నంకోసం అత్తింటి ఆరళ్లు.. కొత్తగా ఆడపిల్ల పుట్టిందని భర్త వేధింపులు.. పెళ్లాన్ని తీసుకెళ్లి అత్తగారింట్లో వదిలేశాడు.. ఏం చేయాలో

పాలుపోని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బులే తిన్నారో లేక పరపతే పనిచేసిందో తెలీదుకానీ.. సాయం చేయాల్సిన పోలీసులు రివర్స్ లో బాధితుల్నే బెదిరించడం మొదలుపెట్టారు. రోజూ మానసిక వ్యథ.. తట్టుకోలేని బాధితురాలు తన తల్లినీ, పసిపాపను తీసుకుని వాటర్ ట్యాంక్ మీదికెక్కేసింది. తనకు న్యాయం చేయకపోతే దూకేస్తానంటూ హల్ చల్ సృష్టించింది. తూర్పుగోదావరి జిల్లా పెదపూడిలో ఈ ఘటన జరిగింది. పెదపూడికి చెందిన విఘ్నేశ్వరి కూతురు రామతులసికి కాకినాడకు చెందిన శ్రీకాంత్ తో 2009లో పెళ్లైంది. రామతులసికి అప్పట్నుంచీ రోజూ వేధింపులే.. అదనపు కట్నం తీసుకురమ్మని భర్త, అత్తమామలు పెట్టే ఆరళ్లను కడుపులోనే పెట్టుకుని ఇన్నాళ్లూ బాధపడింది రామతులసి. ఆడపిల్ల పుట్టిందన్న నెపంతో శ్రీకాంత్ ఆమెని పుట్టింట్లో వదిలేశాడు. విడాకులివ్వమని ఒత్తిడి చేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తన గోడుని పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన రామతులసి నేరుగా వాటర్ ట్యాంక్ మీదికెక్కేసింది. ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ వచ్చిన తమకు న్యాయం చేస్తామని హామీ ఇస్తేనే కిందికి దిగుతానంటూ పట్టుబట్టింది. ఈ విషయాన్ని పోలీసులు స్థానిక ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డికి తెలిపారు. బాధితులుంటున్న నియోజకవర్గం ఎమ్మెల్యే శేషా రెడ్డి కూడా వెంటనే స్పందించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు వాటర్ ట్యాంక్ దగ్గరికెళ్లి తల్లీకూతుళ్లకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వాటర్ ట్యాంక్ మీదినుంచి దిగొచ్చారు.