దేవుడి దయవల్ల బతికి బయటపడ్డా : దేవినేని ఉమ
Published on: Thu Jul 21, 2022 11:28PM
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం కోనసీమ జిల్లా సోంపల్లి వద్ద బోటు ప్రమాదం జరిగిన సంగతి విదితమే. ఆ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ సంఘటనలో పలువురు నేతలు గోదవరిలో పడిపోయారు.
అలా పడిపోయిన వారిలో మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా ఉన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన అనంతరం వలేకరులతో మాట్లాడిన దేవినేని ఉమ నీటిలో పడగానే ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అయ్యానని చెప్పారు. ప్రాణం పోయిందనే అనుకున్నాననీ, భగవంతుడి దయవల్లే బతికి బయటపడ్డానని చెప్పారు.
ప్రమాదం జరగడానికి క్షణాల ముందు చంద్రబాబు వేరే పడవలోకి మారారు. ఈ సంఘటనలో దేవినేని ఉమతో పాటు మాజీ మంత్రి ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని సోంపల్లి సమీపంలో ఓ పడవ నుంచి టీడీపీ నేతలు మరో పడవలోకి మారుతున్న సమయంలో వారున్న పడవ ఓ వైపునకు ఒరిగిపోయింది. ఈ ఘటనలో దేవినేని ఉమతో పాటు పితాని సత్యనారాయణ, ఉండి ఎమ్మెల్యే రామరాజు, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ కూడా గోదావరిలో పడిపోయారు. అయితే వీరందరినీ సిబ్బంది, సమీపంలో ఉన్న మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రమాదం ఒడ్డుకు సమీపంలో జరగడంతో పెను ప్రమాదం తప్పింది.


