జనసేన తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న హైపర్ ఆది!!

 

జబర్దస్త్ కామెడీ షోతో హైపర్ ఆది ఎంత ఫేమస్ అయ్యారో తెలిసిందే. తన కామెడీ టైమింగ్ తో తక్కువ టైం లోనే ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు సినిమాలతో కూడా బిజీ అయ్యారు. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఆది పెద్ద ఫ్యాన్ అని అందరికీ తెలిసిందే. పవన్ మీద ఎవరైనా విమర్శలు చేస్తే ఆది వెంటనే రియాక్ట్ అవుతారు. గతంలో కత్తి మహేష్ కాంట్రవర్సీలో ఆది రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. పవన్ కి మద్దతుగా మాట్లాడుతూ కత్తి మీద విమర్శలు గుప్పించారు. అంతేకాదు కొన్ని కామెడీ స్కిట్స్ లో పరోక్షంగా కత్తి మీద జోకులు కూడా వేశారు. ఆ టైంలో ఆదికి పవన్ ఫ్యాన్స్ మద్దతుగా నిలిచారు. ఓ రకంగా ఆది ఆ ఇన్సిడెంట్ తో పవన్ ఫ్యాన్స్ కి బాగా దగ్గరయ్యారనే చెప్పాలి. అదే ఇప్పుడు ఆది పాలిట వరంలా మారినట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేన బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జనసేన తరుపున పలువురు టిక్కెట్లు ఆశిస్తున్నారు. సినిమా ప్రముఖులు కూడా కొందరు జనసేన నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జనసేన నుంచి హైపర్ ఆది కూడా బరిలోకి దిగే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి. ఆది ఇప్పటికే జనసేన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కార్యకర్తల సమావేశాల్లో పాల్గొని తన స్పీచ్ తో ఉత్సాహం నింపుతున్నారు. రీసెంట్ గా చిత్తూరు జిల్లాలో జనసేన ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో హైపర్ ఆది మాట్లాడుతుండగా.. వైసీపీ కార్యకర్తలు అడ్డుకొని సభను రసాభాస చేశారు. ఆది కారుపై దాడి కూడా చేశారు. ఈ దాడులకు మేం భయపడం అంటూ వేదిక పైనుంచే ఆది గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు 'నాకు ప్రసంగాలు ఇవ్వడం అంటే చాలా ఇష్టం. అందుకే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి సపోర్ట్ చేయాలనుకున్నాను. అందులో నాకు తృప్తి ఉంది' అని తాజాగా ఆది వ్యాఖ్యానించారు. ఓ రకంగా జనసేనలో ప్రస్తుతం ఆది హాట్ టాపిక్ అయ్యారనే చెప్పాలి. ఆది స్పీచ్ లు, డేర్, పవన్ మీద అభిమానం ఇవన్నీ చూసి జనసైనికులు ఆదికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారట. ఈ విషయం పవన్ దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. పవన్ కూడా ఈ విషయంపై కాస్త సానుకూలంగానే ఉన్నారని సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని ఏదైనా నియోజకవర్గం నుంచి.. జనసేన తరుపున ఆది ఎమ్మెల్యేగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.